North Korea Banned Laughing: ఓవైపు నియంత పాలన.. మరోవైపు ఆకలి కేకలతో నిత్యం నరకం అనుభవించే కొరియన్లపై జాలి చూపించడం తప్ప ప్రపంచం చేయగలిగింది ఏం లేదు. ఈ మధ్యే అధ్యక్షుడిగా పదేళ్ల పాలన పూర్తి చేసుకున్న కిమ్ జోంగ్ ఉన్.. తాజాగా జారీ చేసిన ఉత్తర్వులు అతనిలోని మూర్ఖత్వానికి పరాకాష్టగా నిలిచాయి.
ఉత్తర కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఇల్ వర్దంతి వేడుకల్ని శుక్రవారం(డిసెంబర్ 11) నుంచి 11 రోజులపాటు దేశవ్యాప్తంగా నిర్వహించాలని కిమ్ ప్రభుత్వం నిర్ణయించింది. 1994 నుంచి 2011(చనిపోయేవరకు) ఉత్తర కొరియాను పాలించిన నియంతాధ్యక్షుడు కిమ్‌జోంగ్ ఇల్ చిన్న కొడుకే.. ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. ఈ తరుణంలో వర్ధంతి వేడుకల సందర్భంగా ఉత్తర కొరియాలో విధించిన ఆంక్షల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం.
సినుయిజు సిటీలోని ఫ్రీ ఏషియా రేడియో నెట్‌వర్క్ అందించిన కథనం ప్రకారం.. ఈ పదకొండు రోజులు ఏ పౌరుడు సంతోషంగా ఉండడానికి వీల్లేదు. మద్యం కూడా తాగ కూడదు. ఎవరూ పుట్టినరోజులు జరుపుకోకూడదు. బహిరంగంగా నవ్వడానికి, ఏడవడానికీ వీల్లేదు. ఎటువంటి వేడుకలు చేసుకోవడానికి, వాటిల్లో పాల్గొనకూడదు. చివరికి ఇంట్లో ఎవరైనా చనిపోయినా కన్నీళ్లు పెట్టుకోకూడదు.
వర్ధంతి రోజైన శుక్రవారం.. నిత్యావసరాల దుకాణాల ముందు జనాలెవరూ క్యూ కట్టడానికి వీల్లేదు. విషాద దినాల్లో మాజీ అధ్యక్షుడి నివాళి సమావేశానికి అందరూ హాజరవ్వాలి. వీటిని ఎవరు ఉల్లంఘించినా(కిమ్ కుటుంబం, పేషీ తప్ప) వాళ్లు నేరగాళ్ల కిందే లెక్క. శిక్షగా వాళ్లు మళ్లీ కనిపించకుండా పోతారు(అయితే మరణశిక్ష లేదంటే జీవితకాలం బానిస బతుకు).
ఈ పదేళ్లలో ఇలాంటి ఉత్తర్వులు జారీ కావడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. ఈ ఆదేశాల్ని జనాలు పాటించేలా చూడాల్సిన బాధ్యత పోలీసులదే. ఇందుకోసం వాళ్లను నిద్ర కూడా పోకూడదన్న ఆదేశాలు జారీ చేసిందట కిమ్ కార్యాలయం.
కొత్తేం కాదుగా..
- ఈ ఏడాది మొదట్లో కిమ్ కార్యాలయం.. జనాలను టైట్ జీన్స్ వేయకూడదని, స్టయిల్‌గా రెడీ కాకూడదని ఆదేశాలు జారీ చేసింది.
- క్యాపిటలిస్టిక్ లైఫ్‌స్టయిల్ కొరియా యువత మీద ప్రతికూల ప్రభావం చూపెడుతోందన్న ఉద్దేశంతో పాప్ కల్చర్‌ను బ్యాన్ చేశాడు.
- తన స్టయిల్‌ను కాపీ కొట్టకూడదనే ఉద్దేశంతో ఆ తరహా లెదర్ జాకెట్లను నిషేధించాడు.
- స్క్విడ్ గేమ్ దక్షిణ కొరియా సిరీస్ కావడంతో.. దానిని సర్క్యులేట్ చేసిన ఓ వ్యక్తిని కాల్చి చంపడంతో పాటు ఓ స్కూల్ ప్రిన్స్‌పాల్, టీచర్, ఐదుగురు పిల్లలకు బానిస శిక్షను అమలు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment