7 ఖండాలు కాదు ఏక ఖండమే..! | Not Seven Continents There Will Be Only One Continent | Sakshi
Sakshi News home page

7 ఖండాలు కాదు ఏక ఖండమే..!

Published Sun, Oct 9 2022 7:52 AM | Last Updated on Sun, Oct 9 2022 9:52 AM

Not Seven Continents There Will Be Only One Continent - Sakshi

భూమ్మీద ఇప్పుడున్నవి ఏడు ఖండాలు.. కావాలంటే గబగబా పేర్లు కూడా చెప్పేస్తుంటారు. అందులో పెద్ద ఖండం ఏదంటే ఆసియా అని టక్కున చెప్పేస్తారు.. మరి భవిష్యత్తులో అతిపెద్ద ఖండం ఏమిటో తెలుసా ‘అమేషియా’. ఇప్పుడు వేల కిలోమీటర్లలో విస్తరించి ఉన్న ఖండాల కన్నా పెద్దగా అతిపెద్ద ఖండంగా అది నిలుస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా..

పసిఫిక్‌ మహాసముద్రం  మూసుకుపోయి..
భూమ్మీద భవిష్యత్తు పరిణామాలు, ఖండాలపై ఆస్ట్రేలియాకు చెందిన న్యూ కర్టిన్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నా­రు. భూమ్మీద సుమారు 20, 30 కోట్ల ఏళ్లలో పసిఫిక్‌ మహా సముద్రం మూసుకుపోయి.. ఖండాలన్నీ కలిసి అతిపెద్ద ఖండం ఏర్పడుతుందని వారు చెప్తున్నారు. దానికి ‘అమేషియా’ అని పేరుపెట్టారు.

 సూపర్‌ కంప్యూటర్‌  సాయంతో..
భూమ్మీద ఒకప్పుడు ఖండాలన్నీ ఒకే దగ్గర ఉండేవని.. తర్వాత విడిపోయాయని తెలిసిందే. ఇప్పటికీ ఖండాలు కదులుతూనే ఉన్నాయి కూడా. ఈ క్రమంలో సముద్రాల అడుగున ఉన్న భూభాగాలు పైకి తేలడం, ఇప్పుడున్న భూభాగాలు మునగడం జరుగుతుందని అంచనా. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు సూపర్‌ కంప్యూటర్‌ సాయంతో.. భవిష్యత్తులో భారీ ఖండాలు ఎక్కడ ఏర్పడవచ్చన్న దానిపై పరిశోధన చేశారు. అందులో గత పది కోట్ల ఏళ్లలో ఏర్పడిన అట్లాంటిక్, హిందూ సముద్ర ప్రాంతాల కంటే.. బాగా పురాతనమైన పసిఫిక్‌ ప్రాంతానికి పైకితేలే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు అంచనా వేశారు.

ప్రతి 60 కోట్ల ఏళ్లకోసారి కొత్త ఖండాలు
భూమి ఏర్పడి సుమారు 200 కోట్ల ఏళ్లు అయిందని అంచనా. అప్పటి నుంచి ప్రతి 60 కోట్ల ఏళ్లకోసారి భూమిపై ఉన్న ఖండాలు కదులు­తూ, ఢీకొడుతూ కొత్తగా ఖండాలు ఏర్పడుతుంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇప్పుడున్న ఖండాలు ఏర్పడి ఇప్పటికే 30, 40 కోట్ల ఏళ్లు అయిందని.. మరో 20, 30 కోట్ల ఏళ్లలో కొత్త ఖండాలు ఏర్పడుతాయని చెబుతున్నారు.

‘అమేషియా’ పేరే ఎందుకు?
ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలు కదిలి వచ్చి ఆసియాను ఢీకొట్టడం వల్ల పసిఫిక్‌ మహా సముద్రం మూసుకుపోయి కొత్త భారీ ఖండం ఏర్పడుతుందని శాస్త్రవేత్తల అంచనా. ఆస్ట్రేలి­యా ఖండం ఈ రెండింటి మధ్య­కు వచ్చి ఇరుక్కుంటుందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే అమెరికా, ఆసియా పేర్లు కలిసేలా ‘అమేషియా’ అని కొత్త ఖండానికి పేరు పెట్టారు.

సముద్రాలు తగ్గిపోయి..  ఉష్ణోగ్రతలు పెరిగిపోయి..
అమేషియా అతి భారీ ఖండంగా ఏర్పడినప్పు­డు.. భూమిపై సముద్రాల ఎత్తు తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భారీ ఖండం కావడం వల్ల చాలా ప్రాంతాలు సముద్రానికి దూరంగా ఉంటాయని.. ఆయా చోట్ల ఉష్ణోగ్రతలు అత్యంత ఎక్కువ స్థాయికి చేరుతాయని పేర్కొంటున్నారు.

ఇంతకు ముందూ  ఇలాంటి థియరీ
కోట్ల ఏళ్ల కింద భూమ్మీద ఖండాలన్నీ కలిసి ఒకే భూభాగంగా ఉండేవి. దాన్ని పాంజియాగా పిలుస్తుంటారు. భవిష్యత్తు­లోనూ అలా ఖండాలన్నీ కలిసి ‘పాంజియా ప్రాక్సి­మా’­గా ఏర్పడతాయని 1982లో అమెరికన్‌ భూతత్వ నిపుణుడు క్రిస్టోఫర్‌ స్కాటిస్‌ ప్రతిపాదించారు. అయితే సముద్రాలు, ఖండాల కలయిక ఎలా ఉంటుందన్న అంచనాలేమీ వెలువరించలేదు.
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement