న్యూఢిల్లీ: గత యేడాది ప్రారంభంలో కేవలం అతి తక్కువ కాలంలోనే కరోనా డెల్టా స్ట్రెయిన్ ఘోర మారణహోమం సృష్టించింది. ముఖ్యంగా మనదేశంలో ఏప్రిల్ - మే నెలల్లో లక్షల మరణాలకు కారణమైంది. దీని నుంచి పూర్తిగా బయటపడక ముందే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మరొకమారు ప్రపంచాన్ని ఉలిక్కిపాటుకు గురిచేస్తోంది. దీనిని ధృవీకరిస్తూ ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు, వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
వీరి అధ్యయన ఫలితాలు ఏం చెబుతున్నాయంటే.. ఒక వ్యక్తికి సార్స్ కోవిడ్- 2 వైరస్‌కు చెందిన డెల్టా స్ట్రెయిన్, ఒమిక్రాన్ రెండూ ఒకేసారి సోకినట్లయితే అతనిలో సూపర్ స్ట్రెయిన్ అభివృద్ది చెందే అవకాశాలు ఉన్నట్లు ఒక నిపుణుడు అభిప్రాయపడుతున్నాడు. అంతేకాకుండా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ డెల్టా కంటే 30 రెట్లు అధికంగా స్పైక్ ప్రొటీన్ కలిగి ఉందని దీనిని ఎదుర్కోవడం కష్టసాధ్యమని అంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా శర వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ ఉధృతి చూస్తుంటే సూపర్ స్ట్రెయిన్ అవకాశాన్ని తోసిపుచ్చలేమని యూకే పార్లమెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమిటీకి మోడెర్న్స్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పాల్ బర్టన్ తెలిపారు. రెండు వైరస్‌లను తట్టుకునే శక్తి ఖచ్చితంగా మనుషుల్లో ఉండదనే విషయాన్ని దక్షిణాఫ్రికా కూడా మీడియాలో ప్రచురించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ రెండు వేరియంట్‌లు జన్యువులను మార్చుకుని మరింత ప్రమాదకరంగా రూపాంతరం చెందడం సాధ్యమేనని యూకే పార్లమెంటేరియన్‌లకు ఆయన చెప్పాడు. అంతేకాకుండా ఒకసారి ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ సోకినవారికి తిరిగి మళ్లీమళ్లీ సోకే అవకాశం 5 రెట్లు ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడించాయని, డెల్టా కంటే దీని ఉధృతి తక్కువ అనడానికి ఎటువంటి సంకేతాలు బయటపడలేదని తెలిపారు.
కాగా నవంబర్ 29 నుంచి డిసెంబర్ 11 మధ్య కోవిడ్ సోకిన వ్యక్తులపై నేషనల్ హెల్త్ సర్వీస్ డేటా ఆధారంగా యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ, లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ నిర్వహించిన అధ్యయన ఫలితాలు ఈ విషయాలను వెల్లడించాయి. ఐతే డెల్టాకంటే ఒమిక్రాన్ ఏవిధంగా ప్రాణాలకు హాని చేకూరుస్తుంది, దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందనే విషయంలో ఎటువంటి ఆధారాలు కనుగొనబడలేదని అన్నారు.
వాక్సిన్ స్టేటస్, వయస్సు, లింగం, జాతి, లక్షణరహిత స్థితి, ప్రాంతం ఆధారంగా డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ 5.4 రెట్లు ఎక్కువ సార్లు మళ్లీ మళ్లీ సోకే ప్రమాదం ఉన్నట్లు అధ్యయనం తెలిపింది.
చదవండి: 18 యేళ్లకే స్వయంకృషితో సొంత కంపెనీ.. నెలకు లక్షల్లో లాభం!!
Comments
Please login to add a commentAdd a comment