న్యూఢిల్లీ: డెల్టా వేరియంట్‌ను మించి మూడురెట్ల వేగంతో వ్యాపిస్తున్న కరోనా వేరియంట్ ఒమిక్రాన్‌తో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు. ‘దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే వేరియంట్ ఆఫ్ కన్సర్న్‌గా డెల్టా వేరియంట్ ఉంది. తాజాగా, వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అయిన ఒమిక్రాన్ అందుకు మూడు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు ప్రస్తుతం ఆధారాలున్నాయి. అందుకే, అన్ని స్థాయిల్లోనూ అప్రమత్తత, డేటా ఎనాలిసిస్, నిర్ణయాత్మకంగా వ్యవహరించడం, కంటైన్‌మెంట్ విషయంలో చురుగ్గా ఉండాలి’అని ఆయన పేర్కొన్నారు.
‘వార్‌రూంలను క్రియాశీలకం చేయాలి. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేసుల్లో చిన్నపాటి పెరుగుదల కనిపించిన ప్రాంతాలపైనా దృష్టిపెట్టాలి. జిల్లా, స్థానిక స్థాయిల్లో కంటెయిన్‌మెంట్ చర్యలను కట్టుదిట్టం చేయాలి. అవసరమైన చోట్ల రాత్రి కర్ఫ్యూ విధించాలి. పెళ్లిళ్లు, ఉత్సవాల్లో ప్రజలు భారీగా గుమికూడకుండా నియంత్రించాలి. వైరస్ బాధితుల హోం ఐసోలేషన్ సమయంలో నిబంధనలను తు.చ.తప్పకుండా పాటించాలి’అని ఆయన పేర్కొన్నారు. ‘డోర్ టు డోర్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అర్హులైన మొదటి, రెండో డోస్ లబ్ధిదారులందరికీ టీకా వేగంగా అందేలా చూడాలి. వ్యాక్సినేషన్‌లో జాతీయ సగటు కంటే తక్కువగా నమోదైన జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి’అని ఆయన కోరారు.
గత వారం రోజులుగా టెస్ట్ పాజిటివిటీ రేటు 10%, అంతకంటే ఎక్కువగా ఉన్న, ఐసీయూ బెడ్ ఆక్యుపెన్సీ 40%, ఆపైన ఉన్న ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని సూచించారు. క్లస్టర్లలో సేకరించిన శాంపిళ్లను తక్షణమే తప్పనిసరిగా జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ఇన్సాకాగ్ ల్యాబ్‌లకు పంపాలన్నారు.
ప్రస్తుతం పిల్లలకు టీకా అక్కర్లేదు
ప్రస్తుతానికి దేశంలో చిన్నారులకు కోవిడ్–19 టీకా అవసరం లేదని వ్యాధి నిరోధకతపై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం(ఎన్‌టీఏజీఐ) స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్‌టీఏజీఐ వర్కింగ్ గ్రూప్‌లో నిర్ణయించినట్లు పేర్కొంది. ‘పిల్లలకు కోవిడ్ ముప్పు అంతగా లేదు. అందుకే, చిన్నారులకు కోవిడ్ వ్యాక్సినేషన్ అవసరం లేదు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేశాం’అని మంగళవారం ఎన్‌టీఏజీఐ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment