థెరపీ డాగ్‌గా సేవలందిస్తోన్న మ్యాగీ
బీరూట్: ప్రాణం లేని వస్తువనుకున్నారో ఏమో.. ఆ క్రూరులు అభంశుభం తెలియని ఆ శునకాన్ని దారుణంగా హింసించారు. దాన్ని గన్ ఫైరింగ్‌కు లక్ష్యంగా మార్చి ప్రాణాలతో చెలగాటం ఆడారు. కళ్లు, ఓ చెవి పోగోట్టుకుంది, ఎముకలు విరగొట్టుకుంది. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అది అదృష్టం బాగుండి బతికింది. మంచి మనుషుల తోడుతో నేడు ప్రపంచం మెచ్చే స్థాయికి ఎదిగింది. తనకు హాని చేసిన మనషులకు సేవ చేస్తోంది.
వివరాలు.. లెబనాన్‌కు చెందిన మ్యాగీ అనే కుక్కపై దాని మాజీ యజమానులు అత్యంత దారుణానికి ఒడిగట్టారు. గన్‌ఫైరింగ్ ప్రాక్టీస్ చేయటానికి దాన్నో లక్ష్యంగా వాడుకున్నారు. కాళ్లు కట్టేసి పెల్లెట్స్(డూప్లికేట్ గన్‌కు సంబంధించిన బుల్లెట్ లాంటి గుళ్లు)తో కాల్పులు జరిపారు. దాని ఒంటినిండా పెల్లెట్స్‌తో తూట్లు పెట్టారు. పాపం అరిచి, మొత్తుకున్నా విడవలేదు. దాని ముక్కు, రొమ్ము, భుజాలు ఇతర శరీర భాగాల్లో దాదాపు 200 గుళ్లు దింపారు.
ముఖ్యంగా దాని ముఖంపై కాల్చటంతో కంటి చూపుకోల్పోయింది. అంతేకాదు, దాని దవడ విరిగింది.. ఓ చెవిని కూడా కోల్పోయింది. ప్రాణాల కోసం పోరాడుతున్న దాన్ని తీసుకుపోయి దూరంగా పడేశారు. చావు బతుకులతో పోరాడుతున్న దాన్ని గుర్తించిన ‘‘ వైల్డ్ యాట్ హార్ట్ ఫౌండేషన్’’ అనే జంతు సంరక్షణా సంస్థ రక్షించింది. అనంతరం మ్యాగీ కథ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బ్రిగ్టన్‌కు చెందిన క్యాసీ చార్లీన్ అనే మహిళ దాన్ని దత్తత తీసుకుంది. దానికి శిక్షణ ఇచ్చి థెరపీ డాగ్‌గా తీర్చిదిద్దింది. (చదవండి: ‘మా ఇంటి రాజసం.. మా బంగారు శునకం’)
2019లో మ్యాగీ పూర్తి స్థాయి థెరపీ డాగ్‌గా మారింది. డిమెన్షియా(మతి మరుపు వ్యాధి)తో బాధపడుతున్న వారికి సహాయం చేస్తోంది. అంతేకాదు స్కూళు పిల్లలు, పోలీస్, ఫైర్ ఫైటర్స్‌కు తోడుగా ఉంటోంది. 2020లో కరోనా సమయంలోనూ సేవలను అందించింది. దేశంలో కరోనా తగ్గు ముఖం పట్టడంతో పలు ఆంక్షలు ఎత్తేశారు. దీంతో చాలా నెలల తర్వాత తను ఉంటున్న కేర్ హోమ్‌కు మ్యాగీ చేరుకుంది. అక్కడ ఉంటున్న తన కిష్టమైన వ్యక్తి యానీని కలుసుకుంది. (చదవండి: షాపింగ్ చేస్తోన్న కుక్క.. నెటిజనులు ఫిదా)
యానీని కలుసుకోక సంవత్సరం కావస్తున్నా.. ఆమెను మ్యాగీ ఏ మాత్రం మర్చిపోలేదు. కేర్ హోమ్‌లోకి అడుగుపెట్టగానే నేరుగా యానీ రూమ్ దగ్గరకు వెళ్లిపోయింది. ఆ తర్వాతే మిగితా వ్యక్తుల్ని కలుసుకుంది. ప్రస్తుతం మ్యాగీ కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు మ్యాగీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. గతంతో దాన్ని దత్తత తీసుకోవటానికి ఎవ్వరూ రాలేదు. కానీ, ఇప్పుడు లక్షల మంది దాన్ని పెంచుకుంటామంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment