లండన్: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ.. ఈ ఫిబ్రవరి 24వ తేదీకి ఏడాది పూర్తి చేసుకోనుంది. ఈ ఏడాది కాలంలో ఎన్నో ప్రాణాలను బలిగొంది ఈ యుద్ధం. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెనక్కి తగ్గబోడని.. అవసరమైతే మరో ఏడాదిపాటు కొనసాగిస్తాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజాగా బ్రిటన్ రక్షణ కార్యదర్శి బెన్ వాలెస్.. ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలపై స్పందించారు. రష్యా, ఉక్రెయిన్ ప్రజల జీవితాల పట్ల మాత్రమే కాకుండా.. తన సొంత సైనికుల పట్ల పూర్తి నిర్లక్ష్యం చూపిందని ఆయన ఆరోపించారు. మేం ఇక్కడి పరిస్థితులను ఏడాది కాలంగా చూస్తున్నాం. లక్షా 88 వేలమంది రష్యా సైనికులు మరణించారు, గాయపడ్డారు. దీనికి పుతిన్ దూకుడు కారణం అని ఆయన అభిప్రాయపడ్డారు.
రష్యాకు సంబంధించి 97 శాతం ఉక్రెయిన్ యుద్ధంలోనే ఏడాదికాలంపాటు లీనమైందని, యుద్ధ ట్యాంకర్లలో మూడింట రెండోవంతు పూర్తిగా నాశనం అయిపోయాయని, అయినా కూడా ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవడంలో పుతిన్ ఘోరంగా విఫలమయ్యాడని తెలిపారు బెన్ వాలెస్. అయినా పుతిన్ దురాక్రమణపై వెనక్కి తగ్గబోడని అంచనా వేశాడాయన. నరమేధం కొనసాగినా.. అంతర్జాతీయ సమాజం నుంచి ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా పుతిన్ తన వైఖరి మార్చుకోకపోవచ్చనే అంటున్నారాయన.
2022 ఫిబ్రవరి 24వ తేదీన రష్యా దురాక్రమణకు పుతిన్ రష్యా బలగాలను ముందుకు పంపాడు. ఆ సమయంలో పుతిన్ లక్ష్యం ఒక్కటే. మూడు వారాల్లో ఉక్రెయిన్‌లో ఉన్న అన్ని ప్రధాన నగరాలను ఆక్రమించేసుకోవాలని. పైగా మూడే రోజుల్లో రాజధాని కీవ్ నగరాన్ని హస్తగతం చేసుకోవాలనుకున్నాడు. తద్వారా యుద్ధం ముగుస్తుందని భావించాడు. కానీ, సీన్ రివర్స్ అయ్యింది. యుద్ధం 365 రోజులు సాగింది. తాను అనుకున్నవాటిల్లో ఒక్కటి కూడా సాధించలేకపోయాడని వాలెస్ తెలిపాడు.
ఇదిలా ఉంటే.. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం నివేదిక ప్రకారం.. ఈ ఏడాది కాలంలో ఎనిమిది వేల మంది సాధారణ పౌరులు మరణించినట్లు, 14 వేలమంది దాకా గాయపడినట్లు నివేదిక వెల్లడించింది.
మేం గెలుస్తాం
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు ఏడాది పూర్తవుతున్న సందర్భంలో.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఉక్రెయిన్ విజయం తధ్యమని మరోసారి ధీమా వ్యక్తం చేశాడాయన. మేము విచ్ఛిన్నం కాలేదు. అనేక పరీక్షలను అధిగమించాము. మేం గెలిచి తీరతాం అని అన్నారాయన. యుద్ధమనే చెడును మా దేశానికి తెచ్చిన వాళ్లను నిలువరించిన తీరతామని ధీమా వ్యక్తం చేశాడాయన.
Comments
Please login to add a commentAdd a comment