కలినీవ్కా పట్టణంలో రష్యా వైమానిక దాడిలో అగ్నికి ఆహుతి అవుతున్న చమురు నిల్వ కేంద్రం
వాషింగ్టన్/కీవ్: నెల దాటుతున్నా ఉక్రెయిన్‌పై పోరులో పెద్దగా సాధించిందేమీ లేకపోగా ఆర్థికంగా, సైనికంగా భారీ నష్టాలు ఎదురవుతుండటంతో రష్యా వ్యూహం మార్చిందా? ముఖ్యంగా అస్సలు కొరుకుడు పడని రాజధాని కీవ్‌ను వదిలి డోనెట్స్‌క్, లుహాన్స్‌క్ తదితర వేర్పాటువాద ప్రాంతాల సమాహారమైన పారిశ్రామిక హబ్ డోన్బాస్‌పై పూర్తి పట్టు సాధించాలన్న నిర్ణయానికి వచ్చిందా? అవుననే అంటున్నారు అమెరికా రక్షణ నిపుణులు. అక్కడినుంచి వీలును బట్టి యుద్ధాన్ని విస్తరించడమో, గౌరవప్రదంగా వెనుదిరగడమో చేయాలన్నది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొత్త ఎత్తుగడగా కన్పిస్తోందని వారు చెబుతున్నారు.
ఏదేమైనా రష్యా ఇప్పటికే వెనక్కు తగ్గినట్టేనని, ఒకరకంగా ఇది ఉక్రెయిన్ విజయమేనని వారంటున్నారు. ‘‘అమెరికా, పశ్చిమ దేశాలు భారీగా అందజేస్తున్న అత్యాధునిక ఆయుధాల సాయంతో ఉక్రేనియన్ దళాలు రెట్టించిన ఉత్సాహంతో విరుచుకుపడుతున్నాయి. రక్షణకే పరిమితమైన స్థాయిని దాటి గేరు మార్చి ఎక్కడికక్కడ భారీగా ఎదురుదాడికి దిగుతున్నాయి. దీనికి వనరుల లేమి, నిత్యావసరాల కొరత తోడవడంతో రష్యా సైన్యం బాగా నీరసించింది. నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయింది. దాంతో రష్యాకు రూటు మార్చడం తప్ప మరో మార్గం కన్పించడం లేదు’’ అని విశ్లేషిస్తున్నారు.
ఉక్రెయిన్ సైనిక సంపత్తిని బాగా దెబ్బతీయడంతో యుద్ధం తాలూకు తొలి దశ ముగిసినట్టేనన్న రష్యా సైనిక ప్రతినిధి కల్నల్ జనరల్ సెర్గీ రుడ్‌స్కోయ్ చేసిన ప్రకటన ఇందుకు అద్దం పడుతోందని వారు చెబుతున్నారు. ఇక తమ ప్రధాన లక్ష్యమైన డోన్బాస్ విముక్తిపై దృష్టి సారిస్తామని ఆయన చెప్పడం పుతిన్ వ్యూహంలో మార్పును చెప్పకనే చెబుతోందంటున్నారు. రష్యా తీరులో వచ్చిన మార్పును పసిగట్టిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెంటనే మరోసారి సంధి ప్రతిపాదన చేశారు. అయితే డోన్బాస్‌తో పాటు తమ భూభాగంలో అంగుళం కూడా వదులుకునేది లేదని స్పష్టం చేశారు. అయితే డోన్బాస్ ప్రాంతం ఇప్పటికే దాదాపుగా రష్యా అధీనంలోనే ఉందని పశ్చిమ దేశాలు గుర్తు చేస్తున్నాయి.
2014 నుంచీ రష్యా దన్నున్న వేర్పాటువాదుల ప్రభుత్వాలే అక్కడ నడుస్తున్నందున కేవలం దానిపై పట్టుతో సంతృప్తి పడటం రష్యాకు ఓటమి కిందే లెక్క అంటున్నాయి. సైన్యాన్ని ఉక్రెయిన్ అంతటా విస్తరించి అన్నివైపుల నుంచీ దాడికి దిగడం ద్వారా రష్యా దిద్దుకోలేని పొరపాటు చేసిందని విశ్లేషిస్తున్నాయి. ‘‘అఫ్గానిస్తాన్‌తో పదేళ్ల యుద్ధంలో నష్టపోయినంత కంటే ఎక్కువ మంది సైనికులను నెలలోపే రష్యా కోల్పోవడం ఆశ్చర్యమే. రెండు దశాబ్దాల ఆధునీకరణ తర్వాత కూడా రష్యా సైన్యంలో ఎంతటి లోటుపాట్లున్నాయో, సైనిక విభాగాల మధ్య ఎంత సమన్వయ లోపముందో ఈ యుద్ధంతో స్పష్టమైంది’’ అని రక్షణ నిపుణులు అంటున్నారు.
చెహిర్నివ్‌లో ధ్వంసరచన
రేవు పట్టణం మారియుపోల్‌ను దాదాపుగా నేలమట్టం చేసిన రష్యా దళాలు చెహిర్నివ్‌పైనా అదే తీవ్రతతో విరుచుకుపడుతున్నాయి. నిత్యావసరాలు, కరెంటు, ఇతర మౌలిక సదుపాయాల లేమితో నగరం ఇప్పటికే అల్లాడుతోంది. కీవ్‌తో కలిపే కీలక బ్రిడ్జిని ఇటీవల రష్యా ధ్వంసం చేయడంతో పరిస్థితి మరింత విషమించింది. జనం రోడ్ల మీద పొయ్యిలు పెట్టి వండుకుంటున్నారు! దాదాపు 3 లక్షల జనాభాలో సగానికి పైగా ఇప్పటికే వలస బాట పట్టింది. మృతుల సంఖ్య వేలల్లో ఉంటుందని చెప్తున్నారు. ఇళ్లు, ఆస్పత్రులు, పౌర ఆవాసాలపై విచక్షణారహితంగా దాడులు జరుగుతున్నాయి.
ఇతర నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని సమాచారం. డోన్బాస్‌పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తూనే నగరాలపై దాడిని కొనసాగించాలన్నది రష్యా ఎత్తుగడగా కన్పిస్తోందని ఇంగ్లండ్ రక్షణ శాఖ అంటోంది. కీవ్‌కు పశ్చిమాన 50 కిలోమీటర్ల దూరంలోని యస్నోహోర్దొకా గ్రామం నుంచి కూడా రష్యా దళాలను ఉక్రెయిన్ సైనికులు తాజాగా తరిమేసినట్టు సమాచారం. అమెరికా, పశ్చిమ దేశాలు తమకు మరిన్ని ఆయుధాలివ్వాలని జెలెన్‌స్కీ చీఫ్ ఆఫ్ స్టాప్ కోరారు.
మరోవైపు రష్యా యుద్ధ నేరాలకు సాక్ష్యాలను సేకరించే ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇళ్లు, ఆస్పత్రులు, పౌర ఆవాసాలు, అంగీకరించిన సేఫ్ కారిడార్లు, అణు విద్యుత్కేంద్రాలపై రష్యా ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తోందని, నిషేధిత క్లస్టర్ బాంబుల ప్రయోగానికీ దిగిందని అమెరికా, పశ్చిమ దేశాలతో పాటు ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఆరోపిస్తుండటం తెలిసిందే. ఉక్రెయిన్‌లో ఆస్పత్రులు, అంబులెన్సులు, వైద్య సిబ్బంది, రోగులపై రష్యా సేనలు పదేపదే దాడులు చేస్తున్నాయని ఏపీ వార్తా సంస్థ పేర్కొంది. నెల రోజుల్లో 34 సార్లు ఇలాంటి దాడులకు పాల్పడ్డట్టు చెప్పింది.
అణు దాడికి దిగితే ఖబడ్దార్: నాటో
ఉక్రెయిన్‌పై జరుపుతున్న ఆటవిక యుద్ధంలో పుతిన్ విజయం సాధిచలేరని నాటో ఉప ప్రధాన కార్యదర్శి మిర్కా జెనా అన్నారు. రసాయన, అణు దాడికి దిగితే అదే మోతాదులో నాటో నుంచి ప్రతి చర్యలు తప్పవన్నారు. నాటో అణ్వాయుధ కూటమి అని గుర్తుంచుకోవాలన్నారు. ఉక్రేనియన్లు రష్యా సేనలకు స్వాగతం పలుకుతారని బహుశా పుతిన్ పగటి కలలు కన్నారని ఎద్దేవా చేశారు. ఉక్రెయిన్ సైనిక సంపత్తిని, యూరప్ ఐక్యతను తక్కువగా అంచనా వేసి భారీ తప్పిదం చేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment