రష్యా నుంచి చమురు ధర విషయంలో తగ్గింపు లభించిందని పాక్ గొప్పలు చెప్పుకుంది. గానీ రష్యా మాత్రం భారత్‌కి చమురు ధర తగ్గింపు ఇచ్చినట్లుగా ఇచ్చేదే లేదని కరాఖండీగా చెప్పేసింది. ఈ మేరకు రష్యా అధికారులు, పాక్ ప్రతినిధులు ముసాద్ మాలిక్, మంత్రి(పెట్రోలియం విభాగం), కెప్టెన్ ముహ్మద్ మహమూద్ పెట్రోలియం కార్యదర్శిలతో ఇటీవల మాస్కోలో జరిగిన సమావేశంలో రష్యా ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్‌కి రష్యా చమురు ఉత్పత్తులు ఎక్కువగా పెరిగాయి. గత నెల అక్టోబర్ నుంచి రెండు నెలలు పాటు భారత్‌కి అతి పెద్ద చమురు సరఫరాదారుగా మాస్కో ఉంది. ప్రస్తుతం భారత్ రష్యా చమురును బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. అంతేగాదు రష్యా-పాక్ మధ్య ప్రతిపాదిత చమురు పైప్‌లైన్ ప్రాజెక్ట్‌పై కూడా రష్యా పెద్దగా ఆసక్తి చూపలేదు.
చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ పరిణామాల నేపథ్యంలో యురేషియాలో ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడానికి ఇరాన్‌లోని భారత్ చబహార్ పోర్ట్‌కు మద్దతు ఇవ్వాలని రష్యా నిర్ణయించింది. ఈపోర్ట్‌లో రవాణా సామర్థ్యం పెంపొందించడానికి పెట్టుబడులు పెట్టడానికి కూడా అంగీకరించింది. చబహార్ పోర్ట్‌లో రష్యా ప్రవేశం భారత్ నిర్మించిన ఓడరేవులో సామర్థ్యాన్ని పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అదీగాక చబహార్ పోర్టును ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్ (ఐఎన్‌ఎస్టీసీ)తో అనుసంధించేలా ఆయా దేశాలపై భారత్ ఒత్తిడి చేస్తోంది. ఐఎన్‌ఎస్టీసీ అనేది భారత్, ఇరాన్, అజర్‌బైజాన్, రష్యా, మధ్య ఆసియా, ఐరోపా మధ్య రవాణా కోసం దాదాపు 7,200 కిలోమీటర్ల పొడవున్న ఓడలు, రైలు, రోడ్డు మార్గాల బహుళ వాణిజ్య కారిడార్.
Comments
Please login to add a commentAdd a comment