
ఇస్లామాబాద్: తాత్కాలిక ప్రధానమంత్రి నియామకం జరిగేవరకు ఇమ్రాన్‌ఖాన్ ప్రధానిగా కొనసాగుతారని ఆ దేశాధ్యక్షుడు ఆరిఫ్ ఆల్వి సోమవారం ప్రకటించారు. ఆ పదవికి తగిన వ్యక్తులను సూచించాలని ఆయన ప్రధాని ఇమ్రాన్‌కు, ప్రతిపక్ష నేత షెబాజ్ షరీఫ్‌కు లేఖ రాశారని డాన్ పత్రిక వెల్లడించింది. రాజ్యాంగం ప్రకారం కేబినెట్, జాతీయ అసెంబ్లీ రద్దయినట్లు లేఖలో ఆల్వి వెల్లడించారని తెలిపింది.
జాతీయ అసెంబ్లీ రద్దయిన మూడు రోజుల్లోగా ఇరువురూ ఎవరి పేరునూ సూచించకపోతే స్పీకర్ ఒక కమిటీ ఏర్పాటు చేస్తారని, ఈ కమిటీకి ఇద్దరి పేర్లను ఇమ్రాన్, షరీఫ్ సిఫార్సు చేయాలని ఆల్వి సూచించారు. అయితే ఈ ప్రక్రియలో పాలుపంచుకోనని షరీఫ్ తేల్చిచెప్పారు. ఆపద్ధర్మ ప్రధానిగా ఇద్దరి పేర్లను తాము సూచించామని, షరీఫ్ ఎవరి పేరునూ సూచించకపోతే తాము చెప్పినవారిలో ఒకరు ప్రధాని అవుతారని మాజీ మంత్రి ఫహాద్ చెప్పారు. ఇమ్రాన్ సలహాపై పార్లమెంట్‌ను అధ్యక్షుడు ఆల్వి రద్దు చేయడంపై ప్రతిపక్షాలు కోర్టును ఆశ్రయించాయి.
గుల్జార్‌ను నామినేట్ చేసిన ఇమ్రాన్
పాక్ మాజీ ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్ పేరును ఆపద్ధర్మ ప్రధాని పదవికి ఇమ్రాన్‌ఖాన్ నామినేట్ చేశారు. పార్టీ కోర్ కమిటీలో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. అధ్యక్షుడి లేఖపై చర్చించి గుల్జార్ పేరును నామినేట్ చేశామన్నారు. ఆర్టికల్ 224– ఏ1 ప్రకారం ఎన్నికల నిర్వహణకు దేశంలో కేర్‌టేకర్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. ఈ అధికారం అధ్యక్షుడికి ఉందని ప్రెసిడెంట్ ఆఫీసు ప్రకటించింది. జస్టిస్ గుల్జార్ 2019 డిసెంబర్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. నవాజ్ షరీఫ్ అనర్హత తీర్పు వెలువరించిన బెంచ్‌లో ఆయన సభ్యుడు. ప్రభుత్వాలు, అధికారులపై ఘాటైన వ్యాఖ్యలు చేస్తారని గుల్జార్‌కు పేరుంది.
నేను యాంటీ ఇండియన్ కాదు!
తాను భారత్, అమెరికా లేదా మరే ఇతర దేశానికి వ్యతిరేకం కాదని ఇమ్రాన్ ఎప్పారు. అన్ని దేశాలతో సత్సంబంధాలనే తాను కోరుకున్నానన్నారు. పాక్ ప్రజలనుద్దేశించి ఆయన టీవీలో మాట్లాడారు. ప్రభుత్వాన్ని పడదోయడానికి ఒక విదేశీ శక్తి ప్రయత్నించిందన్న వార్తలపై ఆయన స్పందించారు.
విచారణ మరో రోజు వాయిదా
పార్లమెంట్ రద్దుపై విచారణను పాక్ సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదావేసింది. సీజేపీ ఉమర్ అటా బందియల్ నేతృత్వంలోని భారీ బెంచ్ సోమవారం ఈ కేసు విచారణ చేపట్టింది. కేసులో అధ్యక్షుడితో సహా పలువురిని ప్రతివాదులుగా చేర్చింది. అసెంబ్లీ రద్దుపై డిప్యూటీ స్పీకర్ నిర్ణయానికి సంబంధించి ప్రతిపక్ష, అధికార పార్టీల న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఫుల్‌బెంచ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపక్ష డిమాండ్‌ను సీజేపీ తోసిపుచ్చారు. అనంతరం మంగళవారానికి విచారణను వాయిదా వేశారు. ఈ విషయమై సరైన ఆదేశాన్ని ఇస్తామని అంతకుముందు సీజేపీ చెప్పారు. అవిశ్వాస తీర్మాన ప్రొసీడింగ్స్‌లో ఉల్లంఘనలున్నట్లు కోర్టు భావించిందని డాన్ పత్రిక తెలిపింది. ఈ నేపథ్యంలో సోమవారమే తీర్పునివ్వడం కుదరదని ఇతర జడ్జిలు అభిప్రాయపడడంతో విచారణను వాయిదా వేసింది.
చదవండి: పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం.. రంగంలోకి సుప్రీంకోర్టు
Comments
Please login to add a commentAdd a comment