Pakistan PM Sharat Sabharwal Peace Offer To India Rings Hollow - Sakshi
Sakshi News home page

పతనం అంచున పాక్‌

Published Thu, Jan 19 2023 2:04 AM | Last Updated on Thu, Jan 19 2023 1:48 PM

Pakistan PM Sharat Sabharwal peace offer to India rings hollow - Sakshi

‘‘భారత్‌తో మూడు యుద్ధాలు చేశాం. సాధించింది ఏమీ లేదు. దేశంలో మరింత విధ్వంసం జరిగింది. నిరుద్యోగం పేదరికం మీద పడ్డాయి. యుద్ధానికి కారణమైన కశ్మీర్‌ వంటి అంశాలపై భారత్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నాం’’  ‘‘అణ్వాయుధాలు కలిగిన మన దేశం అన్నవస్త్రాల కోసం ప్రపంచ దేశాల ముందు దేహి అంటూ చేయి చాపడం నిజంగా సిగ్గు చేటు. అంతర్జాతీయ సంస్థల్ని రుణాలు అడగాలన్నా ఇబ్బందిగా అనిపిస్తోంది. ఇలా ప్రపంచ దేశాలను భిక్షమడిగి దేశాన్ని ఆర్థికంగా గట్టెక్కించడం పరిష్కారం కాదు’’ 

ఈ వ్యాఖ్యలు చేసినది ఎవరో కాదు. సాక్షాత్తూ పాకిస్తాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌. రోజు రోజుకీ దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారి పోతూ ఉండడంతో మరో దారి లేక షరీఫ్‌ శాంతి మంత్రం జపిస్తున్నారు. భారత్‌తో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించుకుంటే ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కుతామన్న భావనలో పాక్‌ సర్కార్‌ ఉంది.  
 
గోధుమల లారీని వెంబడించి.. !  
పాకిస్తాన్‌లో ప్రధాన ఆహారమైన గోధుమ పిండికి విపరీతమైన కొరత ఏర్పడింది. నిరుపేదలు గోధుమ పిండి కొనుక్కోవడానికి గంటల తరబడి దుకాణాల దగ్గర క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో కరాచీలో ఒక గోధుమ పిండి లారీ వెళుతూ ఉంటే దాని వెనక ప్రజలు పరుగులు తీసిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  ఆ ఒక్క వీడియో చాలు పాక్‌లో ఆహార సంక్షోభం ఏ స్థాయికి చేరుకుంటోందో చెప్పడానికి. బియ్యం, గోధుమలు, కూరగాయలు డిమాండ్‌కు తగ్గ సప్లయి కావడం లేదు.

ఇరుగు పొరుగు దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే డాలర్‌ నిల్వలు తరిగిపోతున్నాయి. కరాచీలో కేజీ గోధుమ పిండి రూ.160 ధర పలుకుతూ ఉండడంతో ప్రజలు కడుపు నింపుకోవడమెలాగ అని ఆందోళన చెందుతున్నారు. కొన్ని రెస్టారెంట్లలో ఒక భోజనం ఖరీదు ఏకంగా రూ.800కి చేరుకుంది. విద్యుత్‌ సంక్షోభంతో మార్కెట్లను, రెస్టారెంట్లను రాత్రి 8 గంటలకే మూసేస్తూ ఉండడంతో జనం కూడా చేసేదేమి లేక త్వరగా నిద్రపోతున్నారు. దీంతో పాక్‌లో చీకటి పడగానే విద్యుత్‌ వెలుగులు లేక కారు చీకట్లోకి దేశం వెళ్లిపోతోంది.

పెట్రోల్‌ ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. లీటర్‌ పెట్రోల్‌ రూ.200కి పైనే ఉండడంతో సామాన్యులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. మరోవైపు ప్రాణావసరమైన మందులకి కూడా కొరత ఏర్పడడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరాచీలో ఇన్సులిన్‌ లభించకపోవడంతో మధుమేహ రోగులు  నానా తంటాలు పడుతున్నారు. ఇక సైనికులకి రెండు పూటలా తిండి పెట్టే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. దేశంలో టాప్‌లో ఉన్న 8 తయారీ సంస్థలు ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకు లేక మూతపడ్డాయి. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి వివిధ దేశాల్లో రాయబార కార్యాలయాలను కూడా పాక్‌ ప్రభుత్వం అమ్మకానికి పెట్టడంతో ఆర్థిక సంక్షోభం పరాకాష్టకు చేరుకున్నట్టయింది.    

►పాకిస్తాన్‌ సెంట్రల్‌ బ్యాంకులో నిల్వలు నిండుకుంటున్నాయి. స్టేట్‌ బ్యాంకులో 420 కోట్ల డాలర్లే ఉన్నాయి.  ఇవి 25 రోజుల దిగుమతి అవసరాలకు మాత్రమే సరిపోతాయి.  
►విదేశీ మారక నిల్వలు 2022 జనవరిలో 1660 కోట్లు ఉంటే ఈ ఏడాది జనవరి నాటికి కాస్త 560 కోట్ల డాలర్లకి పడిపోయాయి.  
►ఈ ఆర్థిక సంవత్సరం జనవరి –మార్చి మధ్య పాకిస్తాన్‌ 830  కోట్ల డాలర్ల విదేశీ అప్పులు తీర్చవలసి ఉంది.
►2022–23లో జీడీపీలో 2.8% ఉన్న రక్షణ బడ్జెట్‌ను 2.2శాతానికి తగ్గించారు.
►2022 ఆకస్మిక వరదలు 3.8 కోట్ల మందిని ప్రభావితం చేశాయి. దేశం విలవిలలాడింది.
► స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ పాకిస్తాన్‌ లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్స్‌ ఇవ్వడానికి కూడా ఇష్టపడడం లేదు.  
►వాణిజ్య లోటు ఒక్కసారిగా 57% పెరిగిపోయింది. అత్యవసర జాబితాలో లేని లగ్జరీ వస్తువులు 800కి పైగా రకాల వస్తువుల దిగుమతులపై నిషేధం విధించినప్పటికీ వాణిజ్య లోటు పెరిగిపోతూనే ఉంది. ప్రస్తుతం పాక్‌ వాణిజ్య లోటు 4.866 కోట్ల డాలర్లుగా ఉంది.  

భారతే దిక్కా ..?  
పాకిస్తాన్‌కు అండదండ అందించే చైనా ఈ సారి ఆ దేశాన్ని గట్టెక్కించే పరిస్థితులు కనిపించడం లేదు. పాకిస్తాన్‌ ప్రాంతంలో చైనా చేపట్టిన చైనా పాకిస్తాన్‌ ఎకానమిక్‌ కారిడార్‌  (సీపీఈసీ) ప్రాజెక్టుకు సంబంధించిన భద్రతాపరమైన ముప్పు కనిపిస్తోంది. ఇప్పటికే ఆ ప్రాజెక్టు కోసం వందల కోట్ల డాలర్లను వెచ్చించిన చైనా ఇంక ఆర్థికంగా ఆదుకుంటుందన్న నమ్మకం లేదు. యూఏఈ, సౌదీ అరేబియాలు ముస్లిం దేశాలు కావడంతో పాక్‌కు ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చాయి. యూఏఈ 200 కోట్ల డాలర్ల సాయాన్ని చేయడానికి కూడా అంగీకరించింది.

కరోనా విలయం, రష్యా, అమెరికా యుద్ధంతో అన్ని దేశాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ వంటి దేశాలు కూడా సాయం చేసే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే భారత్‌తో బలమైన సంబంధాలు కలిగి ఉంటే ఈ సంక్షోభం నుంచి గట్టెక్కవచ్చునని పాక్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మన దేశంతో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరిస్తే నిత్యావసరాలైన బియ్యం, గోధుమ పిండి, కూరగాయలు, మందులు వంటివి తీసుకురావడం అత్యంత సులభంగా మారుతుంది. వాఘా–అట్టారి, ఖోఖర్‌పార్‌–మునాబావో సరిహద్దుల నుంచి నిత్యావసర సామగ్రి తరలించడం సులభతరంగా ఉంటుందని పాక్‌లో ఆర్థిక నిపుణులు ప్రభుత్వానికి హితవు పలుకుతున్నారు. 

దక్షిణాసియాలో బలహీనమైన ఆర్థిక వ్యవస్థ  
దక్షిణాసియాలో బలహీనమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం పాకిస్తానేనని ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ఆ దేశ వృద్ధి రేటు గతంలో వేసిన అంచనాల కంటే 2%‘ నెమ్మదిస్తుందని తెలిపింది. పాక్‌ ఆర్థిక వ్యవస్థ కారణంగా దక్షిణాసియా ప్రాంత పురోగతి రేటు కూడా తగ్గిపోతోందని పేర్కొంది. పాకిస్తాన్‌ను గత ఏడాది ముంచెత్తిన వరదలే ఈ పరిస్థితికి కారణమని విశ్లేషించింది. ఇప్పటికిప్పుడు పాకిస్తాన్‌కు 3,300 కోట్ల డాలర్లు రుణంగా వస్తే తప్ప ఆ దేశం ఈ సంక్షోభం నుంచి గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement