Most Common Passwords In India: నార్డ్‌పాస్ అనే గ్లోబల్ సంస్థ 50 దేశాల్లో పాస్‌వర్డ్‌ల తీరును, వాటిని ఛేదించడానికి ఎంత సమయం పడుతుందనే అంశంపై చేసిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. దీనికోసం ఈ సంస్థ 4టీబీ సామర్థ్యమున్న డేటాబేస్‌ను విశ్లేషించింది. అందులో చాలా ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
భద్రతపరంగా సాధించాల్సింది ఇంకా చాలానే ఉంది
దేశంలో ఇంటర్నెట్ వినియోగం ఎక్కువగా ఉన్నప్పటికీ సైబర్ భద్రత పరంగా మనం సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. దేశంలో ఎక్కువ మంది తమ ఖాతాలకు పెట్టుకున్న పాస్‌వర్డ్ ఏంటంటే.. ‘PASSWORD’. పోలీసులు, భద్రతా సంస్థలు సులభంగా ఛేదించగలిగే పాస్‌వర్డ్‌లు పెట్టుకోకుండా సంక్లిష్లమైనవి పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. భారత్‌లో ‘PASSWORD’ తర్వాత ఎక్కువ మంది పెట్టుకున్న పాస్‌వర్డ్‌లు 12345, 123456, 123456789, 12345678, india123, 1234567890, 1234567, qwerty and abc 123 ఇవే అని ఆ అధ్యయనంలో తేలింది. వీటిలో india123 తప్ప మిగిలిన వాటిని ఒక సెకను కన్నా తక్కువ సమయంలోనే హ్యాక్ చేయొచ్చు. india123 పాస్‌వర్డ్‌ను కనుక్కునేందుకు మాత్రం 17 నిమిషాలు పట్టింది.
కరోనా వైరస్ విజృంభణ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ సేవలు పెరిగిపోయాయి. బడి, గుడి మొదలుకొని అన్నింటా డిజిటల్ సేవలే. బ్యాంకింగ్, ఈ–కామర్స్ వంటి వాటిలో మరీ ఎక్కువ. కరెన్సీ నోట్ల వాడకం తగ్గింది... కార్డులు, ఫోన్ పేమెంట్లు, ఆన్‌లైన్ చెల్లింపులు పెరిగిపోయాయి. ఆయా సేవలు పొందాలంటే మనకు ఆ సంబంధిత సంస్థ వెబ్‌సైట్‌లో అకౌంట్ ఉండాలి. దానికి ఒక పాస్‌వర్డ్ తప్పనిసరి. అయితే, పాస్‌వర్డ్ బలహీనంగా ఉంటే మన ఖాతాలు హ్యాక్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
డిజిటల్ జీవితానికి గేట్‌వే
‘పాస్‌వర్డ్‌లు అనేవి మన డిజిటల్ జీవితాలకు గేట్‌వే లాంటివి. అదీగాక ఆన్‌లైన్‌లో మనం గడిపే సమయం క్రమక్రమంగా పెరిగిపోతోంది. అందువల్ల సైబర్ భద్రతను దృష్టిలో పెట్టుకుని మనం పాస్‌వర్డ్‌లు పెట్టుకోవాల్సి ఉంటుంది’ అని అంటారు నార్డ్‌పాస్ సీఈఓ జొనాస్ కర్‌క్లీస్. దురదృష్టవశాత్తు చాలామంది బలహీనమైన పాస్‌వర్డ్‌లు పెట్టుకుంటున్నారని, వాటిని కూడా ‘ఆరోగ్యకరంగా’ పెట్టుకోవాలని చెబుతారాయన.
ప్రపంచవ్యాప్తంగా పాస్‌వర్డ్‌ల జాబితాలో తొలి మూడు స్థానాల్లో వరుససంఖ్యలు ఉన్నాయి. 50 దేశాల్లో 123456, 123456789, 12345 తర్వాత ఎక్కువ మంది పెట్టుకున్న పాస్‌వర్డ్‌లు qwerty, password అని పెట్టుకున్నట్లు గుర్తించారు. మన జీవితాల్లో కీలక పాత్ర పోషించే పాస్‌వర్డ్‌ను పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆ అధ్యయనం నొక్కిచెప్పింది. ఇది హ్యాకింగ్‌కు, ఇతరుల ఊహలకు అందకుండా ఉండాలి.
–సాక్షి, సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment