సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా జన సంచారం లేక బోసిపోతున్నాయి. అన్ని వర్గాల ప్రజలు స్వీయ నిర్బంధం పేరిట ఇళ్లకే పరిమితం కావడంతో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగింది. దీంతో పెరిగిన ఆన్‌లైన్ రద్దీని తట్టుకునేందుకు టెలికం సంస్థలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఇంటర్నెట్ సామర్థ్యం పెంపుదలపై దృష్టి సారించారు. మార్చి మొదటి వారంలో రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదు కావడంతో పలు ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పని (వర్క్ ఫ్రం హోమ్) వెసులుబాటును కల్పించాయి. విద్యాసంస్థల మూసివేత, కార్పొరేట్, ప్రభుత్వ సంస్థలు కూడా ఇళ్ల నుంచే పని చేయాలని తమ ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నాయి.
రాష్ట్రంలో సుమారు ఐదున్నర లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా, సుమారు 70 శాతం మంది ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి అవసరమైన సాంకేతిక వసతులు సమకూర్చేందుకు ఐటీ సంస్థలు ఇంటర్నెట్ సేవలు అందించే డాంగుల్స్‌ను గంప గుత్తగా కొనుగోలు చేశాయి. గతంలో రూ.999 మేర పలికిన డాంగుల్ ధర ప్రస్తుతం రెండింతలు పలుకుతోంది. మరోవైపు మార్చి రెండో వారం నుంచి బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల కోసం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్‌కు ఫోన్ కాల్స్ వెల్లువెత్తాయి. గతంలో ఉన్న బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల సంఖ్యతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో కేవలం పక్షం రోజుల వ్యవధిలో మూడింతలు పెరిగినట్లు సర్వీస్ ప్రొవైడర్లు చెప్తున్నారు.
ఆన్‌లైన్‌లోనే గడుపుతున్న జనం
లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన జనం ఎక్కువ సమయం ఆన్‌లైన్‌లోనే గడుపుతున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల వినియోగం పెరగడంతో పాటు వినోదం కోసం ఇంటర్నెట్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో మొబైల్ ఇంటర్నెట్ వాడకం కూడా గణనీయంగా పెరిగిందని టెలికం సంస్థలు చెప్తున్నాయి. బ్యాం కింగ్ లావాదేవీలు కూడా ఆన్‌లైన్ విధానంలో జరుగుతుండటం కూడా ఇంటర్నెట్ వాడకం పెరిగేందుకు దోహదం చేస్తోంది. దేశవ్యాప్తంగా మార్చి రెండో వారంతో పోలిస్తే ప్రస్తుతం 30 శాతం మేర డేటా వినియోగం పెరగ్గా, మెట్రో నగరాల్లో ఇది మరింత ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆన్‌లైన్ వినియోగం పెరిగిపోవడంతో రద్దీ పెరిగి ఇంటర్నెట్ వేగం తగ్గినట్లు వినియోగదారులు చెప్తున్నారు.
ప్రత్యామ్నాయాలపై దృష్టి
పెరిగిన ఇంటర్నెట్ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన సేవలు అందించేందుకు టెలికం సంస్థలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ఐఎస్‌పీ) ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాయి. సమాచార, వినోద రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ వంటి ఓవర్ ది టాప్ (ఓటీటీ) సర్వీస్ ప్రొవైడర్లు వీడియోల నాణ్యతను తగ్గించాయి. వీడియో నాణ్యతను తగ్గించడం ద్వారా సుమారు 20% మేర డేటాను పొదుపు చేయ డం సాధ్యమవుతుందని ఓటీటీ సర్వీస్ ప్రొవైడర్లు చెప్తున్నారు. మరోవైపు పెరిగిన ఇంటర్నెట్ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని టెలికామ్ సంస్థలు, ఐఎస్‌పీలు బ్యాండ్‌విడ్త్‌ను పెంచుతున్నట్లు ప్రకటించాయి. రాష్ట్రంలో బలమైన ఆప్టిక్ ఫైబర్ నెట్‌వర్క్ వ్యవస్థ, డేటా సెంటర్లు ఉన్నందున బ్యాండ్‌విడ్త్ (సామర్థ్యం) పెంచడంలో ఎలాంటి ఇబ్బందులు లేవని ఐటీ శాఖ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment