Narendra Modi: నమ్మకమే పునాది | PM Modi is the Boss says Australian PM Anthony Albanese | Sakshi
Sakshi News home page

Narendra Modi: నమ్మకమే పునాది

Published Wed, May 24 2023 3:58 AM | Last Updated on Wed, May 24 2023 8:40 AM

PM Modi is the Boss says Australian PM Anthony Albanese - Sakshi

సిడ్నీ: పరస్పర నమ్మకం, గౌరవాలే మూలస్తంభాలుగా భారత్‌–ఆ్రస్టేలియా సంబంధాలు నానాటికీ బలపడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. మంగళవారం సిడ్నీలోని కుడోస్‌ బ్యాంక్‌ ఎరీనాలో జరిగిన కార్యక్రమంలో ఆ్రస్టేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌తో కలిసి ఆయన మాట్లాడారు. దేశంలోని అతి పెద్ద ఇండోర్‌ స్టేడియాల్లో ఒకటైన 20 వేల మంది సామర్థ్యమున్న ఎరీనా పూర్తిగా కిక్కిరిసిపోయింది. కార్యక్రమంలో 21 వేల మందికి పైగా పాల్గొన్నారు.

సభికులంతా ‘మోదీ, మోదీ’ నినాదాలతో ప్రధానికి ఘనస్వాగతం పలికారు. ఆయన ప్రసంగం పొడవునా పదేపదే అవే నినాదాలతో హోరెత్తించారు. మోదీ మాట్లాడుతూ ఆ్రస్టేలియాలో వ్యూహాత్మక భాగస్వామ్యం నానాటికీ బలోపేతమవుతోందన్నారు. వచ్చే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపునకు మించి పెరుగుతుందని ఆశాభావం వెలిబుచ్చారు. ‘‘భారత–ఆ్రస్టేలియా మధ్య భౌగోళికంగా చాలా దూరమున్నా హిందూ మహాసముద్రం రెండింటినీ నిరంతరం కలిపే ఉంచుతోంది.

ఇరు దేశాల బంధాలకు ఒకప్పుడు ‘3సి’లు (కామన్వెల్త్, క్రికెట్, కర్రీ) ప్రతీకగా ఉండేవి. తర్వాత ‘3డి’లు (డెమొక్రసీ, డయాస్పొరా, దోస్తీ)గా మారింది. ఇప్పుడది ‘3ఇ’లు (ఎనర్జీ, ఎకానమీ, ఎడ్యుకేషన్‌)గా రూపాంతరం చెందింది. ఇరు దేశాల బంధాల్లోని గాఢత ఈ నిర్వచనాలన్నింటినీ ఎప్పుడో అధిగమించింది. క్రికెట్‌ అయితే ఎన్నో దశాబ్దాలుగా కలిపి ఉంచుతూ వచ్చింది. కొన్నేళ్లుగా ఈ జాబితాలో యోగా కూడా చేరింది’’ అని సభికుల హర్షధ్వానాల మధ్య చెప్పుకొచ్చారు.

ఇందులో ఆ్రస్టేలియాలోని భారత సంతతి పాత్ర అత్యంత కీలకమని ప్రశంసలు గుప్పించారు. లెగ్‌ స్పిన్‌ మాంత్రికుడు, లెజెండరీ క్రికెటర్‌ షేన్‌ వార్న్‌ అకాల మరణం పాలైనప్పుడు లక్షలాది మంది భారతీయులు అత్యంత ఆప్తున్ని కోల్పోయామంటూ దుఃఖించారని గుర్తు చేశారు. బ్రిస్బేన్‌లో త్వరలో భారత కాన్సులేట్‌ను ప్రారంభిస్తామని ప్రకటించారు. బుధవారం మోదీ, ఆల్బనీస్‌ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. 

ప్రపంచ శక్తిగా భారత్‌ 
భారత్‌ నేడు ప్రపంచమంతటికీ ఓ సానుకూల శక్తిగా ఎదిగిందని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ఎక్కడ ఎలాంటి విపత్తు జరిగినా సాయానికి అందరికంటే ముందు నిలుస్తూ వస్తోందన్నారు. ఇటీవలి తుర్కియే భూకంప బాధితులను ఆపరేషన్‌ దోస్త్‌ ద్వారా ఇతోధికంగా ఆదుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ‘‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తళుకులీనుతున్న తారగా భారత్‌ను అంతర్జాతీయ ద్రవ్య నిధి అభివర్ణించింది. ప్రపంచ మాంద్యం పరిస్థితులను సమర్థంగా తట్టుకుంటున్న దేశమేదైనా ఉందంటే అది భారతేనని ప్రపంచ బ్యాంకు కూడా చెప్పింది. ప్రపంచంలోకెల్లా అత్యంత ఎక్కువ సంఖ్యలో యువత ఉన్న దేశం కూడా భారతే’’ అన్నారు.  

భారత యాత్రాస్మృతిలోకి జారుకున్న ఆల్బనీస్‌
ఇటీవలి భారత పర్యటన తాలూకు మధుర స్మృతులు తన మనసులో ఇంకా తాజాగానే ఉన్నాయన్నారు. ‘‘గుజరాత్‌లో హోలీ వేడుకలు, ఢిల్లీలో మహాత్మా గాం«దీకి నివాళులు, అహ్మదాబాద్‌ స్టేడియంలో దాదాపు లక్ష మంది అభిమానుల అభివాదం స్వీకరించడం అన్నీ అద్భుత జ్ఞాపకాలే. 1991లో 28 ఏళ్ల యువకునిగా ఐదు వారాల పాటు భారత్‌లో కలియదిరిగా. ఎక్కడికి వెళ్లినా ఇరు దేశాల ప్రజల మధ్య పెనవేసుకున్న గాఢానుబంధాన్ని గమనించా’’ అని చెప్పారు. నిజమైన భారత్‌ను అర్థం చేసుకోవాలంటే దేశమంతా రైల్లో, బస్సుల్లో విస్తృతంగా కలియదిరగాలని ఆల్బనీస్‌ అభిప్రాయపడ్డారు.

సిడ్నీలో ‘లిటిల్‌ ఇండియా’ 
పశ్చిమ సిడ్నీలో భారతీయులు ఎక్కువగా ఉండే హారిస్‌ పార్కుకు ‘లిటిల్‌ ఇండియా’ అని ఆ్రస్టేలియా ప్రధాని ఆల్బనీస్‌ నామకరణం చేశారు. ఇదో గొప్ప గౌరవమంటూ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఆల్బనీస్‌ను హారిస్‌ పార్క్‌కు తీసుకెళ్లి భారతీయ వంటకాలు, ముఖ్యంగా అక్కడ బాగా ఫేమస్‌ అయిన  చాట్, జిలేబీ రుచి చూపించాలని స్థానిక భారతీయులకు సూచించారు. కొవిడ్‌ కష్టకాలంలో ఆస్ట్రేలియాలో స్థానిక గురుద్వారాలు గొప్పగా సేవలందించాయని ఆయన అన్నారు.

మోదీ ఓ రాక్‌స్టార్‌ సిసలైన బాస్‌: ఆల్బనీస్‌ 
తమ దేశంలో మోదీకి దక్కుతున్న అపూర్వ ఆదరణను కళ్లారా చూసి ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌ అక్షరాలా అచ్చెరువొందారు. మోదీ వేదికపైకి రాగానే ఆయన్ను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ‘ప్రపంచంలో ఎక్కడికెళ్లినా రాక్‌స్టార్‌ తరహాలో అపూర్వ స్వాగతం పొందే అత్యంత పాపులర్‌ నాయకుడు’ అంటూ మిన్నంటిన హర్షధ్వానాల మధ్య సభికులకు పరిచయం చేశారు! ‘‘ప్రఖ్యాత అమెరికా సింగర్‌ బ్రూస్‌ స్ప్రింగ్‌స్టీన్‌ కూడా 2017లో ఇక్కడికొచ్చారు.

ఇప్పుడు మోదీకి లభించినంత ఆదరణ ఆయనకు కూడా దక్కలేదు. మోదీ నిజమైన బాస్‌’’ అంటూ ఆకాశానికెత్తారు. స్ప్రింగ్‌స్టీన్‌ను అభిమానులు బాస్‌ అని ముద్దుపేరుతో పిలుచుకుంటారు! ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం తాలూకు స్ఫూర్తిని ఆ్రస్టేలియాకు వెంట తెచ్చినందుకు మోదీకి కృతజ్ఞతలని ఆల్బనీస్‌ అన్నారు.

ఇంత భారీ సంఖ్యలో భారతీయులు ఆ్రస్టేలియాను తమ సొంతిల్లుగా మార్చుకున్నందుకు వారిని చూసి గర్వపడుతున్నానన్నారు. అంతకుముందు ప్రధానులిద్దరికీ వేదిక వద్ద వేదమంత్రాలు, ఆ్రస్టేలియా మూలవాసుల సంప్రదాయ పద్ధతుల్లో ఘనస్వాగతం లభించింది. ఆ్రస్టేలియాతో బంధాలను దృఢతరం చేయడంలో కీలకపాత్ర పోషించాలని భారతీయ ప్రముఖులను మోదీ కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement