మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మోదీ, పక్కన అల్బానీస్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్‌తో శుక్రవారం సమావేశమయ్యారు. అంతర్జాతీయ పరిణామాలతోపాటు కీలక ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ప్రతిష్టాత్మకమైన వాణిజ్య ఒప్పందం, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భద్రత, పరస్పర సహకారం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. క్లీన్ ఎనర్జీ, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, ఖనిజాలు, వలసలు, సప్లై చైన్లు, విద్యా, సాంస్కృతికం, క్రీడల్లో ఇకపై కలిసి పనిచేయాలని, ఒకరికొకరు సహకరించుకోవాలని అంగీకారానికొచ్చారు.
ఆస్ట్రేలియాలో హిందూ ఆలయాలపై ఇటీవల జరిగిన దాడుల గురించి ఆల్బానీస్ వద్ద మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆస్ట్రేలియాలో ఖలిస్తాన్ మద్దతుదారుల కార్యకలాపాలు పెరుగుతుండడాన్ని గుర్తుచేశారు. క్రీడలు, నవీన ఆవిష్కరణలు, ఆడియో–విజువల్ ప్రొడక్షన్, సౌర విద్యుత్ విషయంలో పరస్పర సహకారానికి సంబంధించి నాలుగు ఒప్పందాలపై భారత్, ఆస్ట్రేలియా ప్రతినిధులు సంతకాలు చేశారు.
చర్చల అనంతరం ఆంథోనీ అల్బానీస్‌తో కలిసి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. ‘‘ఆస్ట్రేలియాలోని హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నట్లు గత కొన్ని వారాలుగా మీడియాలో నిత్యం వార్తలు వస్తుండడం నిజంగా విచారకరం. అలాంటి దాడులు భారత్‌లో ప్రతి ఒక్కరికీ సహజంగానే ఆందోళన కలిగిస్తున్నాయి. ఆలయాలపై దాడుల పట్ల మన మనసులు కలత చెందుతున్నాయి.
మన మనోభావాలను, ఆందోళనలను ఆస్ట్రేలియా ప్రధానమంత్రికి తెలియజేశా. ఆస్ట్రేలియా సమాజంలో, ఆర్థిక వ్యవస్థలో భారతీయులు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారు. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు అల్బానీస్ నాకు హామీ ఇచ్చారు. భారతీయుల భద్రత విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వానికి సాధ్యమైనంతవరకూ మా వంతు సహకారం అందిస్తాం’’ అని పేర్కొన్నారు. భారత్–ఆస్ట్రేలియా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి ద్వైపాక్షిక భద్రతా సహకారం అత్యంత కీలకమని మూలస్తంభమని మోదీ ఉద్ఘాటించారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో మారిటైమ్ సెక్యూరిటీ, డిఫెన్స్, సెక్యూరిటీ కో–ఆపరేషన్ గురించి తాము చర్చించామని అన్నారు.
త్వరలోనే ఆర్థిక సహకార ఒప్పందం: అల్బానీస్
ఇండియా–ఆస్ట్రేలియా సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాన్ని(సీఈసీఏ)ను సాధ్యమైంత త్వరగా కుదుర్చుకోవాలని మోదీ, తాను అంగీకారానికి వచ్చినట్లు ఆంథోనీ అల్బానీస్ తెలిపారు. ఈ ఏడాదిలోనే ఒప్పందాన్ని ఖరారు చేస్తామన్న నమ్మకం ఉందన్నారు. భారత్–ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక సహకార వాణిజ్య ఒప్పందం(ఈసీటీఏ) గత ఏడాది ఖరారైన సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ నుంచే ఇది అమల్లోకి వచ్చింది.
ప్రస్తుతం ఇరు పక్షాలు సీఈసీఏపై కసరత్తు చేస్తున్నాయి. వలసల ఒప్పందం పురోగతిలో ఉందని, దీనివల్ల ఇరు దేశాల విద్యార్థులకు, వృత్తి నిపుణులకు లబ్ధి చేకూరుతుందని అల్బానీస్ తెలిపారు. భారత్‌తో తమకు బహుముఖ సంబంధాలు ఉన్నాయన్నారు. ఈ ఏడాదిలో మే నెలలో తమ దేశంలో ‘క్వాడ్’ సదస్సు జరగబోతోందని, మోదీ రాకకోసం ఎదురు చూస్తున్నానని వివరించారు. జీ20 సదస్సులో పాల్గొనడానికి సెప్టెంబర్‌లో భారత్‌కు వస్తానని అన్నారు.
(చదవండి: మంటల్లో చిక్కుకున్న బస్సు..అదే టైంలో కండక్టర్ నిద్రిస్తుండటంతో..)
Comments
Please login to add a commentAdd a comment