న్యూఢిల్లీ: ప్రపంచ నాయకులపై సర్వే నిర్వహించే అమెరికన్ డాటా ఇంటెలిజెన్స్ సంస్థ ‘మార్నింగ్ కన్సల్ట్’ తన తాజా నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో ఎక్కువ మంది జనామోదం పొందిన వ్యక్తుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. అగ్రదేశాధినేతలకన్నా ముందు వరుసలో ఉన్నారు. అమెరికా, బ్రిటన్ రష్యా, అస్ట్రేలియా, కెనడా, బ్రెజిల్ వంటి 13 దేశాల నాయకులను వెనక్కినెట్టి మోదీ విశ్వనాయకుడిగా స్థానం సంపాదించుకున్నారు. జూన్ 17న ‘గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ ట్రాకర్’ పేరిట ఫలితాలు విడుదల చేసిన ఈ సర్వేలో భారత్‌లో 2,126 మందిని సర్వే చేశారు. ఇందులో 66 శాతం మంది.. ప్రధాని మోదీ నాయకత్వానికి ఆమోదం తెలిపారు. మరో 28 శాతం మంది వ్యతిరేకత వ్యక్తం చేశారు.
అయితే ఈ ఏడాది ప్రధాని స్కోరు పడిపోయింది. 2019 ఆగష్టులో ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు ఇదే సర్వేలో 82 శాతం మంది మోదీని ఆమోదించగా, కేవలం 11 శాతం మంది వ్యతిరేకించారు. ఈ జూన్ నాటికి ఆ రేటింగ్ 66 శాతానికి పడిపోగా.. 28 శాతం మంది నిరాకరించారు. అప్పటితో పోల్చితే ప్రస్తుతం ప్రజాదరణ 16 పాయింట్లు తగ్గింది. సర్వేలో మోదీ తర్వాత ఇటాలియన్ ప్రధానమంత్రి మారియో ద్రాగి రెండో స్థానంలో ఉన్నారు. ఆయన రేటింగ్ 65 శాతం. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రాడోర్ మూడవ స్థానంలో 63 శాతం రేటింగ్‌తో ఉన్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరో స్థానంలో ఉన్నారు. ఆయన్ను 53 శాతం మంది ఎంచుకున్నారు.
ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ (54%), జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ (53%), కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడూ (48%), బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (44%), దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ (37%), స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ (36%), బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో (35%), ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ (35%), జపాన్ ప్రధాని యోషిహిదే సూగా (29%) ఉన్నారు. వారం రోజుల సగటు ఆధారంగా ఈ సర్వే ఫలితాలను వెల్లడించినట్టు మార్నింగ్ కన్సల్ట్ పేర్కొంది. సర్వేను ఆన్ లైన్ లో చేసినట్టు తెలిపింది.
చదవండి: స్టార్టప్‌లకు ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద వ్యవస్థ: ప్రధాని
Comments
Please login to add a commentAdd a comment