PM Narendra Modi G20 Summit In Indonesia Bali - Sakshi
Sakshi News home page

ప్రపంచ శాంతి కోసం.. చేతులు కలుపుదాం

Published Wed, Nov 16 2022 5:18 AM | Last Updated on Wed, Nov 16 2022 11:30 AM

PM Narendra Modi G20 Summit in Indonesia Bali  - Sakshi

బాలి:  ప్రపంచ శాంతి కోసం అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ–20 దేశాల అధినేతలకు పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌–రష్యా ఘర్షణకు త్వరగా ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. సమస్య పరిష్కారంపై తక్షణమే దృష్టి పెట్టాలని.. ఈ దిశగా కాల్పుల విరమణతోపాటు దౌత్య మార్గం కోసం అన్వేషించాలని చెప్పారు. ఇంధన దిగుమతుల విషయంలో భారత్‌పై ఎలాంటి ఆంక్షలు విధించవద్దని పశ్చిమ దేశాలకు సూచించారు. ఆంక్షలను తాము వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇండోనేషియాలోని బాలిలో జీ–20 శిఖరాగ్ర సదస్సులో మంగళవారం సభ్యదేశాల అధినేతలను ఉద్దేశించి ప్రధాని మోదీ సుదీర్ఘంగా ప్రసంగించారు. వాతావరణ మార్పులు, కోవిడ్‌–19 మహమ్మారి, ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం వంటివి ప్రపంచాన్ని అతలాకుతలం చేశాయని అన్నారు. గ్లోబల్‌ సప్లై చైన్లు దెబ్బతిన్నాయని, ఫలితంగా అన్ని దేశాల్లో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సదస్సులో నరేంద్ర మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే..  

పేదలకు నిత్య జీవితమే ఒక పోరాటం  
‘‘వచ్చే ఏడాది జీ–20 కూటమికి భారత్‌ నాయకత్వం వహించబోతోంది. గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ జన్మించిన పవిత్రమైన గడ్డపై మనం కలుసుకోబోతున్నాం. ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించడానికి మనమంతా ఒక అంగీకారానికి రావాలి. కీలకమైన అంశాలపై ప్రపంచ దేశాల నడుమ ఏకాభిప్రాయం కోసం భారత్‌ పనిచేస్తుంది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆహార, ఇంధన భద్రత ప్రమాదంలో పడింది. అత్యవసర, నిత్యవసర సరుకులు అందరికీ అందడం లేదు.

అన్ని దేశాల్లో పేదల అగచాట్లు మరింతగా పెరిగిపోతున్నాయి. నిత్య జీవితం వారికి ఒక పోరాటంగా మారిపోయింది. సవాళ్లను ఎదుర్కొనేందుకు అసవసరమైన ఆర్థిక సామర్థ్యం వారికి లేదు. పేదల సమస్యలకు ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా పరిష్కారం చూపడం లేదన్న నిజాన్ని గుర్తించడానికి సంకోచించాల్సిన పనిలేదు. బడుగు వర్గాలకు తోడ్పడే సంస్కరణలను తీసుకురావడంలో విఫలమవుతున్నాం. జీ–20పై ప్రపంచానికి ఎన్నో ఆశలున్నాయి. మన కూటమికి ప్రాధాన్యం ఎన్నోరెట్లు పెరిగింది.  

 క్లీన్‌ ఎనర్జీ, పర్యావరణ పరిరక్షణ  
ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ గుర్తింపు పొందింది. ప్రపంచం అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలంటే భారత్‌లో ఇంధన భద్రత ఉండడం చాలా ముఖ్యం. అందుకే ఇంధన సరఫరాపై ఎలాంటి ఆంక్షలు లేకుండా చూడాలి. ఎనర్జీ మార్కెట్‌లో స్థిరత్వం సాధించాలి. క్లీన్‌ ఎనర్జీ, పర్యావరణ పరిరక్షణకు భారత్‌ కట్టుబడి ఉంది.  

‘న్యూ వరల్డ్‌ ఆర్డర్‌’ సృష్టించాలి  
ఉక్రెయిన్‌లో శాంతి కోసం అందరూ చొరవ చూపాల్సిన సమయం వచ్చింది.  ‘న్యూ వరల్డ్‌ ఆర్డర్‌’ను సృష్టించే బాధ్యత మన భుజస్కందాలపై ఉంది. భూగోళంపై శాంతి, సామరస్యం, భద్రత కోసం ఉమ్మడి కృషి సాగించాలి.   

డ్రాఫ్ట్‌ స్టేట్‌మెంట్‌   
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను ఖండిస్తూ జీ–20 సదస్సులో ఒక ముసాయిదా నివేదికను విడుదల చేశారు. ఈ నివేదికపై సదస్సులో చర్చ జరిగింది. ఉక్రెయిన్‌ నుంచి రష్యా తన సైన్యాన్ని బేషరతుగా పూర్తిస్థాయిలో ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌ను ప్రస్తావించారు. జీ–20 సదస్సుకు రష్యా తరపున విదేశాంగ మంత్రి లావ్‌రోవ్‌ హాజరయ్యారు.  

ప్రవాస భారతీయులతో మోదీ భేటీ  
ఇప్పటి ఇండియాకు, 2014 ముందు నాటి ఇండియాకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఊహించలేనంత వేగంతో ఇప్పుడు భారత్‌ అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతోందని అన్నారు. ఆయన మంగళవారం ఇండోనేషియాలోని బాలిలో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. మోదీ, మోదీ అంటూ బిగ్గరగా నినదిస్తూ వారు ఆయనకు స్వాగతం పలికారు.

21వ శతాబ్దంలో ప్రపంచానికి భారత్‌ ఒక ఆశారేఖగా మారిందని మోదీ వివరించారు. డిజిటల్‌ టెక్నాలజీ, ఆర్థికం, ఆరోగ్యం, టెలికాం, అంతరిక్షం తదితర రంగాల్లో భారత్‌ సాధించిన విజయాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. భారత్‌ గొప్పగా ఆలోచిస్తోందని, గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకుంటోందని వెల్లడించారు.  

మా గెలుపునకు మలుపు: జెలెన్‌స్కీ 
ఖెర్సన్‌ నగరాన్ని విముక్తం చేయడం రష్యాతో జరిగే యుద్ధంలో కీలక మలుపు కానుందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో మిత్ర పక్షాల సైన్యాలు ఫ్రాన్సులోని నార్మండీలోకి ప్రవేశించిన డీ–డేతో దీనిని ఆయన పోల్చారు. జెలెన్‌స్కీ మంగళవారం జి–20 భేటీని ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించారు. రష్యా దురాగతాలపై  ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలన్నారు. జి–20 వేదికను రష్యాలేని  జి–19గా మార్చాలని కోరారు.  

సందడిగా జీ–20 శిఖరాగ్ర సదస్సు  
జీ 20 శిఖరాగ్ర సదస్సులో బాలిలో మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యింది. కూటమిలోని సభ్యదేశాల అధినేతలు హాజరయ్యారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అతిథ్య దేశం ఇండోనేషియా ప్రధాని జోకో విడొడో ఘనంగా స్వాగతం పలికారు. ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను అందరూ పాటించాలని ప్రపంచ దేశాలకు విడొడో విజ్ఞప్తి చేశారు.

ఉక్రెయిన్‌–రష్యా యుద్ధానికి త్వరగా తెరపడాలని ఆకాంక్షించారు. జీ–20 అధ్యక్ష బాధ్యతలను ఇండోనేషియా నుంచి భారత్‌ స్వీకరించనుంది. 2023లో కూటిమికి భారత్‌ నాయకత్వం వహించనుంది. భారత ప్రధాని మోదీ బుధవారం ఇండోనేషియా ప్రధాని విడొడో, స్పెయిన్‌ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్, సింగపూర్‌ ప్రధాని లీ సీన్‌ లూంగ్‌తో సమావేశం కానున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement