
లండన్: బ్రిటన్ రాచ కుటుంబంపై రాజు చార్లెస్–2 చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ సంచలన ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉంది. అన్న ప్రిన్స్ విలియంతో తన బంధం ఎప్పుడూ సమస్యాత్మకంగానే సాగిందంటూ త్వరలో విడుదలవనున్న తన ఆత్మకథలో బయట పెట్టారాయన. ‘‘2021లో ఒకసారి మేమిద్దరం మా నాన్న సమక్షంలోనే తలపడ్డాం. మీరిలా కొట్టుకుని నా చివరి రోజులను దుర్భరంగా మార్చకండంటూ ఆయన మమ్మల్ని విడదీశాడు’’ అని వివరించారు. ‘‘రాచ కుటుంబీకుల పెళ్లిళ్లు జరిగే వెస్ట్‌మినిస్టర్ అబేలోని సెయింట్ పాల్స్ కెథడ్రెల్‌లో మెగన్, నేను ఒక్కటయ్యేందుకు కూడా విలియం ఒప్పుకోలేదు’’ అన్నారు. రాచరికపు జీవితపు ఒత్తిడిని తట్టుకోలేకు ఒక దశలో డ్రగ్స్‌కు అలవాటు పడ్డట్టు చెప్పారు!
‘‘17 ఏళ్ల వయసులో తొలిసారిగా కొకైన్ వాడా. అంత థ్రిల్లింగ్‌గా ఏమీ అన్పించలేదు. తర్వాత ఎలన్ కాలేజీలో చదువుతున్న సమయంలో బాత్రూంలో గంజా తాగాను. కాలిఫోర్నియాకు వెళ్లినప్పుడు మ్యాజిక్ మష్రూమ్స్ వంటివి టేస్ట్ చేశా. 17 ఏళ్లప్పుడే వయసులో నాకంటే పెద్దావిడతో తొలి లైంగికానుభవం రుచి చూశా’’ అని వివరించారు. ‘‘12 ఏళ్ల వయసులో నా తల్లి డయానాను ప్రమాదంలో కోల్పోవడం బాధించింది. నిద్ర పోతున్న నన్ను లేపి నాన్న ఆ వార్త చెప్పారు. కానీ కనీసం నన్ను దగ్గరికి కూడా తీసుకుని ఓదార్చలేదు. మరణించిన నా తల్లితో ఎలాగైనా మాట్లాడేందుకు ‘శక్తులున్న’ ఒక మహిళను ఆశ్రయించా’’ అని చెప్పుకొచ్చారు. కెమిల్లాను పెళ్లి చేసుకోవాలని తండ్రి భావించినప్పుడు వద్దని తాను, విలియం బతిమాలామన్నారు. హ్యారీ బయట పెట్టిన ఈ అంశాలపై వ్యాఖ్యానించేందుకు రాజ కుటుంబం తిరస్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment