లండన్: బ్రిటన్ రాజకుటుంబంలోని విభేధాలు మరోసారి తెర మీదకు వచ్చాయి. మే 6వ తేదీన జరగబోయే కింగ్ ఛార్లెస్ Charles III పట్టాభిషేకం కోసం ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో.. ప్రిన్స్ హ్యారీ రాక గురించి ఆసక్తి నెలకొంది. అయితే అయిష్టంగానే ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని తెలుస్తోంది.
తండ్రి ఛార్లెస్ పిలుపు మేరకు ప్రిన్స్ హ్యారీ పట్టాభిషేకానికి హాజరు అవుతారని, కానీ, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతారని రాజకుటుంబానికి దగ్గరగా ఉన్న వ్యక్తులు చెబుతున్నారు. ప్రిన్సెస్ డయానా దగ్గర బట్లర్‌గా పని చేసిన పాల్ బరెల్.. ప్రస్తుతం రాజకుటుంబంలోని వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఆయన తాజా పరిణామాలపై స్పందించారు. ఛార్లెస్, విలియమ్-హ్యారీల మధ్య సయోధ్య ఇప్పట్లో జరగకపోవచ్చు. పట్టాభిషేక కార్యక్రమంలో వాళ్ల మధ్య కనీసం మాటలు కూడా ఉండకపోవచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు.
తండ్రిపై గౌరవంతో.. డ్యూక్ ఆఫ్ సస్సెక్స్ హోదాలో కేవలం ముఖం చూపించేందుకు మాత్రమే హ్యారీ అక్కడికి వెళ్లే అవకాశం ఉంది. అంతేగానీ ఆ కుటుంబంలో మళ్లీ కలిసిపోవడానికి ఎంత మాత్రం కాదు అని పేర్కొన్నారు పాల్.
ఇక మూడు రోజులు పాటు జరిగే పట్టాభిషేక మహోత్సవంలో కేవలం సింహాసనాన్ని అధిష్టించే కార్యక్రమం నాడు మాత్రమే ప్రిన్స్ హ్యారీ హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాదు 24 గంటలు గడవక ముందే ఆయన యూకేను విడిచి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు పట్టాభిషేక సమయంలో ముందు వరుసలో కాకుండా.. దూరంగా ఎక్కడో పదో వరుసలో ఆయన కూర్చుంటారని సమాచారం. అయితే ఆయన భార్య మేఘన్ మార్కే హాజరుపై మాత్రం స్పష్టత లేదు.
క్వీన్ ఎలిజబెత్-2 మరణం అనంతరం రాజుగా పగ్గాలు చేపట్టిన ఛార్లెస్-3.. ఇప్పుడు ఎనిమిది నెలల తర్వాత పట్టాభిషేకం జరుపుకోబోతున్నారు. బ్రిటిష్ సామ్రాజ్యానికి ఆయన 40వ చక్రవర్తి. ఆయన రెండో భార్య క్యామిల్లా యూకే రాణిగా బాధ్యతలు చేపట్టనుంది. అయితే.. పూర్తిస్థాయి మహారాణి హోదా కాదు. ఆ తరహా హోదాతో కూడిన క్వీన్ కాన్సోర్ట్ మాత్రమే. అంటే నామమాత్రపు మహారాణిగా బకింగ్‌హమ్ ప్యాలెస్‌లో ఆమె నివసించనున్నారు.
రాజకుటుంబంలో ఏం జరిగింది? భార్యలు రాజేసిన చిచ్చు భగ్గున మండి..
Comments
Please login to add a commentAdd a comment