వాషింగ్టన్: అమెరికా ప్రతినిధుల సభలో స్పీకర్ ఎన్నికకు మంగళవారం ఓటింగ్ జరిగింది. మూడు రౌండ్ల బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించినా స్పీకర్ విజయానికి కావాల్సిన మెజార్టీ 218 ఓట్లు రాలేదు. దీంతో సభలో 222 సీట్లున్న రిపబ్లికన్ పార్టీకి షాక్ తగిలింది. స్పీకర్ పదవికి పోటీ పడుతున్న కెవిన్ మెకర్తీకి సొంత సభ్యుల నుంచే వ్యతిరేకత వచ్చింది. దీంతో మంగళవారం మూడు రౌండ్ల ఓటింగ్ జరిగినా ఆయన 218 ఓట్లు సాధించలేకపోయారు. 202 మంది రిపబ్లికన్ ప్రతినిధులు ఆయనకు అనుకూలంగా ఓటు వేయగా.. మరో 20 మంది వ్యతిరేకిస్తున్నారు.
స్పీకర్ ఎన్నికకు జరిగిన తొలి రౌండ్ ఓటింగ్‌లో ఫలితం తేలకపోవడం అమెరికా ప్రతినిధుల సభ చరిత్రలో 100 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. చివరిసారి 1923లో స్పీకర్ ఎన్నికకు నిర్వహించిన తొలి రౌండ్ ఓటింగ్‌లో ఫలితం రాలేదు.
అయితే స్పీకర్ అభ్యర్థికి కావాల్సిన మెజార్టీ వచ్చే వరకు ప్రతినిధుల సభలో ఓటింగ్ నిర్వహిస్తూనే ఉంటారు. ఫలితం వచ్చే వరకు ఎన్ని రౌండ్లయినా ఈ ప్రక్రియ కొనసాగిస్తారు. మంగళవారం మూడు రౌండ్ల ఓటింగ్ జరగగా.. బుధవారం మరోమారు ఓటింగ్ నిర్వహిస్తారు. తాను మళ్లీ రేసులో నిలబడతానని మెకర్తీ స్పష్టం చేశారు. పార్టీ సభ్యులతో చర్చించి అందరూ తనకు మద్దతు తెలిపేలా చూస్తానన్నారు.
అయితే 20 మంది రిపబ్లికన్ సభ్యులు మెకర్తీని వ్యతిరేకిస్తున్నారు. వీరంతా ట్రంప్ సన్నిహితుడు అయిన జిమ్ జోర్డాన్‌కు మద్దతు తెలిపారు. మెకర్తీనే స్పీకర్‌గా ఎన్నుకోవాలని జోర్డాన్ సూచించినా.. వారు మాత్రం వినలేదు. మూడో రౌండ్లోనూ జోర్డాన్‌కు ఓటు వేశారు.
అమెరికా ప్రతినిధుల సభలో ప్రస్తుతం 435 మంది సభ్యులున్నారు. రిపబ్లికన్లకు 222, అధికార డెమొక్రాట్లకు 212 మంది ప్రతినిధులున్నారు. మెజార్టీలో స్వల్ప తేడా ఉండటంతో 20 ఓట్లు చాలా కీలకమయ్యాయి. సభలో మొన్నటివరకు డెమొక్రాట్లదే మెజార్టీ. కానీ ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్లు అధిక సీట్లు గెలుచుకుని సభలో మెజర్డీ సాధించారు.
చదవండి: కిమ్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన దక్షిణ కొరియా..!
Comments
Please login to add a commentAdd a comment