RIP Rayan: Moroccan Boy Trapped Deep Well Five Days Died Viral - Sakshi
Sakshi News home page

‘అమ్మా కాపాడు..’ అని అరుస్తూ ఆ పసిగుండె ఆగింది

Published Mon, Feb 7 2022 10:50 AM | Last Updated on Mon, Feb 7 2022 12:44 PM

RIP Rayan: Moroccan Boy Trapped Deep Well Five Days Died - Sakshi

ఐదేళ్ల పసిబాలుడు.. ఐదు రోజుల పాటు చీకటి ఊబిలాంటి బావిలో అల్లాడిపోయాడు. ఆకలి, ఆక్సిజన్‌ అందిస్తూ అభయం అందించినా..  భయంతో ‘అమ్మా.. పైకి లాగమ్మా’ అంటూ వేసిన కేకలు కోట్ల మందిని చలింపజేశాయి. నిర్విరామంగా కృషి చేసిన సహాయక సిబ్బంది.. ఆ చిన్నారిని చేరుకునేలోపే నష్టం జరిగిపోయింది. ఆ చిన్నారి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయింది. బోరుబావి విషాద ఘటన.. మొరాకోలో మాత్రమే కాదు ఆ మాటకొస్తే ఇంటర్నెట్‌ ప్రపంచం మొత్తానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. 


రయాన్ అవ్రామ్ వయసు ఐదేళ్లు. షెఫ్షావూలోని తన ఇంటి దగ్గర పోయిన మంగళవారం ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ 32 మీటర్ల లోతైన బోరుబావిలో పడిపోయాడు. పిల్లాడు సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో తప్పిపోయాడేమోనని అంతా వెతికారు. అయితే, సమీపంలోని బోరు బావి నుంచి కేకలు వినిపిస్తుండడంతో అప్రమత్తమైన స్థానికులు.. తల్లిదండ్రులకు సమాచారం అందించారు.  లైట్లు వేసి చూశారు. తనను పైకి లాగాలంటూ ఆ చిన్నారి ఆర్తనాదాలు చేశాడు. వెంటనే అధికారులకు సమాచారమివ్వగా వారొచ్చి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఐదు రోజుల పాటు ఆపరేషన్ సాగింది. పిల్లాడికి గొట్టం ద్వారా తిండి, నీళ్లు, ఆక్సిజన్ పంపించారు. ఊపిరి ఆడక ఆ చిన్నారి ఆక్సిజన్‌ పైపు దగ్గరికి ముఖం పోనిచ్చిన వీడియోలు, ఫొటోలు వైరల్‌ కావడం.. పలువురిని కంటతడి పెట్టించింది. 

నాన్‌స్టాప్‌ ఆపరేషన్‌
పిల్లాడిని బతికించేందుకు బోరుబావికి సమాంతరంగా అధికారులు సొరంగం తవ్వడానికి తీవ్రంగా శ్రమించారు. భారీ ఎత్తున జరిగిన ఈ రెస్క్యూ ఆపరేషన్‌కు స్థానికులు సైతం సహకరించారు. వాళ్ల కోసం వంటవార్పు సిద్ధం చేసి.. సహాయక కార్యక్రమాలు ఆగిపోకుండా చూసుకున్నారు. మరోవైపు దేశం మొత్తం, ఇంటర్నెట్‌ నిండా ఆ బాలుడు క్షేమంగా బయటకు రావాలని ప్రార్థనల పోస్టులు కనిపించాయి. ఐదురోజుల శ్రమ అనంతరం  బాలుడు ఇరుకున్న చోటుకు చేరుకున్నారు. కానీ, అప్పటికే ఆ పిల్లాడి ఊపిరి ఆగిపోయింది. విగత జీవిగా మారిన తమ బిడ్డను చేతుల్లోకి తీసుకుని తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. మొరాకో వ్యాప్తంగా పాఠశాలల్లో నివాళిగా పిల్లలు ర్యాలీలు తీశారు. ఘటనపై గురించి తెలిసి మొరాకో రాజు మహ్మద్ సంతాపం తెలిపారు.

బా అంకుల్‌ కంటతడి పెట్టిన వేళ.. 

రయాన్‌ మరణవార్త తెలిసిన తర్వాత.. మొరాకో మొత్తం విషాదంలోకి కూరుకుపోయింది. చాలా చోట్ల ఆ చిన్నారికి నివాళులు అర్పించారు. పాలస్తీనాకు చెందిన ఓ తండ్రి.. అప్పుడే పుట్టిన తన బిడ్డను రయాన్‌ అని పేరు పెట్టడం విశేషం. బా అలీ.. మొరాకో మొత్తం బా అంకుల్‌ అని ముద్దుగా పిల్చుకుంటుంది. బోరు బావులను తవ్వడంలో నేర్పరి అయిన బా అలీ.. గతంలోనూ ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్లు ఎన్నో నిర్వహించారు కూడా. వంద గంటలపాటు నాన్‌స్టాప్‌గా పని చేసిన బా అంకుల్‌.. చివరికి చిన్నారి రయాన్‌ ప్రాణాలతో లేడనే విషయం తెలిసి కన్నీళ్ల ప్రాయం అయ్యాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement