ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలు పెట్టి మూడు వారాలు గడుస్తోంది. యుద్ధ వ్యయం ఇప్పటికే తడిసి మోపెడవుతోంది. ఈ భారానికి ప్రపంచ దేశాల ఆంక్షలు తోడై ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే దిశగా వెళ్తున్న సూచనలు కన్పిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై దండయాత్రలో పాల్గొంటున్న రష్యా సైనికులు కూడా ఆత్మ స్థైర్యం కోల్పోయి అసహనంలోకి కూరుకుపోతున్నారు. భీకరమైన దాడుల నేపథ్యంలో రష్యా వనరులు క్రమంగా కరిగిపోతున్నాయా? వీటన్నింటికీ మించి... యుద్ధమిలాగే కొనసాగితే మరో పది రోజుల్లో రష్యా ఆయుధ భాండాగారం ఖాళీ అయిపోనుందా? అవుననే అంటున్నారు అమెరికా సైనిక నిపుణులు...
– మాస్కో/కీవ్
ఉక్రెయిన్‌పై రష్యా ఇప్పటివరకు ఎన్నో ప్రమాదకరమైన ఆయుధాల్ని వాడింది. క్లస్టర్ బాంబులు, వాక్యూమ్ బాంబులు కూడా ప్రయోగించింది. అయినా ఉక్రెయిన్ ఇప్పటికీ శక్తికి మించి పోరాడుతూనే ఉంది. ఈ స్థాయి ప్రతిఘటన రష్యా ఊహించనిదే. ఈ నేపథ్యంలో, రష్యా దగ్గరున్న ఆయుధాలు మరో పది రోజులు, మహా అయితే రెండు వారాల కంటే సరిపోకపోవచ్చని అమెరికా లెఫ్ట్‌నెంట్ జనరల్ బెన్ హోడ్జెస్ అంటున్నారు. ఆ తర్వాత దాడి చేయడానికి చెప్పుకోదగ్గ ఆయుధాలంటూ ఏమీ మిగలకపోవచ్చన్నారు. దీనికి తోడు రష్యా సైనికులు కూడా బాగా అలిసిపోయారని విశ్లేషించారు. చైనాను రష్యా సాయుధ సాయం అర్థిస్తోందన్న వార్తలు ఇందుకు బలం చేకూర్చేవేనంటున్నారు.
డ్రోన్లతో రష్యాకు చెక్
ఉక్రెయిన్‌పైకి రష్యా వందలాది 9కె720 ఇస్కాండర్ బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. 500 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించే ఈ శక్తిమంతమైన క్షిపణులతో ఇళ్లు, ఆస్పత్రులు, పాఠశాలలపై ప్రయోగించి ధ్వంస రచన సాగించింది. 3ఎం–14 కాలిబర్ ఉపరితల దాడికి వినియోగించే క్రూయిజ్ క్షిపణిని కూడా ప్రయోగించింది. ఏకంగా 2,500 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణుల్ని భారీగా వాడుతోంది. 6 కి.మీ. దూరంలో ఏమున్నా సర్వనాశనం చేసే టీఒఎస్–1 బురాటినో హెవీ ఫ్లేమ్ థ్రోయర్ అనే ప్రాణాంతక ఆయుధ వ్యవస్థనూ రంగంలోకి దించింది. ఇక టి–90, టి–72 బీఎం3 యుద్ధ ట్యాంకులు సరేసరి.
కానీ రష్యా దాడుల్ని ఉక్రెయిన్ అనూహ్యంగా డ్రోన్లతో సమర్థంగా అడ్డుకుంటోంది. టర్కీ తయారీ టీబీ2 డ్రోన్లను విస్తృతంగా వినియోగిస్తోంది. భూ ఉపరితలం మీదుగా రష్యా సైనికుల ఆనవాళ్లు గుర్తించి అడ్డుకుంటోంది. ‘‘మా సైన్యం అపారమైన ధైర్య సాహసాలు ప్రదర్శిస్తోంది. చెచెన్యాలో ఏళ్ల తరబడి రెండు యుద్ధాలు చేసిన దాని కంటే ఈ 20 రోజుల యుద్ధంలో రష్యా ఎక్కువగా నష్టపోయింది’’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. తమపై రష్యా భూతల యుద్ధం దాదాపుగా ముగిసినట్టేనన్నారు.
15 వేల మందికి పైగా మృతి ?
రష్యా సైనికుల మృతిపైనా రకరకాల లెక్కలు ప్రచారంలో ఉన్నాయి. 5 వేల నుంచి 9 వేల మంది రష్యా సైనికులు మరణించారని అమెరికా లెక్కలు వేస్తుంటే, 15 వేల మందికి పైగా ప్రాణాలు తీశామని ఉక్రెయిన్ చెబుతోంది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో పలు ప్రాంతాల్లో లక్షన్నర సైన్యాన్ని యుద్ధానికి చాలా ముందునుంచే రష్యా మోహరించడం తెలిసిందే. కానీ యుద్ధానికి వారిని ముందస్తుగా పూర్తిస్థాయిలో సిద్ధం చేయపోవడంతో సైనికుల్లో అసహనం అంతకంతకు పెరిగిపోతోంది. ఉక్రెయిన్లో విపరీతమైన చలి, ఆహారం, అత్యవసరాల లేమి తదితరాలు వారి పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి.
మే కల్లా యుద్ధం సమాప్తం!
రష్యా వనరులన్నీ కరిగిపోతున్నందున తమతో సంధి మినహా మరో మార్గం లేదని ఉక్రెయిన్ ధీమాగా ఉంది. ‘మే తర్వాత యుద్ధం చేయడానికి రష్యా దగ్గర ఏమీ మిగలదు. రెండు మూడు రోజుల నుంచి వారం లోపు మాతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంటుంది’ అని అంటోంది. దీన్ని రష్యా కొట్టిపారేస్తోంది. త్వరలో లక్ష్యాన్ని చేరుకుంటామని అధ్యక్షుడు పుతిన్ వ్యక్తిగత భద్రతా ఇన్‌చార్జి విక్టర్ జోలోటోవ్ అన్నారు.
యుద్ధంలో ఇప్పటిదాకా రష్యాకు సాయుధ నష్టం
(ఉక్రెయిన్ వెల్లడించిన మేరకు...)
యుద్ధ ట్యాంకులు - 404
సాయుధ వాహనాలు - 1279
యుద్ధ విమానాలు - 81
హెలికాప్టర్లు - 95
శతఘ్నలు - 140
రాకెట్ లాంచర్లు - 64
డ్రోన్లు - 9
యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ వెపన్స్ - 36
నౌకలు - 3
Comments
Please login to add a commentAdd a comment