Military Strengths of Russia and Ukraine, Compared: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైనిక బలం కలిగిన దేశాల్లో ఒకటైన రష్యా ముందు ఉక్రెయిన్ నిలబడడమే కష్టం. రెండు దేశాల మిలటరీ బలాల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. రష్యా బాహుబలి అయితే, దాని ముందు ఉక్రెయిన్ ఒక మరుగుజ్జు కిందే లెక్క. 2014లో రష్యా క్రిమియాని ఆక్రమించుకున్నప్పటితో పోల్చి చూస్తే ఉక్రెయిన్ మిలటరీ బాగా బలపడింది. సైన్యం బాగా శిక్షణ పొంది గట్టి పోరాట పటిమను ప్రదర్శిస్తోంది. గత కొద్ది వారాలుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ సైన్యాన్ని మూడు వైపుల నుంచి మోహరించారు. క్షిపణి వ్యవస్థలో ప్రపంచంలోనే రష్యా కింగ్. ఉక్రెయిన్ రక్షణ స్థావరాలు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, ఇతర మౌలిక సదుపాయాలు లక్ష్యంగా చేసుకొని దాడులు చేసే క్షిపణులు రష్యా దగ్గర ఉన్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఆయుధ మార్కెట్‌ను పరిశీలించే స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్‌ఐపీఆర్‌ఐ) గణాంకాల ప్రకారం రక్షణ బడ్జెట్‌పై ఉక్రెయిన్ వ్యయంతో పోల్చి చూస్తే రష్యా 10 రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తోంది. 2020లో రష్యా రక్షణ రంగంపై 6,170 కోట్ల డాలర్లు ఖర్చు పెడితే, ఉక్రెయిన్ 590 కోట్ల డాలర్లు వెచ్చించింది. ప్రపంచ దేశాల సైనిక బలాబలాలను విశ్లేషించే గ్లోబల్ ఫైర్ పవర్ ప్రకారం మిలటరీ పవర్‌లో 140 దేశాల్లో రష్యాది రెండో స్థానమైతే, ఉక్రెయిన్ 22వ స్థానంలో ఉంది. యుద్ధ భయంతో ఉక్రెయిన్ ప్రధాని జెలెన్‌స్కీ ఈ మధ్య కాలంలో మిలటరీ సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకున్నారు. ఉక్రెయిన్ సైనిక సిబ్బందిని 3,61,00కి పెంచారు.
చదవండి: ('ఇది వినాశనానికే.. రష్యాకు ఏ మాత్రమూ మేలు చేయదు')
ఉక్రెయిన్‌కి పశ్చిమ దేశాల అండ ఇలా..
పశ్చిమాది దేశాలు రష్యాపై విమర్శలు గుప్పిస్తూ ఉక్రెయిన్‌కి అండగా ఉంటామని చెబుతున్నాయి. అయితే ఉక్రెయిన్ ఆయుధాలతో పాటుగా సైనిక బలగాలను ఇతర దేశాల నుంచి ఆశిస్తోంది. అమెరికా 2014 నుంచి ఉక్రెయిన్ మిలటరీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి సహకారం అందిస్తూ వస్తోంది. 250 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం ఇప్పటివరకు చేసింది. గత డిసెంబర్ నుంచి జావెలిన్ యాంటీ ట్యాంకు క్షిపణులు, నిఘా నౌకలు, హమ్‌వీస్, స్నిపర్ రైఫిల్స్, డ్రోన్లు, రాడార్ వ్యవస్థ, నైట్ విజన్, రేడియో పరికరాలు యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిస్సైల్స్ , ఆయుధాలు, మరబోట్లు వంటివి సరఫరా చేసింది. ప్రస్తుతం తమ దేశం నుంచి ఎలాంటి బలగాలు పంపించబోమని అమెరికా స్పష్టం చేసింది.
గత మూడు నెలల్లో దాదాపుగా 90 టన్నుల ఆయుధాలను అమెరికా పంపింది. దీంతో ఉక్రెయిన్ దగ్గరున్న మిలటరీ ఆయుధాలు 1300 టన్నులకు చేరుకున్నాయి. బ్రిటన్ 2,000 షార్ట్ రేంజ్ యాంటీ ట్యాంక్ మిస్సైల్స్‌ని పంపడంతో పాటు వాటిని వినియోగించడంలో శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేక నిపుణుల్ని కూడా పంపించింది. టర్కీ బేరట్కార్ టీబీ2 డ్రోన్లను విక్రయించింది. ఎస్టోనియా జావెలిన్ యాంటీ ఆర్మర్ క్షిపణులు, లుథానియా స్ట్రింగర్ క్షిపణులు, చెక్ రిపబ్లిక్ 152ఎంఎం ఫిరంగులు పంపించడానికి సన్నాహాలు చేస్తున్నాయి. జర్మనీ ఆయుధాలు సరఫరా చేయడానికి నిరాకరించినప్పటికీ, యుద్ధభూమిలో ఆస్పత్రులు, ఇతర శిక్షణ కోసం 60 లక్షల డాలర్ల ఆర్థిక సాయం చేయడానికి అంగీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment