వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు 19వ రోజుకు చేరుకున్నాయి. రష్యా దాడుల వల్ల ఇప్పటికే ఉక్రెయిన్ చాలా నష్టపోయింది. మరోవైపు పుతిన్ కఠిన ఆంక్షలను సైతం లెక్కచేయకుండా దాడులను తీవ్రతరం చేస్తున్నాడు. రష్యా బలగాలు వైమానిక దాడులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతుండటంతో వేల సంఖ్యలో ప్రాణ నష్టం జరుగుతోంది. ఇదిలా ఉండగా.. మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా.. చైనాను సాయం కోరిందని ‘న్యూయార్క్ టైమ్స్’, ‘ఫైనాన్షియల్ టైమ్స్’ కథనాలు వెల్లడించాయి. ఈ కథనాల్లో ఆయుధ, ఆర్థిక సహాయం అందించాలని చైనాను రష్యా కోరినట్టు వివరించాయి. కాగా, అమెరికాకు చెందిన సీనియర్ అధికారుల వ్యాఖ్యల మేరకు ఈ కథనాలు వెలువడినట్టు తెలుస్తోంది. మరోవైపు రష్యా.. చైనా వద్ద ఎలాంటి ఆయుధాలను అందించాలని కోరింది అనే విషయాన్ని మాత్రం వారు స్పష్టం చేయకపోవడం గమనార్హం. అయితే, రష్యా అభ్యర్థన మేరకు చైనా కూడా సహకారం అందించేందుకు సిద్ధమవుతోందని ఆ కథనాలు తెలుపుతున్నాయి.
ఇదిలా ఉండగా.. సోమవారం రోమ్ వేదికగా చైనా విదేశీ వ్యవహారాల శాఖ ఉన్నతాధికారి యాంగ్ జీచీతో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాన్ సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో సులివాన్ మాట్లాడుతూ.. రష్యా ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను చైనాతో సహా మరే దేశం కూడా భర్తీ చేయలేవని వెల్లడించారు. యుద్దం కారణంగా రష్యా తీవ్ర విపత్కర పరిస్థితులను ఎదుర్కొనుందని తెలిపారు. మరోవైపు.. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్.. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ క్రమంలో ఫ్రాన్స్.. ఉక్రెయిన్ ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు మద్దతుగా ఉండాలని వారు నిర్ణయించినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment