రష్యా.. ఇక నుంచి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో సభ్య దేశం కాదు. గురువారం రాత్రి సాధారణ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌లో రష్యా తొలగింపునకు లైన్ క్లియర్ అయ్యింది. బుచాలో నరమేధానికి తెగబడ్డ రష్యా.. యుద్ధ నేరాలతో ఇప్పటికే శాంతి స్థాపనకు విఘాతం కలిగించిందని.. అలాంటి దేశానికి మండలిలో కొనసాగే అర్హత లేదంటూ తీర్మానాన్ని ప్రవేశపెట్టే సమయంలో వాదించింది అమెరికా.
ఇక ఈ పరిణామంపై ఉక్రెయిన్ హర్షం వ్యక్తం చేసింది. రష్యాను మానవ హక్కుల మండలి నుంచి తొలగించడాన్ని గొప్ప చర్యగా అభివర్ణించింది. రష్యాకు ఈ మండలిలో కొనసాగే అర్హత ఏమాత్రం లేదంటూ సాధారణ అసెంబ్లీలో ఉక్రెయిన్ ప్రతినిధి వాదించారు. ‘‘మానవ హక్కులను కాపాడే లక్ష్యంతో ఉన్న UN సంస్థల్లో యుద్ధ నేరస్థులకు స్థానం లేదు’’ అంటూ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కుబెల ట్వీట్ చేశారు. న్యాయం వైపు నిలబడిన సభ్యదేశాలకు రుణపడి ఉంటామంటూ పేర్కొన్నారాయన.
► యూఎన్ హెచ్‌ఆర్సీ నుంచి బహిష్కరణ పట్ల రష్యా మండిపడుతోంది. పూర్తి అక్రమ, రాజకీయ ప్రేరేపిత చర్యగా అభివర్ణించింది క్రెమ్లిన్. ఇప్పటికే ఐక్యరాజ్య సమితిలో ఒంటరిగా మారిపోయిన రష్యా ప్రతినిధి.. ఓటింగ్ సమయంలోనూ మౌనంగా చూస్తూ ఉండిపోయారు.
► మానవ హక్కుల పట్ల గౌరవంతో కొనసాగుతున్న మండలిలో రష్యాకు కొనసాగే అర్హత లేదు. ముఖ్యంగా ఉక్రెయిన్‌లోని బుచా, ఇర్పిన్, మారియుపోల్ ప్రాంతాల్లో.. అది కలిగించిన వినాశనం.. ప్రపంచం చూసిన దురాగతాలు యుద్ధ నేరాలకు సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా తన దురాక్రమణ యుద్ధాన్ని తక్షణమే, బేషరతుగా విరమించుకోవాలని.. UN చార్టర్‌లో పొందుపరచబడిన సూత్రాలను గౌరవించాలని ఈ తొలగింపు చర్య ద్వారా ప్రపంచం మరొక స్పష్టమైన సంకేతాన్ని పంపినట్లయ్యింది అంటూ అమెరికా ఒక ప్రకటనలో పేర్కొంది.
చదవండి: పుతిన్‌ను బోనెక్కించగలరా?
Comments
Please login to add a commentAdd a comment