Russia Ukraine Crisis War Live Updates: War Declared, Details In Telugu - Sakshi
Sakshi News home page

Russia Ukraine War Updates: ఇక మాటల్లేవ్‌.. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన రష్యా

Published Thu, Feb 24 2022 9:02 AM | Last Updated on Thu, Feb 24 2022 11:31 PM

Russia Ukraine Crisis War Declared Live Updates In Telugu - Sakshi

UPDATES

► ఉక్రెయిన్‌లో 70 సైనిక స్థావరాలు, 10 వైమానిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించింది. రాజధాని నగరం కీవ్‌లోని ఉత్తర భాగంలో రష్యా దళాలు ప్రవేశించాయి. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను రష్యా బలగాలు సమీపిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే లుహాన్స్‌క్‌లోని 2 పట్టణాలను రష్యా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. తమ విమానాలు కూల్చారన్న ఉక్రెయిన్‌ ఆరోపణలను రష్యా ఖండించింది. ఉక్రెయిన్‌ ప్రభుత్వ భవనాలను తమ ఆధీనంలోకి తీసుకోవాలన్న యోచనలో రష్యా ఉన్నట్లు సమాచారం. 

►  రష్యా- ఉక్రెయిన్‌ వార్‌పై నాటో కీలక వ్యాఖ్యలు చేసింది. ఉక్రెయిన్‌కు నాటో బలగాలను పంపే ఆలోచన తమకు లేదని నాటో చీఫ్‌ ప్రకటించారు. నాటో ఉక్రెయిన్‌ వ్యాఖ్యలతో నిస్సహాయ స్థితిలోకి వెళ్లింది.

► రష్యా దూకుడు ముందు ఉక్రెయిన్‌ కకావికలం అవుతోంది. ప్రతిఘటన లేకుండానే రష్యా సైన్యం దూసుకుపోతోంది. మెజార్టీ నగరాల్లో పాగా దిశగా రష్యా మిలటరీ ముందుకెళ్తోంది. ఉక్రెయిన్‌ ఎక్కడా నిలువరించలేకపోవండంతో రష్యా దాడులు కొనసాగిస్తోంది. తక్కువ సైన్యం, ఆయుధ సంపత్తితో ఉక్రెయిన్‌ పోరాడలేని స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది.

చాలా చోట్ల ఉక్రెయిన్‌ వాసులు నగరాలు విడిచి వెళ్లిపోతున్నారు. ప్రాణ భయంతో ముఖ్య ప్రాంతాలకు ఉక్రెయిన్‌ పౌరులు దూరంగా ఉన్నారు. ప్రధానంగా ఎయిర్‌పోర్టులు, విద్యుత్ కేంద్రాలపై రష్యా దాడులు చేస్తోంది. ఇప్పటివరకు 40మంది ఉక్రెయిన్‌ సైనికులు, 10మంది పౌరులు మృతి చెందినట్లు రాయిటర్స్ కథనం వెల్లడించింది. 

► ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ఆకాంక్షించారు. ఉక్రెయిన్‌లో విమానాలు ల్యాండ్‌ అయ్యే పరిస్థితి లేదని, అయినప్పటికీ భారతీయులను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సృష్టం చేశారు.

ఉక్రెయిన్‌లో మార్షల్ లా అమల్లో ఉండటంతో  ప్రయాణాలు కష్టంగా మారాయని ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకటన వెలువరించింది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో ఉండటానికి చోటులేకుండా చిక్కుకున్నవారి కోసం, స్థానిక యంత్రాంగంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది.

బాంబు వార్నింగ్‌లు, ఎయిర్ సైరన్ల మోత కీవ్‌లో చాలా చోట్ల వినిపిస్తున్నాయని పేర్కొంది.  తాము చోట ఇలాంటి సైరన్లు వినిపిస్తే.. గూగుల్ మ్యాప్ ద్వారా సమీపంలోని బాంబ్ షెల్టర్లను చేరుకోండి. కీవ్‌లో చాలా మంది అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లలో తలదాచుకుంటున్నారు. తమపాస్‌పోర్టులు, పత్రాలను పట్టుకుని వీలైనంత వరకు ఇళ్లల్లోనే ఉండాలని సూచించింది.

 ఉక్రెయిన్ సంక్షోభంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌ ప్రచారంలో ఉన్న మోదీ.. ఢిల్లీ చేరుకున్న తరువాత సమీక్ష నిర్వహించనున్నారు. 

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్రం పేర్కొంది. సుమారు 18 వేల మంది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోగా.. ఉక్రెయిన్ గగనతలం తెరుచుకోగానే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రవాణా విమానాలను పంపాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాల ద్వారా భారతీయుల తరలింపుకు ఏర్పాట్లు చేస్తోంది.

రష్యా దాడిలో ఉక్రెయిన్‌కు చెందిన 40 మంది సైనికులు, 10 మంది పౌరులు మృతి చెందిన‌ట్లు ఆ దేశ‌ ప్రెసిడెంట్ కార్యాల‌యం ప్ర‌క‌టించింది. ర‌ష్యా చేప‌ట్టిన మిల‌ట‌రీ ఆప‌రేష‌న్‌లో వంద‌లాది మంది తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు తెలిపింది. ర‌ష్యా ప్ర‌క‌టించిన యుద్ధంలో సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని పేర్కొంది. 

ఉక్రెయిన్‌- రష్యా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు భారత్‌ వెల్లడించింది. రష్యన్‌ మాట్లాడే అధికారులను విదేశాంగ శాఖ ఉక్రెయిన్‌కు పంపింది. ఉక్రెయిన్‌ రాయబార కార్యాలయంలో సహకారం కోసం వారిని పంపినట్టు తెలిపింది. ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ పనిచేస్తోందని వెల్లడించింది. సమాచారం కోసం 24గంటల కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్టు ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.

మరోవైపు రష్యా దాడులకు ఉక్రెయిన్‌ సైన్యం కూడా దీటుగా స్పందిస్తోంది. 50  మంది దురాక్రమణదారుల్ని చంపినట్లు, 7 విమనాలను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. 

రష్యా దాడులతో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు సంచలన ప్రకటన చేశారు. దేశం కోసం ముందుకొచ్చిన వాళ్లకు ఆయుధాలు ఇస్తామని వెల్లడించారు. దీని కోసం అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. 

స్టాక్‌ మార్కెట్లపై రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం చూపించింది. దాదాపు అన్నీ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు రూ.10 లక్షల కోట్లను కోల్పోయారు. సెన్సెక్స్‌  2,702 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 815 పాయింట్లు నష్టపోయింది. భారీ నష్టాలతో స్టాక్‌ మార్కెట్‌ ముగిసింది.

► రష్యాకు ఎట్టి పరిస్థితుల్లో లొంగేది లేదని, రష్యా దళాలను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నామని ఉక్రెయిన్‌ తెలిపింది. తమ దాడిలో 50 మంది రష్యా సైనికులు చనిపోయినట్లు పేర్కొంది. 6 రష్యా విమానాలను కూల్చివేశామని ప్రకటించింది. 

అయితే ఉక్రెయిన్‌ ప్రకటనను రష్యా ఖండించింది. తమ ఒక్క విమానాన్ని కూడా ఉక్రెయిన్‌ కూల్చలేదని పేర్కొంది. ఉక్రెయిన్‌ అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని స్పష్టం చేసింది.

రష్యాది సైనిక చర్య కాదు.. యుద్ధమే అని భారత్‌లోని ఉక్రెయిన్‌ రాయబారి డా. ఇగోర్‌  పొలిఖా అన్నారు. రష్యా దాడుల్లో భారీగా ఉక్రెయిన్‌ ప్రజలు మృతి చెందారని తెలిపారు. పరిణామాలను భారత్‌ నిశితంగా గమనిస్తోందని చెప్పారు. యుద్ధ సంక్షోభ వేళ భారత్‌ అండగా నిలవాలని కోరుకుంటున్నామని భారత్‌లోని ఉక్రెయిన్‌ రాయబారి డా. ఇగోర్‌  పొలిఖా కోరారు. పరిస్థితులు క్షీణిస్తున్నందున ఉక్రెయిన్‌కు భారత్‌ మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. నాటో, ఈయూ సభ్యత్వం గురించి మాట్లాడలేనని పేర్కొన్నారు.

► ఉక్రెయిన్‌- రష్యా ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీస్తాయని ఊహించలేదని రక్షణ నిపుణుడు పీ.కే.సెహగల్‌ తెలిపారు. ఉక్రెయిన్‌ ఆక్రమణ తమ ఉద్దేశం కాదని రష్యా పలుమార్లు స్పష్టం చేసిందని అ‍న్నారు. ఈ యుద్ధం వల్ల ప్రాణ నష్టం భారీగా ఉంటుందని అంచనా వేశారు.

► రష్యా దాడిలో ఇప్పటివరకు ఏడుగరు మృతి చెందిన ఉక్రెయిన్‌ అధికారుల ప్రకటించారు. తొమ్మిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయని వెల్లడించారు.

ఉక్రెయిన్‌పై రష్యా  బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంతో స్పందించిన ఐక్యరాజ్యసమితి.. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యల నిలిపివేయాలని విజ్ఞప్తి చేసింది. యుద్ధం ఆపడంపై ఐక్యరాజ్యసమి బాధ్యత వహించాలని ఉక్రెయిన్‌ దేశం కోరింది.

► ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం విరుచుకుపడుతోంది. రష్యా యుద్ధ విమనాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉక్రెయిన్‌లోని కీవ్‌ ఎయిర్‌పోర్టు రష్యా సైన్యం అధీనంలోకి తీసుకుంది. రష్యా దాడిలో ఉక్రెయిన్‌లో 300 మంది పౌరులు మృతి చెందారు. ఉక్రెయిన్‌లో నిత్యావసరల కోసం జనాలు బారులు తీరారు. పెట్రోల్‌ బంకుల దగ్గర వాహనాలు క్యూ పెరిగింది. 

► రష్యా దాడి నేపథ్యంలో కీవ్‌ నగరాన్ని ప్రజలు వీడుతున్నారు. తమ నగరంపై బాంబుల మోత మోగుతుండటంతో వేరే ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. దీంతో కీవ్‌లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. పెద్ద ఎత్తున వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి.

►రష్యాపై ఎదురుదాడికి నాటో దళాలు సిద్ధమయ్యాయి. ఉక్రెయిన్‌ వైపు అమెరికా యుద్ధ విమనాలు మోహరించింది. ఇటు రష్యా దాడిని ఉక్రెయిన్‌ సైతం ప్రతిఘటిస్తోంది. మరోవైపు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను జనాలు వదిలి వెళ్తున్నారు.  హైవేలపై ఎక్కడ చూసినా భయంతో తరలిపోతున్నారు.

►ఎయిర్‌బేస్‌లు ఉన్న ప్రాంతాను రష్యా మొదట టార్గెట్‌ చేసింది. సత్వోయ్‌లోని హైడ్రాలిక్‌ పవర్‌ ప్లాంట్‌పై రష్యన్‌ ఆర్మీ బాంబు దాడి చేసింది.  రష్యా దాడిలో ఉక్రెయిన్‌లో 18 చోట్ల ఇప్పటికే 300 మంది పౌరులు మరణించారు. 23 ప్రాంతాల్లో రష్యా బాలిస్టిక్‌ మిస్సైల్‌ ఎటాక్‌ జరుపుతోంది. ఉక్రెయిన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది. 

►ఉక్రెయిన్‌ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని భారత విదేశాంగశాఖ తెలిపింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల గురిచి ఆలోచిస్తున్నామని పేర్కొంది. విద్యార్థుల భద్రత కోసం కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని కోరింది.

► రష్యా దాడులతో అప్రమత్తమైన ఉక్రెయిన్‌ ఎదురుదాడి ప్రారంభించింది. రష్యాకు ధీటుగా భారీగా బలగాలను మోహరించి కీలక ప్రాంతాల్లో తిరుగుబాటు మొదలు పెట్టింది. రష్యా ఫైటర్‌ జెట్‌ను ఉక్రెయిన్‌ బలగాలు కూల్చివేశాయి. 5 రష్యా విమానాలు, హెలికాప్టర్‌ను కూల్చివేసినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది.

►ఉక్రెయిన్‌లోని నగరాలపై దాడులు చేయడం లేదని రష్యా పేర్కొంది. జనావాసాలు తమ లక్ష్యం కాదని, కేవలం సైనిక స్థావరాలు, వసతులు, ఎయిర్‌ డిఫెన్స్‌, వాయుసేనను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నట్లు  తెలిపింది.

►రష్యా దాడులతో అప్రమత్తమైన ఉక్రెయిన్‌ ఎదురుదాడి ప్రారంభించింది. రష్యాకు ధీటుగా భారీగా బలగాలను మోహరించింది. రష్యా యుద్ధం ప్రకటించడంతో ఉక్రెయిన్‌ ప్రభుత్వం మార్షల్‌ లా విధించింది. పౌరులు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని ఉక్రెయిన్‌ ఆదేశించింది.

►తమ దేశాన్ని కాపాడుకుంటామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. ముందుగా దౌత్యపరమైన ప్రయత్నాలే చేస్తామన్న జెలెన్‌ స్కీ.. రెండో ప్రణాళికగా బలగాలను దింపుతామని తెలిపారు.

►రష్యా సైనిక చర్య నేపథ్యంలో ఉక్రెయిన్‌ ఎయిర్‌ స్పేస్‌ మూసివేసింది. దీంతో ఉక్రెయిన్‌ నుంచి భారత పౌరులను తీసుకొచ్చేందుకు ఢిల్లీ నుంచి వెళ్లిన ఎయిరిండియా విమానం వెనక్కి మళ్లింది. 



► రష్యా దాడికి ప్రతి చర్య తప్పదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హెచ్చరించారు. ఉక్రెయిన్‌పై రష్యా అన్యాయంగా దాడి చేస్తోందని, ఈ పరిణామాలకు రష్యానే తప్పక బాధ్యత వహించాలన్నారు. యుద్ధం వల్ల సంభవించే మరణాలు, సంక్షోభాలకు రష్యానే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. 

► ఉక్రెయిన్‌ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హెచ్చరించాడు. ఉక్రెయిన్‌ స్వాధీనం చేసుకునే ఉద్ధేశ్యం రష్యాకు లేదన్నారు. రక్తపాతానికి ఉక్రెయిన్‌ పాలకులే బాధ్యత వహించాలని అన్నారు. వేర్పాటువాద ప్రాంతాల్లో పౌరులకు రక్షణకు మిలటరీ ఆపరేషన్‌ మొదలైనట్లు తెలిపారు.

► దక్షిణ బెలారస్‌లో ఉక్రెయిన్‌ సరిహద్దులకు అత్యంత సమీపంలోకి రష్యా బలగాలు చేరుకున్నాయి. మాక్సర్‌ సంస్థ సేకరించిన శాటిలైట్‌ చిత్రాల ద్వారా ఈ విషయం వెల్లడయింది. దక్షిణ బెలారస్‌లోని మెజ్యార్‌ ఎయిర్‌ఫీల్డ్‌ వద్ద 100కుపైగా మిలిటరీ వాహనాలు, డజన్ల కొద్దీ గుడారాలు వెలిశాయి. ఈ విమానాశ్రయం ఉక్రెయిన్‌కు 40 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉంది. రష్యా స్వతంత్ర దేశంగా గుర్తించిన డోన్‌బాస్‌లోకి రష్యా సేనలు చేరుకున్నాయి.


 

►రష్యా బలగాల నుంచి తమను తాము రక్షించుకొనేందుకు ఉక్రెయిన్‌ పౌరులు తుపాకులు చేతబట్టడానికి అనుమతించాలని ఉక్రెయిన్‌ యోచిస్తుంది. దీనికి ఆ దేశ పార్లమెంటు అమోదం తెలుపాల్సి ఉంది. ఉక్రెయిన్‌లో యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. రష్యా సైనిక చర్య నిలిపేయాలని ఐక్యరాజ్యసమితి విజ్ఙప్తి చేసింది.

►ఉక్రెయిన్‌పై మిలటరీ ఆపరేషన్‌ మొదలైందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. దీంతో డోన్సాస్‌లో ఉక్రెయిన్ బలగాలు వెనక్కి వెళ్లాలని పుతిన్  హెచ్చరించారు. ఇప్పటికే ఉక్రెయిన్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. ఉక్రెయిన్‌కు 3 వైపులా బలగాలను రష్యా మోహరించింది. ఉక్రెయిన్‌ సరిహద్దులకు యుద్ధ ట్యాంక్‌లను తరలించింది. తూర్పు ఉక్రెయిన్‌ ప్రాంతాలకు తమ బలగాలను పంపుతూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆదేశాలు జారీచేశారు. డొనెట్స్‌క్‌, లుహాన్స్‌క్‌ ప్రాంతాల్లో రష్యా బలగాల మోహరించింది.

బలగాలు రష్యా ఉక్రెయిన్‌
ఆర్మీ  8,50,000  2,00,000
యుద్ధ వాహనాలు 30,122 12,303
యుద్ధ ట్యాంకులు 12,420 2,596
విమానాలు 4,173 318
ప్రిగెట్స్ 11 1
విధ్వంస నౌకలు 15 0
యుద్ధ నౌకలు 605 88
అటాక్ హెలికాప్టర్స్‌ 544 34


 

Russia Ukraine Crisis War: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌పై మిలిటరీ ఆపరేషన్‌ మొదలైందని ప్రకటించారు. ఈ సందర్భంగా డోన్భాస్‌లో ఉక్రెయిన్‌ బలగాలు వెనక్కి వెళ్లాలని పుతిన్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఉక్రెయిన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించుతామన్నారు. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై ఇప్పటికే రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. మరో వైపు పుతిన్‌ ప్రకటనతో ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ జనరల్ అత్యవసరంగా భేటీ అయ్యింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement