మాస్కోవా నౌక (ఫైల్)
కీవ్: రష్యాకు చెందిన ప్రముఖ యుద్ధనౌక మాస్కోవాను మిసైళ్లతో పేల్చామని ఉక్రెయిన్ అధికారులు గురువారం ప్రకటించారు. తమ క్షిపణుల ధాటికి నౌక మునిగిపోయిందని ఒక అధికారి చెప్పారు. అయితే తమ నౌకలో అగ్నిప్రమాదం కారణంగా భారీ నష్టం వాటిల్లిందని రష్యా ప్రకటించింది. ప్రమాదం జరిగిన వెంటనే నౌకలో సిబ్బందిని ఖాళీ చేయించామని తెలిపింది. ప్రమాదం పెద్దదే కానీ నౌక మునిగిపోలేదని, దాన్ని దగ్గరలోని నౌకాశ్రయానికి చేర్చామని వెల్లడించింది. ప్రమాదం జరిగినప్పుడు నౌకలో 500మంది సిబ్బంది ఉన్నట్లు తెలిపింది. నౌకకున్న మిసైల్ లాంచర్లు సురక్షితమేనని పేర్కొంది.
మాస్కోవా నౌక ఒకేమారు 16 లాంగ్ రేంజ్ మిస్సైళ్లను మోసుకుపోతుంది. నౌకలో ఆయుధాలు పేలడంతో నిప్పంటుకుందని రష్యా రక్షణ శాఖ తెలిపింది. యుద్ధం నుంచి ఈ నౌక బయటకు రావడం రష్యాకు ఎదురుదెబ్బగా నిపుణులు భావిస్తున్నారు. నష్టం ఎంతటిదైనా ఈ ఘటన రష్యా ప్రతిష్టకు మచ్చగా అభిప్రాయపడ్డారు. మరోవైపు ఉక్రెయిన్ తేలికపాటి హెలికాప్టర్లను తమ సరిహద్దుల్లోకి పంపి నివాస భవనాలపై బాంబులు కురిపిస్తోందని రష్యా ఆరోపించింది. ఈ దాడుల్లో 7గురు గాయపడ్డారని తెలిపింది. సరిహద్దు వద్ద శరణార్థులు దాటుతుండగా ఉక్రెయిన్ కాల్పులు జరిపిందని అంతకుముందు రష్యా సెక్యూరిటీ సర్వీస్ ఆరోపించింది.
మారియుపోల్‌లో రష్యా ముందంజ
ఉక్రెయిన్‌లోని కీలక నగరం మారియుపోల్‌లో రష్యా బలగాలు ముందంజ వేశాయని రష్యా రక్షణ మంత్రిత్వ ప్రతినిధి ఇగార్ కొనషెంకోవ్ చెప్పారు. నగరంలోని ఒక ఫ్యాక్టరీలో 1,026 మంది ఉక్రెయిన్ సైనికులు లొంగిపోయారన్నారు. ఈ మేరకు రష్యా టీవీ ఒక వీడియోను విడుదల చేసింది. అయితే నగరంలో ఇంకా పోరాటం సాగుతూనే ఉందని ఉక్రెయిన్ మంత్రి వాడైమ్ డెనెసెంకో చెప్పారు. ఎంతమంది బలగాలు నగరంలో పోరాటం చేస్తున్నది తెలియరాలేదు. క్రిమియాతో భూమార్గం ఏర్పాటు చేసుకునేందుకు ఈ నగరం రష్యాకు ఎంతో కీలకం. మాస్కోవా నౌకకు నష్టం వాటిల్లడంతో రష్యా ముందంజ ఎంతమేరకు కొనసాగుతుందోనని అనుమానాలున్నాయి.
ప్లానెట్ లాబ్ సంస్థ విడుదల చేసిన శాటిలైట్ ఫొటోల్లో సెవెస్టోపోల్ నౌకాశ్రయం నుంచి మాస్కోవా ఆదివారం బయటకు వచ్చినట్లు మాత్రమే కనిపిస్తోంది. నౌక ప్రస్తుత లొకేషన్ తెలుసుకునేందుకు సాంకేతిక ఆటంకాలు రావడంతో ఎవరి వాదన నిజమన్నది తెలియరాలేదు. ఉక్రెయిన్ అధికారుల్లో ఒకరు నౌకపై నెప్ట్యూన్ మిసైళ్లను ప్రయోగించడంతో భారీ నష్టం వాటిల్లిందని పేర్కొనగా, మరొక అధికారి నౌక మునిగిందని చెబుతూ ఒక వీడియోను షేర్ చేశారు. కానీ మరో సీనియర్ అధికారి దీన్ని ధ్రువీకరించకపోవడంతో ఉక్రెయిన్ ప్రకటనపై సందేహాలు తలెత్తుతున్నాయి. అమెరికా సైతం ఘటనపై ఉక్రెయిన్ వాదనను ధ్రువీకరించలేదు. అయితే ఎలా జరిగినా నౌకకు నష్టం వాటిల్లడం రష్యాకు ఎదురుదెబ్బని వ్యాఖ్యానించింది.
రెడ్‌క్రాస్ నగదు సాయం
ఉక్రెయిన్‌లోని 20 లక్షల మంది ప్రజలకు సాయం చేసేందుకు అతిపెద్ద క్యాష్ అసిస్టెంట్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తామని రెడ్‌క్రాస్ తెలిపింది. రష్యా యుద్ధంతో ప్రభావితమైనవారికి దాదాపు 10.6 కోట్ల డాలర్లను పంచుతామని సంస్థ ప్రతినిధి నికోల్ చెప్పారు. ఇప్పటికే దాదాపు 10 లక్షలమందికి దుప్పట్లు, ఇతర సామగ్రిని అందించామని చెప్పారు. తాజా నగదు సాయంతో స్థానిక ఎకానమీలో ద్రవ్య లభ్యత పెరుగుతుందన్నారు.
పాశ్చాత్యదేశాలు తమనుంచి గ్యాస్ దిగుమతులు నిలిపివేస్తే అది ఆ దేశాలపై నెగెటివ్ ప్రభావం చూపుతుందని రష్యా అధిపతి పుతిన్ హెచ్చరించారు. ఇతర ప్రాంతాల నుంచి చేసుకునే దిగుమతులు యూరప్ దేశాల ఎకానమీలను దెబ్బతీస్తాయన్నారు. పలువురు రష్యా ధనవంతులకు చెందిన 33 ఆస్తులను స్తంభింపజేసినట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. దీంతో ఇంతవరకు ఫ్రాన్స్ స్తంభింపజేసిన రష్యా కుబేరుల ఆస్తుల విలువ 2400 కోట్ల యూరోలకు చేరింది. ఉక్రెయిన్‌లో ఐర్లాండ్ రక్షణ, విదేశాంగ మంత్రి సైమన్ పర్యటించారు. ఉక్రెయిన్‌కు దాదాపు 5.8 కోట్ల డాలర్ల సాయం అందిస్తున్నట్లు చెప్పారు. అమెరికా తాజాగా ప్రకటించిన 80 కోట్ల డాలర్ల సాయానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలిపారు.
ఎందుకింత ప్రత్యేకం?
మాస్కోవా నౌక యుద్ధం ఆరంభమైన తొలిరోజుల్లో ఉక్రెయిన్ సైనికులున్న స్నేక్ ఐలాండ్‌ను చుట్టు ముట్టింది. దీవిలోని సైనికులను లొంగిపోవాలని హెచ్చరించింది. అయితే ఉక్రెయిన్ సైనికులు మాత్రం ‘‘రష్యా యుద్ధ నౌకా! నిన్ను నువ్వే పేల్చుకో’’ అని ఎదురుతిరిగారని ఆ దేశం పేర్కొంది. దీనికి సంబంధించిన నిజానిజాలు తెలియరాలేదు. కానీ ఈ ఘటనను ఉక్రెయిన్ దేశస్థులు గర్వంగా చెప్పుకుంటారు. తాజాగా ఘటనను గుర్తు చేసుకుంటూ ఒక పోస్టల్‌స్టాంపును కూడా ఉక్రెయిన్ విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment