![Sinkhole Outside Italy Hospital Swallows Several Cars - Sakshi](/styles/webp/s3/article_images/2021/01/8/italy.jpg.webp?itok=Iy-SAXec)
రోమ్: ఇటలీ నేపుల్స్‌లోని ఓ ఆస్పత్రి ప్రాంగణంలో వింత సంఘటన చోటు చేసుకుంది. అప్పటివరకు అంతా బాగానే ఉన్న ఆ ఏరియాలో ఉన్నట్లుండి కార్లన్ని భూమిలోకి వెళ్లిపోయాయి. దాంతో కంగారు పడిన జనాలు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన వల్ల కరెంట్ కట్ అయ్యింది. దాంతో ఆస్పత్రి సిబ్బంది హుటాహుటిని పేషంట్లను బయటకు తరలించారు. ఇక ఈ ఘటనలో ఎవరు గాయపడలేదని సమాచారం. ఈ సంఘటన గురించి తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ‘ఓస్పడేల్ డెల్ మేరే కార్ పార్కింగ్ ప్రాంతంలో సింగ్ హోల్ ఏర్పడింది. ఫలితంగా ఇక్కడ పార్క్ చేసిన కార్లు లోపలికి పడిపోయాయి.
"హైడ్రో-జియోలాజికల్ సమస్య" వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది’ అని ఇటలీ అగ్నిమాపక శాఖ ట్విట్టర్‌లో పేర్కొంది. ఇక నేపుల్స్ ఆస్పత్రి ఉన్న కాంపానియా ప్రాంత అధిపతి విన్సెంజో డి లూకా మాట్లాడుతూ.. "అదృష్టవశాత్తూ ఈ ఘటన సిస్టమ్స్ ఇంజనీరింగ్ పరంగా.. ముఖ్యంగా మానవ జీవితాల పరంగా ఎటువంటి నష్టం కలిగించలేదు" అని తెలిపారు. ఇక ఈ ఆస్పత్రి కరోనా వైరస్ పేషెంట్ల చికిత్సకు ప్రధాన కేంద్రంగా కొనసాగుతుంది. మొదటి వేవ్ ప్రారంభం అయిన నాటి నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున కోవిడ్ పేషంట్లకు చికిత్స అందిస్తున్నారు. సింక్‌హోల్ ఘటన నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ వేటి నీరు, కరెంట్ కోత ఏర్పడింది. దాంతో కోవిడ్ వార్డును తాత్కలికంగా మూసి వేశారు.
(చదవండి: 2 వేల ఏళ్ల నాటి శవాలు: లావాలో..)
Comments
Please login to add a commentAdd a comment