బ్యాంకాక్: ప్రెస్ మీట్ పెట్టేది ఎందుకు.. ప్రభుత్వ విధానాల గురించి ప్రజలకు తెలపడం కోసం.. అలానే ప్రభుత్వ పని తీరుపై వచ్చిన ఆరోపణలను ప్రజల తరఫున ప్రశ్నించడానికి. అందుకే చాలా మంది నాయకులు ప్రెస్ మీట్స్ అంటే భయపడతారు. ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొవాల్సి వస్తుందో.. ఎక్కడ నోరు జారతామో అని ప్రెస్ మీట్లు పెట్టరు. ఒకవేళా పెట్టినా నచ్చని ప్రశ్నలు ఎదురైతే సమాధానం చెప్పకుండా దాట వేస్తారు.
అంతే తప్ప ప్రశ్నలు అడిగిన రిపోర్టర్ల మీద దాడి చేయడం అసంభవం. కానీ దీన్ని నిజం చేసి చూపారు థాయ్‌లాండ్ ప్రధాని. విలేకరుల తమ ప్రశ్నలతో విసిగిస్తున్నారని అసహనానికి గురైన థాయ్ పీఎం ఏకంగా వారిపై శానిటైజర్ స్ప్రే చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ఆ వివరాలు.. థాయ్‌లాండ్ ప్రధాన మంత్రి ప్రయూత్ చాన్-ఓచా మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో రిపోర్టర్లు తాజాగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న పలు అంశాల గురించి ప్రశ్నించారు. ముఖ్యంగా కొద్ది కాలం నుంచి పలువురు అధికారులు తమ క్యాబినేట్ పదవుల నుంచి వైదొలగారు. అలానే ఏడు సంవత్సరాల క్రితం జరిగిన నిరసనల్లో పాల్గొన్నందుకు ముగ్గురు మినిస్టర్లను వారం రోజుల క్రితమే జైలుకు పంపించారు. ఈ అంశాలన్నింటి గురించి విలేకరులు ప్రధాని ప్రయూత్‌ని ప్రశ్నించారు.
రిపోర్టర్ల ప్రశ్నలకు విసిగిపోయిన ప్రధాని ప్రయూత్.. ‘‘మీరు అడగవలసిన ప్రశ్నలు ఇంకా ఏమైనా మిగిలాయా.. ఇలాంటి విషయాలన్ని నాకు కనిపించడం లేదు ఎందుకో.. ఇవన్ని ముందుగా తెలియాల్సింది ప్రధానికే కదా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వత తన పొడియం వద్ద నుంచి బయటకు వచ్చేశారు. అలా వస్తూ.. పక్కనే ఉన్న శానిటైజర్ డబ్బాను చేతిలోకి తీసుకుని జర్నలిస్ట్‌ల దగ్గరకు వచ్చి.. వారందరి మీద శానిటైజర్ స్ప్రే చేస్తూ ముందుకు వెళ్లి పోయారు.
ఈ తతంగాన్నంత అక్కడ ఉన్న రిపోర్టర్లు వీడియో తీశారు. చివరకు ప్రయూత్ ఇదే రిపోర్టర్లతో చాలా ఆగ్రహంగా మాట్లాడటం వీడియోలో చూడవచ్చు. ఇక ప్రధాని చర్యలపై నెటిజనులు మండి పడుతున్నారు. ఇంత అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడటమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment