గోధుమల ఎగుమతులపై యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి దిగుమతి చేసుకున్న గోధుమలు, గోధుమ పిండిని ఇతర దేశాలకు ఎగుమతి చేయకుండా నాలుగు నెలల పాటు నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది.
అయితే, మే 14న భారత్ గోధుమ ఎగుమతులను నిషేధించడంతో యూఏఈ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఎగుమతులు, దిగుమతులపై ప్రభావాన్ని దృష్టిలో పెట్టకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరోవైపు, దేశీయ వినియోగం కోసం యూఏఈకి గోధుమలను ఎగుమతి చేయడానికి భారత్ ఆమోదించిందని పేర్కొంది. కాగా, ప్రపంచంలోనే గోధుమలను ఎక్కువగా పండించే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది.
ఇక, తమకు గోధుమలను సరఫరా చేయాలని ఇండోనేసియా, ఒమన్, యూఏఈ, బంగ్లాదేశ్, యెమన్ దేశాలు భారత్‌ను కోరాయి. దీంతో, యూఏఈ ప్రజల అవసరాలకు సరిపడా గోధుమలను పంపేందుకు భారత్ సుముఖత వ్యక్తం చేసింది. భారత్‌తో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేసిన నేపథ్యంలో.. తమ దేశం మీదుగా భారత గోధుమలు విదేశాలకు ఎగుమతి కాకుండా యూఏఈ ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే, మే 13కి ముందు యూఏఈకి తీసుకువచ్చిన భారతీయ గోధుమలను ఎగుమతి చేయాలనుకునే లేదా తిరిగి ఎగుమతి చేయాలనుకునే కంపెనీలు ముందుగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపింది. గోధుమల షిప్‌మెంట్, గోధుమలు ఏ దేశం నుంచి వచ్చాయి, చెల్లింపులు జరిపిన తేదీ తదితర డాక్యుమెంట్లను తనిఖీ కోసం సబ్‌మిట్ చేయాలని ఆదేశించింది. కాగా, భారత్ నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన గోధుమలు, గోధుమ పిండిని కంపెనీలు ఎగుమతి చేసుకోవచ్చని యూఏఈ స్పష్టం చేసింది. కానీ, ఇందు కోసం కూడా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని ఆ దేశ ఆర్థిక శాఖ ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment