కుక్క తోక వంకర.. అట్లాగే ఏ మాత్రం విశ్వాసంలేని డ్రాగన్ కంట్రీ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రపంచం ఏమైపోయినా ఫర్వాలేదనే అనుకోవడం సహజం. ఒకవైపు ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా బలగాలు మోహరించిన వేళ.. ప్రపంచమంతా శాంతిని కోరుకుంటే, చైనా మాత్రం తనకు బాగా అలవాటైన వక్రబుద్ధిని ప్రదర్శించింది.
నాటో కూటమిలో చేరొద్దంటూ రష్యా, ఉక్రెయిన్ ఆక్రమణకు తెగపడిన విషయం తెలిసిందే. వారం రోజులుగా ఈ పరిణామాలు ప్రపంచాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ తరుణంలో చైనా ఇరు దేశాల మధ్య దౌత్యానికి ముందుకు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తమది శాంతికాముక దేశమని, యుద్ధ ఉద్రిక్తతలను తగ్గించేందుకు, సయోధ్య కుదిర్చేందుకు తమవంతు కృషి చేస్తామని ప్రకటించుకుంది చైనా. కట్ చేస్తే.. రష్యాపై ఆంక్షలు ఏమాత్రం కరెక్ట్ కాదని తాజాగా ప్రకటన ఇచ్చింది. ఇంతలోనే ఉక్రెయిన్ ఆక్రమణ విషయంలో రష్యాకు చేసిన ఓ రిక్వెస్ట్ ఇప్పుడు బయటకు పొక్కడం సంచలనంగా మారింది.
చైనా రాజధాని బీజింగ్ వేదికగా 2022 వింటర్ ఒలింపిక్స్ జరిగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఈ ఈవెంట్స్ జరిగాయి. ఉయిగర్లపై హింసాకాండ, మానవ హక్కుల ఉల్లంఘన, ప్రపంచానికి కరోనా వైరస్‌ను అంటగట్టిందనే అపవాదు.. ఇలా రకరకాల కారణాలతో అగ్రరాజ్యం సహా చాలా దేశాలు ఈ ఈవెంట్లను బహిష్కరించాయి. అయినప్పటికీ అంతర్జాతీయ సమాజానికి దూరంగా వింటర్ ఒలింపిక్స్‌ను అత్యంత గోప్యంగా నిర్వహించుకుంది చైనా. ఈ తరుణంలో.. రష్యా గనుక ఉక్రెయిన్‌పై యుద్ధానికి తెగబడితే తమకు ఇబ్బంది కలుగుతుందని, కాబట్టి శీతాకాల ఒలింపిక్స్ ముగిసేవరకు ఓపిక పట్టాలని, ఆ తర్వాత ఉక్రెయిన్‌పై ఎలాంటి చర్యలకు దిగినా పర్వాలేదనే ప్రతిపాదనను మాస్కో(రష్యా రాజధాని) ముందు ఉంచిందట.
ఈ మేరకు చైనా సీనియర్ అధికారులు, మాస్కోతో పలుదఫాలుగా మంతనాలు చేపట్టగా.. వాళ్ల మధ్య సంభాషణలన్నీ రికార్డయ్యాయి. పాశ్చాత్య దేశాల ఇంటెలిజెన్స్ వ్యవస్థ నివేదికలు, పలు స్టింగ్ ఆపరేషన్‌ల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఇప్పుడు. అయితే చైనా విజ్ఞప్తికి రష్యా నుంచి ఎలాంటి స్పందన వచ్చిందనే విషయాన్ని మాత్రం ఆ నివేదికలు బయటపెట్టలేదు.
ఈ ఆరోపణలపై వెంటనే స్పందించేందుకు సీఐఏ, వైట్‌హౌజ్ జాతీయ భద్రతా మండలి నిరాకరించింది. అయితే ఉక్రెయిన్ సంక్షోభ విషయంలో రష్యా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. తమ స్వార్థం కోసం ఆక్రమణను వాయిదా వేయాలని కోరడం బయటకు పొక్కడంతో చైనాను ఛీ కొడుతున్నాయి పలు దేశాలు. న్యూయార్క్ టైమ్స్, రాయిటర్స్ ప్రచురించిన ఈ సంచలనాత్మక కథనాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. చూద్దాం.. ఈ కథనాలపై చైనాగానీ, రష్యాగానీ ఎలా స్పందిస్తాయో!.
చదవండి: రష్యాకు సపోర్ట్!! పరిణామాలు తీవ్రంగా ఉంటాయ్.. జాగ్రత్త!
Comments
Please login to add a commentAdd a comment