
జెనీవా: ఉక్రెయిన్ విషయంలో హెచ్చరికలు చేసుకుంటూ వచ్చిన అమెరికా, రష్యాలు తమ మాటల వేడిని తగ్గించుకున్నాయి. ఈ విషయంలో ఉద్రిక్తతలు చల్లార్చేందుకు యత్నించాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు సమస్యకు ఎలాంటి పరిష్కారాన్ని కనుగొనలేదని చెప్పాయి. మరోవైపు ఉక్రెయిన్‌ను రష్యా ఏ క్షణమైనా ఆక్రమించవచ్చన్న భయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందుకు తగ్గట్లే దాదాపు లక్ష రష్యా ట్రూపులు ఉక్రెయిన్ దగ్గరలో మకాం వేశాయి.
ఈ నేపథ్యంలో జెనీవాలో యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్లింకెన్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయ్ లావ్రోవ్‌లు సమావేశమయ్యారు. ఈ మీటింగ్‌లో ఎలాంటి తక్షణ పరిష్కారం తట్టలేదని, కానీ ఇరు పక్షాలు ఎదుటివారి అభిప్రాయాలు అర్ధం చేసుకొనేయత్నం చేశాయని బ్లింకెన్ చెప్పారు. ఉక్రయిన్‌ను ఆక్రమించే ఉద్దేశం లేదని లావ్రోవ్ మరోమారు చెప్పారని, కానీ తాము ఈ విషయాన్ని పూర్తిగా నమ్మడం లేదని తెలిపారు. చర్చలు నిర్మాణాత్మకంగా జరిగినట్లు లావ్రోవ్ తెలిపారు.
చదవండి: (యెమెన్ జైలుపై సౌదీ వైమానిక దాడి)
ఉక్రెయిన్, నాటోపై తాము అడిగిన డిమాండ్లకు వచ్చే వారం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చేందుకు అమెరికా అంగీకరించిందన్నారు. నాటోలో ఉక్రెయిన్‌ను ఎప్పటికీ చేర్చుకోమని హామీ ఇవ్వాల్సిందిగా రష్యా డిమాండ్ చేస్తోంది. అలాగే తూర్పు యూరప్‌లో పలుచోట్ల నాటో దళాలను ఉపసంహరించుకోవాలని కోరుతోంది. ఈ డిమాండ్లను ఇప్పటికే యూఎస్, నాటో తిరస్కరించాయి. ఇదే విషయమై అమెరికా నుంచి లిఖిత సమాధానం వచ్చాక తదుపరి చర్యలను నిర్ణయిస్తామని లావ్రోవ్ చెప్పారు.