మరో ఐదుగురు హమాస్ నేతలపైనా
అక్టోబర్ 7 దాడికి కారకులంటూ అభియోగాలు
వాషింగ్టన్: ఇజ్రాయెల్‌లో అక్టోబర్ 7న జరిగిన నరమేధానికి సంబంధించి హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్‌తో పాటు ఆ ఉగ్రవాద సంస్థకు చెందిన మరో ఐదుగురు అగ్ర నేతలపై అమెరికాలో కేసు నమోదైంది. దాడికి ప్రణాళిక, మద్దతు, నిర్వహణ వెనక ఉన్నది వీరేరంటూ మంగళవారం క్రిమినల్ అభియోగాలు నమోదయ్యాయి. ఈ జాబితాలో హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనయా, మిలటరీ వింగ్ చీఫ్ మహ్మద్ దెయిఫ్, డిప్యూటీ మిలిటరీ కమాండర్ మార్వాన్ ఇస్సా, ఖలీద్ మెషాల్, అలీ బరాకా ఉన్నారు. వీరిలో హనయా, దెయిఫ్, ఇస్సా ఇప్పటికే ఇజ్రాయెల్ హతమార్చింది. ఖలీద్ మెషాల్ దోహాలో ఉంటూ గ్రూప్ డయాస్పోరాకు నాయకత్వం వహిస్తుండగా అలీ బరాకా లెబనాన్‌కు చెందిన సీనియర్ హమాస్ అధికారి.
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఇజ్రాయెల్ బాంబు దాడిలో హనయా, గాజాపై జరిపిన వైమానిక దాడుల్లో మహ్మద్ దెయిఫ్, మరో దాడిలో ఇస్సా మరణించారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన పాశవిక మెరుపుదాడిలో 1,200 మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకోవడం తెలిసిందే. వారిలో 40 మందికి పైగా అమెరికన్లున్నారు. ‘‘ఇజ్రాయెల్‌ను నాశనం చేయడానికి, ఆ లక్ష్యసాధన కోసం ఆ దేశ పౌరులను చంపడానికి హమాస్ చేస్తున్న ప్రయత్నాలకు నిందితులంతా నాయకత్వం వహించారు. ఇరాన్ నుంచి అందుతున్న ఆర్థిక, సాయుధ, రాజకీయ దన్నుతో, హిజ్బొల్లా మద్దతుతో ఇందుకు తెగించారు’’అని అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్ ఒక ప్రకటనలో తెలిపారు.
చర్చలకు విఘాతం!
అమెరికా తాజా చర్య గాజాలో కాల్పుల విరమణ యత్నాలకు విఘాతంగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధానికి ముగింపు పలికేందుకు, ఖైదీల విడుదలకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్టు అమెరికా కొద్ది రోజులుగా ప్రకటనలు చేస్తుండటం తెలిసిందే. ఇలాంటి సమయంలో హమాస్ అగ్ర నేతలపై అమెరికా కేసులు పెట్టడం కాల్పుల విరమణ చర్చలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశీలకులు అంటున్నారు. ‘‘గాజాలో ఇజ్రాయెల్ దాడులకు అమెరికా పూర్తి మద్దతిస్తోంది. తాజా అభియోగాల ద్వారా హమాస్‌నే వేలెత్తి చూపుతోంది. కానీ వేలమందిని పొట్టన పెట్టుకుంటున్న ఇజ్రాయెల్‌ను మాత్రం కనీసం తప్పుపబట్టడం లేదు. అమెరికావి ద్వంద్వ ప్రమాణాలని మరోసారి రుజువైంది’’ అని బీరుట్‌లోని అమెరికన్ యూనివర్సిటీ ఫెలో రామి ఖౌరీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment