ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. అమెరికా, యూరప్, ఆఫ్రికా దేశాల్లో లెక్క నానాటికీ పెరిగిపోతోంది. తాజాగా ఒక్క అమెరికాలోనే అదీ ఒక్కరోజులో ఐదు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం, అందులో సగం కంటే ఎక్కువ ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది.
జాన్స్ హోప్‌కిన్స్ యూనివర్సిటీ అందించిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో అమెరికాలో 5, 12, 000 కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో సగం కంటే ఎక్కువ ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు కావడం విశేషం. అమెరికాలో ప్యాండెమిక్ విజృంభణ మొదలయ్యాక నమోదు అయిన కేసుల సంఖ్య ఇదే హయ్యెస్ట్. మొత్తంగా ఇప్పటివరకు 54 మిలియన్ల కేసులు ఇప్పటిదాకా నమోదు అయ్యాయి.
ఇంతకు ముందు కరోనా హయ్యెస్ట్ కేసుల సంఖ్య 2, 94, 015గా(ఈ ఏడాది జనవరి 8న) నమోదు అయ్యింది. డిజీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) సమాచారం ప్రకారం.. ప్రస్తుతం నమోదు అవుతున్న కేసుల్లో 58 శాతం(దాదాపు సగం కంటే ఎక్కువ) ఒమిక్రాన్ కేసులే ఉన్నట్లు చెబుతోంది. ఒమిక్రాన్ కంటే ముందు డెల్టా వేరియెంట్ మూలంగానే అమెరికాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు ప్రస్తుతం నమోదు అవుతున్న కరోనా కేసుల్లో 41 శాతం డెల్టా వేరియెంట్ కేసులేనని సీడీసీ చెబుతోంది.
కొవిడ్-19 కారణంగా గడిచిన ఒక్కరోజులో 1,762 మంది పేషెంట్లు చనిపోయారు. మొత్తంగా మృతుల సంఖ్య 8,42,000 చేరింది. ప్రస్తుతం అమెరికాలో కోటి పంతొమ్మిది లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. నాలుగు కోట్ల 32 లక్షల మందికిపైగా కోలుకున్నారు.
భారత్‌లోనూ ఇదే పరిస్థితి?
ఓవైపు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండడం, మరోవైపు ఒమిక్రాన్ వేరియెంట్ బాధితుల సంఖ్యా పెరిగిపోతుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ తరుణంలో కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధకుల బృందం భారత్‌కు హెచ్చరిక జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే.. ఎక్కువ జనాభా ఉన్న భారత్‌లో ఒమిక్రాన్ విజృంభణ ఒక్కసారిగా పెరిగిపోవచ్చని చెప్తున్నారు ప్రొఫెసర్ పాల్ కట్టూమన్. ‘‘రాబోయే కొద్దిరోజుల్లో భారత్ కీలక దశలోకి ప్రవేశించనుంది. కొన్ని వారాల్లో కొత్త ఇన్‌ఫెక్షన్ కేసులు తారాస్థాయికి చేరుకుంటాయి. కారణం.. ఒమిక్రాన్ వేరియెంట్ వేగం ఎక్కువగా ఉండడం. బహుశా అది ఈ వారం పదిరోజుల నుంచే జరగొచ్చు కూడా. అయితే అమెరికా స్థాయిలో ఉంటుందా? లేదా? అనేది రెండు వారాల్లో తెలిసిపోతుంది. బూస్టర్ డోసులతో కట్టడికి ప్రయత్నించినా.. ఇన్‌ఫెక్షన్‌లను అడ్డుకోవడం కష్టమే. జాగ్రత్తలు పాటించడం ద్వారా పరిస్థితి చేజారకుండా కాపాడుకోవచ్చు’ అంటూ వ్యాఖ్యానించారు ఆయన. భారత్‌లో కొవిడ్ ట్రాకర్‌ను రూపొందించిన పరిశోధకుల్లో కట్టూమన్ కూడా ఉన్నారు. డిసెంబర్ 24 దాకా ఆరు రాష్ట్రాల్లో తీవ్రతను గుర్తించిన కొవిడ్ ట్రాకర్.. 26వ తేదీ నాటికి ఆ సంఖ్యను 11 రాష్ట్రాలకు చేర్చడం పరిస్థితికి అద్దం పడుతోంది.
ఆ రెండు నగరాల్లో దీనస్థితి
కాలిఫోర్నియా, న్యూయార్క్ నగరాల్లో కరోనా విజృంభణ తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. మంగళవారం ఒక్క కాలిఫోర్నియాలోనే 50 లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. గోల్డెన్ స్టేట్‌లో 86 వేలమందికి పాజిటివ్ నిర్దారణ అయ్యింది. దీంతో సీడీసీ కాలిఫోర్నియాను ‘హై ట్రాన్స్‌మిషన్’ జోన్‌గా ప్రకటించింది.
మరోవైపు న్యూయార్క్ నగరంలో చిన్నపిల్లలు వైరస్ బారినపడుతుండడంతో దయనీయమైన పరిస్థితి కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఒమిక్రాన్ తీవ్రత మరింత ఉదృతంగా ఉండొచ్చని సీడీసీ డైరెక్టర్ రోచెల్లె వాలెన్‌స్కై అంచనా వేస్తున్నారు. డెల్టా వేరియెంట్ బారినపడ్డ పేషెంట్లకు చికిత్స భయంభయంగానే నడుస్తోంది. అయితే ఒమిక్రాన్ తీవ్రత తక్కువగా ఉండడంతో సాధారణ చికిత్సకే పరిమితం అవుతున్నారు వైద్యులు. మరోవైపు ఐసోలేషన్ సమయాన్ని పది నుంచి ఐదు రోజులకు కుదించింది అమెరికా ప్రభుత్వం.
చదవండి: ఒక్కసారిగా పెరిగిన కోవిడ్ కేసులు.. 44 శాతం అధికంగా.. 781కి చేరిన ఒమిక్రాన్ కేసులు
Comments
Please login to add a commentAdd a comment