USA presidential election 2024: తొలి ప్రైమరీలో ట్రంప్‌దే గెలుపు | USA Presidential Election 2024 Updates: Donald Trump Dominates With Republicans, See Details Inside - Sakshi
Sakshi News home page

USA presidential election 2024: తొలి ప్రైమరీలో ట్రంప్‌దే గెలుపు

Published Wed, Jan 17 2024 4:40 AM | Last Updated on Wed, Jan 17 2024 9:56 AM

USA presidential election 2024: Donald Trump dominates with Republicans - Sakshi

అయోవాలో జరిగిన ­విజయోత్సవ కార్యక్రమంలో ట్రంప్‌ అభివాదం

వాషింగ్టన్‌: అమెరికా పార్లమెంట్‌పై దాడికి ఉసిగొల్పాడన్న ఆరోపణలు, నీలిచిత్రాల తారతో అనైతిక ఆర్థిక లావాదేవీ, పదుల కొద్దీ కేసుల ఉదంతాలు వెలుగుచూసినా.. రిపబ్లికన్‌ పార్టీలో మెజారిటీ కార్యకర్తలు ఇంకా డొనాల్డ్‌ ట్రంప్‌ వెంటే ఉన్నారని రుజువైంది. రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం అయోవా రాష్ట్రంలో జరిపిన ప్రైమరీ ఎన్నికల్లో తోటి అభ్యర్థులందరినీ వెనక్కి నెట్టి మాజీ దేశాధ్యక్షుడు ట్రంప్‌ అత్యధిక ఓట్లను కైవసం చేసుకుని ఘన విజయం సాధించారు.

దీంతో రాష్ట్రాలవారీగా జరిగే ఈ ఎన్నికల్లో తొలి రాష్ట్రంలోనే ట్రంప్‌ బోణీ కొట్టడం రాజకీయ విశ్లేషకులనూ ఆశ్చర్యానికి గురిచేసింది. సోమవారం రాత్రి జరిగిన ఈ ఎన్నికల్లో ట్రంప్‌కు 51 శాతం ఓట్లు ఒడిసిపట్టారు. గట్టి పోటీదారుగా అందరూ భావించిన ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డీశాంటిస్‌కు 21.2 శాతం ఓట్లు పడ్డాయి. ఐక్యరాజ్యసమితి మాజీ రాయబారి, సౌత్‌ కరోలీనా మాజీ మహిళా గవర్నర్‌ నిక్కీ హేలీకి 19.1 శాతం ఓట్లు వచ్చాయి.

భారతీయ మూలాలున్న అమెరికన్‌ వ్యాపారవేత్త, సంపన్నుడు వివేక్‌ రామస్వామి ఈ రేసులో ప్రభావం చూపలేకపోయారు. ఆయనకు కేవలం 7.7 శాతం ఓట్లు పడ్డాయి. సగానికిపైగా ఓట్లు సాధించి నిర్ణయాత్మక రాష్ట్రంలో గెలుపు ద్వారా అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రధాన అభ్యర్థి తానేనని ట్రంప్‌ మరోసారి ప్రకటించుకున్నారు.

అయోవా రాష్ట్ర చరిత్రలో ఒక అభ్యర్థి ఇంతటి భారీ మెజారిటీతో గెలవడం ఇదే తొలిసారి. ఓట్ల పరంగా చూస్తే మరో అభ్యర్థి అసా హుచిన్‌సన్‌కు కేవలం 191 ఓట్లు, ఇంకో అభ్యర్థి క్రిస్‌ క్రిస్టీకి 35 ఓట్లు పడ్డాయి. అత్యల్ప ఓట్లు సాధించడంతో తాను ఈ పోటీ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు అర్‌కన్సాస్‌ మాజీ గవర్నర్‌ అసా హుచిన్‌సన్‌ ప్రకటించారు. ఈసారి మొత్తంగా 1,10,000 మంది ఓట్లు వేశారు. ఈ రాష్ట్రంలో ఇంత తక్కువగా ఓటింగ్‌ జరగడం గత 20 ఏళ్లలో ఇదే తొలిసారి.

ఇక ట్రంప్‌కే నా మద్దతు: వివేక్‌ రామస్వామి
అయోవా ప్రైమరీ ఎన్నికల్లో తక్కువ ఓట్లలో నాలుగో స్థానానికి పరిమితమైన భారతీయవ్యాపారి వివేక్‌ రామస్వామి ఇక ఈ రేసు నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ‘‘ ఈ రాష్ట్ర ప్రైమరీలో ఆశ్చర్యకర ఫలితాలను ఆశించి భంగపడ్డా. ఇక ప్రచారానికి స్వస్తి పలుకుతున్నా. అధ్యక్షుడినయ్యే మార్గమే లేదు. ఇక నా మద్దతు ట్రంప్‌కే’’ అని తన మద్దతుదారుల సమక్షంలో వివేక్‌ మాట్లాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement