వాషింగ్టన్: చైనాలోని వూహాన్ పరిశోధనశాలలో కరోనా వైరస్‌ను కృత్రిమంగా అభివృద్ధిచేశారు అనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయంటూ అమెరికాలోని రిపబ్లికన్లు ఓ నివేదిక విడుదల చేశారు. ‘జీఓపీ పరిశోధన’ పేరుతో ప్రచురితమైన ఈ నివేదిక తాజా సంచలనంగా మారింది. వూహాన్ పరిశోధనశాల నుంచి వైరస్ లీక్ కాలేదని, సముద్ర ఉత్పత్తుల మార్కెట్ ద్వారా ప్రపంచానికి వ్యాపించిందని చైనా మొదటి నుంచి వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పరిశీలించేందుకు అప్పట్లో వూహాన్ వెళ్లిన ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు దాదాపు అలాంటి సమాధానాన్నే ఇచ్చారు. అయితే వూహాన్ ల్యాబ్ నుంచే వైరస్ జెనెటిక్‌గా తయారై బయటకు వచ్చిందని రిపబ్లికన్లు చేస్తున్న వాదనలు అధ్యక్షుడు బైడెన్ మీద ఒత్తిడి పెంచుతున్నట్లే కనిపిస్తున్నాయి.
బైడెన్ ఆదేశాలు.. కొరవడిన స్పష్టత..
వూహాన్ ల్యాబ్ నుంచి వైరస్ పుట్టిందా లేదా అన్న విషయంపై సమాచారాన్ని సేకరించాలంటూ బైడెన్ నిఘా సంస్థలకు 90 రోజుల గడువిచ్చారు. ఈ సంస్థలు దీనిపై ఓ స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ నేత మైకేల్ మెక్‌కాల్ మాట్లాడుతూ.. వైరస్‌ను మనుషులకు సోకేలా మార్పులు చేసి, ఆ విషయాన్ని చైనా దాచిందని, దీనిపై ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. వైరస్ లీక్ కాకుండా అడ్డుకోవడంలో చైనా విఫలమైందన్నారు. తమ వద్ద ఉన్న ఆధారాల ప్రకారం 2019 సెప్టెంబర్ 12 కంటే ముందే కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచి బయటకు వ్యాపించిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment