
జెనివా: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) 73వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ వర్చువల్ సెషన్‌లో భాగంగా మూడు ముఖ్యమైన విషయాలను వెల్లడించింది. సైన్స్, సొల్యూషన్స్, సోలిడారిటీ అనే మూడు ఆయుధాలతో కరోనాను ఓడించగలమని తెలిపారు. ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్‌ఓ ‘కరోనా అనేది ప్రపంచ సంక్షోభం అయినప్పటికీ, అనేక దేశాలు, నగరాలు సమగ్రమైన, సాక్ష్య-ఆధారిత విధానాలతో వైరస్ ప్రసారాన్ని విజయవంతంగా నిరోధించాయి, నియంత్రించాయి. ఇక కోవిడ్ విజృంభణ వల్లే మొదటి సారి ప్రపంచం అన్ని దేశాలకు అవసరమైన వ్యాక్సిన్స్, డయాగ్నస్టిక్స్, చికిత్సా విధానాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి.. సమాన ప్రాతిపదికన వాటిని అన్ని దేశాలకు అందుబాటులో ఉండేలా చూడడానికి ఒక ప్రణాళికతో ముందుకు కదిలింది. యాక్సెస్ టూ కోవిడ్ -19 టూల్స్ (ఏసీటీ) యాక్సిలరేటర్ నిజమైన ఫలితాలను అందిస్తోంది ”అని తెలిపింది.
అంతేకాక ప్రపంచం మరో మహమ్మారిని ఎదుర్కొవడానికి సిద్దంగా ఉండాలని డబ్ల్యూహెహ్ఓ పిలుపునిచ్చింది. ఈ విషయంలో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ కోవిడ్-19 వంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల (2005)కు అనుకూలంగా ఓ బలమైన ముసాయిదా తీర్మానాన్ని పరిశీలిస్తుంది అని తెలిపింది. "ఈ తీర్మానం కోవిడ్ -19 వంటి ఇతర ప్రమాదకరమైన అంటు వ్యాధుల కేసులను గుర్తించడానికి, ప్రతిస్పందించడానికి అన్ని దేశాలు మెరుగ్గా ఉన్నాయని నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది" అని వెల్లడించింది. క్లిష్టమైన ఆరోగ్య లక్ష్యాలపై దేశాలు వెనక్కి తగ్గకూడదని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది. "కోవిడ్ -19 మహమ్మారి వల్ల దేశాల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థిరత్వానికి ఆరోగ్యం అనేది ఎంతటి బలమైన పునాదో తెలిసివచ్చింది" అన్నది. అలానే ‘డబ్ల్యూహెచ్‌ఓ 'ట్రిపుల్ బిలియన్' లక్ష్యాలు ఎందుకు చాలా ముఖ్యమైనవి, దేశాలు వాటిని మరింత ధృనిశ్చయంతో, సహకారంతో ఎందుకు కొనసాగించాలి అనే విషయాలకు కరోనాతో సమాధానం లభించింది’ అని తెలిపింది. (చదవండి: తెలిసింది కొంతే.. తెలియనిది ఇంకెంతో!) ఓ
ఇక కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన నాటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా 47 మిలియన్లకు పైగా కోవిడ్ -19 కేసులు నమోదు కాగా.. 1.2 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయినట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. ఇక వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశంలో నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధుల పరిష్కారానికి గాను 10 సంవత్సరాల ప్రణాళిక గురించి చర్చించింది. అలాగే మెనింజైటిస్, మూర్ఛ, ఇతర నాడీ సంబంధిత రుగ్మతలు, తల్లి శిశువు, చిన్నపిల్లల పోషణ, డిజిటల్ ఆరోగ్యంతో పాటు 2010లో స్వీకరించిన డబ్ల్యూహెచ్‌ఓ గ్లోబల్ కోడ్ ప్రాక్టీస్ ఇంటర్నేషనల్ రిక్రూట్మెంట్ ఆఫ్ హెల్త్ పర్సనల్ గురించి కూడా చర్చించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.