సాధారణంగా రోబోలంటే ఎలా కనిపిస్తాయి? మర మనిషి అనే పేరుకు తగ్గట్లే గంభీరమైన ముఖం, కృత్రిమ నడకతో దర్శనమిస్తాయి. కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో ముందే సిద్ధం చేసిన మాడ్యూల్‌కు అనుగుణంగా పనిచేస్తాయి. కానీ ప్రపంచంలోకెల్లా తొలిసారి అత్యాధునిక హ్యూమనాయిడ్ రోబో ‘అమేకా’ రూపు దాల్చింది. సహజ స్పందనలతో అందరినీ కనువిందు చేసింది. అచ్చం మనిషి ముఖ కవళికలు, కదలికలు, హావభావాలు ప్రదర్శించగలగడం దీని ప్రత్యేకత! యూకేకు చెందిన ఇంజనీర్డ్ ఆర్ట్స్ అనే రోబోల తయారీ సంస్థ యూట్యూబ్ వేదికగా దీన్ని ఆవిష్కరించింది.
ఆ వీడియోలో అమేకా తనను తాను చూసుకొని తెగ మురిసిపోయింది! కనురెప్పలను పదేపదే ఆర్పడంతోపాటు తనకు అమర్చిన చేతులను అటూఇటూ కదిలిస్తూ ముఖానికి దగ్గరగా పెట్టుకొని చూసి సంభ్రమాశ్చర్యానికి లోనైంది!! తలను పక్కలకు కదిలిస్తూ నిజంగానే నోరెళ్లబెట్టింది!
నెటిజన్ల జేజేలు...
అమేకాను చూసిన నెటిజన్లంతా తెగ మెచ్చుకుంటున్నారు. అది ప్రదర్శించిన హావభావాలు అత్యంత సహజంగా ఉన్నాయని తెగ పొగిడేస్తున్నారు. ప్రత్యేకించి అమేకా కళ్లను కదిలించిన తీరు ముచ్చటగొలిపిందన్నారు. మామూలుగా రోబోల కళ్లు కాస్త భయంకరంగా కనిపిస్తాయని... కానీ అమేకా కళ్లు అచ్చం మనిషిని పోలినట్లు ఉన్నాయని పేర్కొన్నారు.
మరికొందరేమో అమేకా ముఖ కవళికలను ఈ స్థాయిలో మారుస్తుండటం చూసి తొలుత నమ్మలేదని... అదంతా కంప్యూటర్ గ్రాఫిక్స్‌గా భావించామని చెప్పుకొచ్చారు. ఇంకొందరేమో 2004లో వచ్చిన హాలీవుడ్ చిత్రం ‘ఐ రోబో’లో హావభావాలు ప్రదర్శించిన రోబోతో అమేకాను పోల్చారు.
భావి టెక్నాలజీ ఆవిష్కారానికి వేదిక...
ఈ రోబో ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నందున దీని తయారీకి ఎంత ఖర్చయిందో ఇంజనీర్డ్ ఆర్ట్స్ వెల్లడించలేదు. అయితే మనిషి తరహాలో దాన్ని నడిచేలా చేయడం సవాల్‌తో కూడుకున్నదని పేర్కొంది. భవిష్యత్ రోబో సాంకేతికతల అభివృద్ధికి వేదికగా అమేకాను రూపొందించినట్లు సంస్థ పేర్కొంది. 2005లో ఏర్పాటైన ఇంజనీర్డ్ ఆర్ట్స్... తమ తొలి మెకానికల్ రోబో ‘థెస్పియన్’ను రూపొందించింది. స్టేజీలపై నటించగలగడం, 30 భాషలు మాట్లాడగలగడం దాని ప్రత్యేకతలు.
గతంలో ‘సోఫీ’..
మనిషి తరహాలో ఒక రోబో ముఖ కవళికలు మార్చగలగడం ఇది తొలిసారి కాదు. 2016లోనే మానవ ముఖాకృతితోపాటు అత్యంత తెలివితేటలు ప్రదర్శించగల ‘సోఫీ’ అనే హ్యూమనాయిడ్ రోబోను హాంకాంగ్ సంస్థ హాన్సన్ రొబోటిక్స్ తయారు చేసింది. కనురెప్పలు వాల్చడం, పరికించి చూడటం, తలను పక్కకు తిప్పడంతోపాటు గలగలా మాట్లాడటం సోఫీ సొంతం! ప్రత్యేకించి తనతో మాట కలిపే మనుషులతో ఎంతసేపైనా ముచ్చట్లలో మునిగితేలడం, కొంటెగా నవ్వడం, జోకులు వేయడం కూడా చేసేది.
సోఫీ పనితీరుకు సౌదీ అరేబియా ప్రభుత్వం ఎంతగానో ముచ్చటపడింది. దానికి 2017లో చట్టబద్ధ పౌరసత్వం కల్పించడంతో ఈ తరహా ఘనతను సాధించిన రోబోగా సోఫీ చరిత్ర సృష్టించింది. సోఫీలో ఎన్నో సామర్థ్యాలు ఉన్నప్పటికీ దానికన్నా మరింత మెరుగ్గా అమేకా ఉంది.
– సాక్షి, సెంట్రల్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment