మనమంతా ప్రస్తుతం 2024 చివరి వారంలో ఉన్నాం. ఈ ఏడాది మనదేశంతో పాటు ప్రపంచంలో అనేక ముఖ్యమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా పేరొందిన భారత్‌లో ఎన్నికలు జరగగా, మరోవైపు ప్రపంచంలోని పలు దేశాల్లో యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. 2024లో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచిన 10 అంశాలను ఒకసారి గుర్తుచేసుకుందాం.
ఇజ్రాయెల్- ఇరాన్ పోరు
2024లో మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. సిరియాలోని డమాస్కస్‌లో దేశ కాన్సులేట్‌పై దాడికి ప్రతిగా ఇరాన్ ఏప్రిల్ 14న ఇజ్రాయెల్‌పై వందల కొద్దీ డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. అనంతరం అక్టోబర్ ఒకటిన ఇరాన్ మరోసారి ఇజ్రాయెల్‌పై 200కు పైగా క్షిపణులను ప్రయోగించింది. ఆ దరిమిలా ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. మరోవైపు హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా, హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతి చెందారు. హమాస్ తదుపరి అధినేత యాహ్యా సిన్వార్‌ను గాజాలో ఇజ్రాయెల్ మట్టుబెట్టింది.
భారత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ విజయం
భారతదేశంలో 2024 ఏప్రిల్, జూన్ 2024 మధ్య లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. 543 స్థానాలకు 7 దశల్లో జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4 న విడుదలయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమి 292 సీట్లు గెలుచుకుని, మెజారిటీ సాధించింది. అదే సమయంలో విపక్ష పార్టీల ఇండియా కూటమి 234 సీట్లు గెలుచుకుంది. ఇతర పార్టీలకు 17 సీట్లు వచ్చాయి. అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీల విషయానికొస్తే బీజేపీ 240, కాంగ్రెస్ 99, సమాజ్ వాదీ 37, తృణమూల్ కాంగ్రెస్ 29, డీఎంకే 22, టీడీపీ 16, జేడీయూ 12 సీట్లు గెలుచుకున్నాయి. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
క్షీణించిన భారత్- కెనడా సంబంధాలు
2024 అక్టోబరు మధ్య కాలంలో భారత్- కెనడా మధ్య దౌత్యపరమైన వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇది ఇరు దేశాల మధ్య వాణిజ్యంతో సహా అనేక రంగాలపై కొంతమేరకు ప్రభావం చూపింది. ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను భారత్ బహిష్కరించింది. కెనడా నుండి భారత హైకమిషనర్, ఇతర దౌత్యవేత్తలను వెనక్కి పిలిచింది.
ఎమర్జెన్సీ రోజులకు 50 ఏళ్లు
2024, జూన్ 25 నాటికి భారతదేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయ్యింది. ఈ అంశంపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. దేశంలో ఎమర్జెన్సీ కాలం 1975 నుండి 1977 వరకు కొనసాగింది. ఈ సమయంలో దేశంలో పౌర హక్కులు నిలిపివేశారు. పత్రికా స్వేచ్ఛను పరిమితం చేశారు. సామూహిక అరెస్టులు జరిగాయి. ఎన్నికలను వాయిదా వేశారు. ఎమర్జెన్సీ విధించేందుకు నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగంలోని ప్రత్యేక నిబంధనలను చూపించింది.
వయనాడ్‌లో విలయం
2024, జూలైలో కేరళలోని వయనాడ్‌లో భారీ కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మేప్పాడి, ముండక్కై తదితర ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
ఆర్‌జీ కార్ హత్యాచార ఘటన
2024 ఆగస్టులో కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ ఆస్పత్రి ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి, హత్య చేసిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆస్పత్రిలోని సెమినార్ హాల్‌లో జూనియర్ డాక్టర్ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన దరిమిలా కోల్‌కతాతో సహా దేశంలోని వివిధ ప్రాంతాలలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ ఘటన అనతరం మహిళలపై లైంగిక వేధింపుల అంశం మరోసారి చర్చకు వచ్చింది.
బంగ్లాదేశ్‌లో కుప్పకూలిన షేక్ హసీనా ప్రభుత్వం
2024 ఆగష్టులో బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరతకు లోనయ్యింది. పలు హింసాత్మక నిరసనల దరిమిలా బంగ్లాదేశ్‌లోని షేక్ హసీనా ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయింది. అనంతరం షేక్ హసీనా బంగ్లాదేశ్ వదిలి భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో హిందువులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి ముహమ్మద్ యూనస్ సారధ్యం వహిస్తున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం
2024, నవంబర్ 5న అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చరిత్రాత్మక విజయం సాధించారు. డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌పై ఆయన భారీ మెజార్టీతో గెలుపొందారు. ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు 312 ఎలక్టోరల్ ఓట్లు రాగా, కమలా హారిస్‌కు 226 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. సెనేట్‌లో కూడా రిపబ్లికన్ పార్టీ మెజారిటీ సాధించింది.
సిరియాలో తిరుగుబాటు
సిరియాలో చాలాకాలంగా మౌనంగా ఉన్న రెబల్ గ్రూపులు బలాన్ని కూడగట్టుకుని సిరియాలో అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. ఫలితంగా 2000 నుంచి సిరియాను పాలిస్తున్న బషర్ అల్ అసద్ అధికారానికి తెరపడింది. అసద్ సిరియా వదిలి రష్యాలో ఆశ్రయం పొందారు. తిరుగుబాటు గ్రూపు హయత్ తహ్రీర్ అల్-షామ్ సిరియా పరిపాలనను చేపట్టింది.
ఇది కూడా చదవండి: Year Ender 2024: 999 బెదిరింపులు.. రెండు కంపెనీల మూసివేత.. ఎయిర్‌లైన్స్ పరిణామాలు
Comments
Please login to add a commentAdd a comment