
నది మీద నడక
నీరు ధారగా జాలువారితే అది జలపాతం. నీటి బిందువు మంచుధారగా మారిపోతే... అది మంచుపాతం. బిరబిర ప్రవహించాల్సిన నది ఘనీభవిస్తే... అది కదలని నది. జన్‌స్కార్ నది... నెరాక్ జలపాతం పర్యటన ఇది. మనుషులున్న ఈ ఫొటోను బాగా గమనించండి. ఇందులోని పర్యాటకులు నడుస్తున్నది నేల మీద కాదు... గడ్డకట్టిన నది మీద. ఇక్కడ నిలబడి తలెత్తి ఆకాశంలోకి చూస్తే నీలాకాశంలో తెల్లటి మబ్బులు మెల్లగా కదిలిపోతుంటాయి. తాము ఉన్న చోటనే ఉండిపోతే సూర్యుడు ఉదయించడం మానేస్తాడేమో, తాము కదలకపోతే ఈ భూభ్రమణం ఆగిపోతుందేమో అన్నట్లు... నిబద్ధతతో కదిలిపోతుంటాయి. కిందకు చూస్తే నిత్యచైతన్యంలా కదులుతూ ఉండాల్సిన నది తీరం గడ్డకట్టి ఉంటుంది.
మధ్యలో మాత్రం నీలాకాశం రంగులో నది నీరు పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుంటుంది. ఇక్కడి ఉష్ణోగ్రతలు మైనస్ 30 నుంచి 35 ఉంటాయి. వాతావరణంలో చల్లదనం, ప్రవాహ వేగంతో పుట్టే వేడి మధ్య నిత్యం ఘర్షణ తప్పదు. శీతాకాలంలో చల్లదనానిదే పై చేయి అవుతుంది. గడ్డకట్టిపోక తప్పని నీరు మంచుగా మారి... ప్రవహిస్తున్న నీటి మీద తేలుతూ... మజ్జిగ చిలికినప్పుడు పైకి తేలుతున్న వెన్నను తలపిస్తుంది. మొత్తానికి జన్‌స్కార్ నది అంటార్కిటికా ఖండానికి మీనియేచర్ రూపంలా ఉంటుంది. రాతి పలకను తలపించే ఆ మంచు పలకల మీద నడుస్తూ వెళ్తుంటే... ఏ క్షణాన ఆ మంచు విరిగి నీటిలోకి జారిపోతుందేమోనని భయం కూడా కలుగుతుంది. జన్‌స్కార్ నది స్వరూపం శ్రీనగర్ దాల్ సరస్సు పొడవుగా సాగినట్లు కూడా ఉంటుంది.
నెరాక్ దిశగా నడక
జన్‌స్కార్ నది మీద నుంచి సాగే ట్రెకింగ్‌ను చదర్ ట్రెక్ అంటారు. ఇందులో తొలి క్యాంప్ 10 వేల, నాలుగు వందల అడుగుల ఎత్తులో తిలాడ్ సుమ్‌దో ప్రదేశం, ఇక రెండో క్యాంప్ 11,150 అడుగుల ఎత్తులో ఉన్న నెరాక్ జలపాతం. ఇది ఇక్కడ కనిపించే మరో అద్భుతం. అద్భుతాలకు పరాకాష్ట. ఇప్పటి వరకు చూసిన అద్భుతాలకు కీర్తికిరీటం. కిందకు జాలువారుతున్న జలపాతం ప్రవాహంలోనే యథాతథ స్థితిలో నీరు మంచుగా మారిపోయిన దృశ్యం. ఈ జలపాతం పేరు నెరాక్. ఈ ప్రదేశానికి కూడా ఇదే పేరు ఖాయమైపోయింది. ఇంతకీ ఈ ప్రదేశం ఎక్కడుందో తెలుసా? కశ్మీర్, లధాక్‌లో ఉంది. జన్‌స్కార్ నది సింధు నదికి ఉపనది. ప్రవాహ తీరం వెంబడి ముందుకు వెళ్తే ఈ నీటికి మూలమైన జలపాతం దగ్గరకు చేరుతామన్నమాట. గడ్డకట్టిన జలపాతాన్ని చూడాలంటే జనవరి, ఫిబ్రవరి నెలల్లో వెళ్లాలి. మంచు కరిగి నెమ్మదిగా జాలువారుతున్న నీటి ధారలను చూడాలంటే ఎండాకాలం వెళ్లాలి.