అక్రమ నిర్మాణాలు కూల్చివేత
గొల్లపల్లి: మండలకేంద్రంలోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా చేపట్టిన ఇళ్లు, షెడ్లు, ప్రహరీలను అధికారులు జేసీబీతో కూల్చివేయించారు. రెవెన్యూ, పంచాయతీ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు ప్రారంభించారు. ఈ ఘటనతో అక్రమ నిర్మాణదారుల్లో ఆందోళన నెలకొనగా.. వారిని ప్రోత్సహించి సొమ్ము చేసుకున్న నాయకులు, దళారుల గుండెల్లో గుబులు పుట్టినట్లయ్యింది. మండల కేంద్రంలో అక్రమంగా నిర్మాణాలు చోటుచేసుకోవడంతో గత నెల 30న‘ప్రభుత్వ భూముల కబ్జా’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనికి స్పందించిన స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అక్రమ ఇళ్ల నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో రెవెన్యూ, పంచాయతీ అధికారులు అక్రమ నిర్మాణదారులకు నోటీసులు జారీ చేశారు. తహసీల్దార్ వరందన్ ఉన్నతాధికారులకు నివేదించారు. ప్రభుత్వస్థలంలో ఇళ్లు నిర్మించుకున్న వారు ఆధారాలు చూపించకపోవడంతో కలెక్టర్ సత్యప్రసాద్ సదరు స్థలాలను శుక్రవారం సందర్శించారు. 735తోపాటు 544 సర్వే నంబర్లలోగల గుట్ట వెనుకాల నిర్మించిన ఇళ్లను పరిశీలించారు. అక్రమ కట్టడాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. దీంతో శనివారం మధ్యాహ్నం రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది పోలీస్ బందోబస్తు మధ్య జేసీబీలతో కూల్చివేయించారు.
కూల్చివేతలు ఆపండి..
అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్న వారు కూల్చివేతలు ఆపాలని వేడుకున్నారు. అయితే ఆధారాలు చూపెట్టాలని అధికారులు కోరగా.. వారి నుంచి సమాధానం లేకపోవడంతో కూల్చివేతలు కొనసాగించారు. ఓ కుటుంబం ఇంట్లో సామగ్రి తీస్తామని, కొంత సమయం ఇవ్వాలని అడిగి ఇంట్లో నుంచి బయటకు రాలేదు. కాసేపు ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి ఇంటిని కూల్చివేయించారు.
‘సాక్షి’ కథనంతో వెలుగులోకి..
నాలుగు నెలలుగా మండలకేంద్రంలోని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ విషయమై స్థానికులు పలుసార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమైనా స్థానిక నాయకుల నుంచి ఒత్తిడి రావడంతో వెనుకడుగు వేశారు. ఈ క్రమంలో జనవరి 30న ‘దర్జాగా ప్రభుత్వ భూముల కబ్జా’ శీర్షికన సాక్షిలో కథనం రావడంతో స్పందించిన అధికార యంత్రాంగం ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసి.. కలెక్టర్ ఆదేశాలతో కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు.
పోలీస్ బందోబస్త్ మధ్య కదిలిన అధికార యంత్రాంగం
బాధితుల్లో ఆందోళన.. దళారుల గుండెల్లో గుబులు
‘సాక్షి’ కథనానికి స్పందన
బాధితుల్లో అయోమయం
ప్రభుత్వస్థలంలో అక్రమంగా ఇళ్లు నిర్మించుకోగా.. ప్రస్తుతం కూల్చివేయడంతో బాధితుల పరిస్థితి అయోమయంగా మారింది. దళారుల మాటలు నమ్మి నట్టేట మునిగి ఇప్పుడు రోడ్డున పడ్డారని స్థానికులు చర్చించుకుంటున్నారు. అయితే బాధితులను నమ్మించి మోసం చేసి సొమ్ము చేసుకున్న దళారులపైనా ఇదే రీతిలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇళ్లు నిర్మించుకున్నవారిలో పేదలు, స్థానికేతరులు ఉన్నారని, వీరిని నమ్మించి మోసం చేసిన వారిపై చర్యలు చేపడితే ప్రజలు హర్షిస్తారని చెబుతున్నారు. బాధితులకు దళారుల నుంచి పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు.
అక్రమ నిర్మాణాలు కూల్చివేత
Comments
Please login to add a commentAdd a comment