అర్ధరాత్రి దొంగల బీభత్సం
హుజూరాబాద్/జగిత్యాల క్రైం: అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. రెండిళ్లలో చొరబడి భారీగా నగదు, ఆభరణాలు చోరీ చేశారు. కత్తులతో దాడి చేసి, బాధిత కుటుంబసభ్యులను గాయపరిచిన ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. హుజూరాబాద్ పట్టణంలోని ప్రతాపవాడకు చెందిన ప్రతాప రాఘవరెడ్డి ఇంటికి ఆదివారం అర్ధరాత్రి ముగ్గురు దొంగలు వచ్చారు. ఇంటి ఆవరణలోని వాటర్ మోటార్‌ను ఆన్ చేశారు. ఆఫ్ చేసేందుకు రాఘవరెడ్డి భార్య వినోద బయటకు రావడంతో దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. దంపతులపై దాడికి పాల్పడ్డారు. వారి కూతురు మానస గొంతుపై కత్తి పెట్టి, బెదిరించారు. తప్పించుకునే క్రమంలో రాఘవరెడ్డి, వినోదలకు గాయాలయ్యాయి. దొంగలు చంపుతామని బెదిరించడంతో బీరువా తాళాలు ఇచ్చారు. దీంతో రూ.7 లక్షలు, 80 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. వెళ్తూ గడియ పెట్టారని, మొదటి అంతస్తులో ఉన్న పెద్ద కుమారుడు నాగరాజుకు ఫోన్ చేయడంతో వచ్చి, గడియ తీశాడని బాధితులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఏసీపీ శ్రీనివాస్‌జీ, టౌన్ సీఐ తిరుమల్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, దొంగలను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.
జగిత్యాల పద్మనగర్‌లో..
జగిత్యాల పట్టణంలోని పద్మనగర్ వీధిలో ఆదివారం రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. గుండేటి రాజశేఖర్ తన ఇంటికి తాళం వేసి, రెండో అంతస్తులో నిద్రించాడు. దొంగలు తాళం పగులగొట్టి, 8 తులాల బంగారు ఆభరణాలు, రూ.15 వేలు ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం బీరువా పగులగొట్టి ఉండటంతో రాజశేఖర్ పోలీసులకు సమాచారం అందించాడు. పట్టణ ఎస్సై కిరణ్ సంఘటన స్థలానికి చేరుకొని, పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
రెండిళ్లలో రూ.7.15 లక్షలు, 88 తులాల ఆభరణాలు చోరీ
దంపతులకు గాయాలు
అర్ధరాత్రి దొంగల బీభత్సం
Comments
Please login to add a commentAdd a comment