
ఖాకీ.. కలవరం
● విధి నిర్వహణలో ఆటంకాలు ● ఇసుక ట్రాక్టర్ల ఓనర్ల ఇష్టారాజ్యం ● అడ్డుకునేందుకు వెళ్తే దాడులు ● ఆపై.. రాజకీయ ఒత్తిళ్లు ● చర్యలు తీసుకోలేకపోతున్న తీరు
కోరుట్ల:
● 15 రోజుల క్రితం కోరుట్ల మండలం నాగులపేటలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను అడ్డుకున్న కానిస్టేబుల్‌తో ఓ వ్యక్తి దురుసుగా ప్రవర్తించాడు. ఇది తోపులాట వరకూ వెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
● 10 రోజుల క్రితం మల్లాపూర్ మండలం మొగిలిపేట–నడికుడ గ్రామాల మధ్య భూ సరి హద్దు వివాదంలో సివిల్ డ్రెస్సులో ఉన్న ఓ కానిస్టేబుల్‌పైకి ఓ వ్యక్తి తిరగబడ్డాడు. పోలీసులు సంఘటనపై విచారణ జరిపి సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
● మెట్‌పల్లి మండలం వేంపేట సమీపంలో ఐదు రోజుల క్రితం అక్రమంగా ఇసుక తీసుకెళ్తున్న ట్రాక్టర్‌ను ఓ ఏఎస్సై, కానిస్టేబుల్ ఆపారు. ట్రాక్టర్ ఆపినందుకు ఓ వ్యక్తి పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగి నానా హంగామా చేశాడు. పోలీస్‌స్టేషన్‌లోనూ అదే తీరుతో వ్యహరించాడు. రాజకీయ ఒత్తిళ్లతో తర్జన భర్జన పడిన పోలీసులు చివరికి అతనిపై కేసు నమోదు చేశారు.
ఇలా వారం వ్యవధిలో పోలీసులపై తిరగబడిన ఘటనలు చోటు చేసుకోవడంతో విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలపై కిందిస్థాయి పోలీసు సిబ్బంది కలవరపడుతున్నారు. పోలీసు విధుల నిర్వహణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం తప్పనిసరి. కొన్ని సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు అనేక సమస్యల మధ్య చట్టపరిధిలో పనిచేసే పోలీసు సిబ్బంది నైతిక స్థైర్యం దెబ్బతీస్తుందన్న ప్రచారం జరుగుతోంది.
క్షేత్రస్థాయిలో తిప్పలే..
క్షేత్రస్థాయిలో పనిచేసే పోలీసు సిబ్బంది ఎక్కువగా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ నిక్కచ్చిగా అమలు అవసరమే అయినప్పటికీ.. పోలీసులు కనీసం లాఠీలు లేకుండా విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి నెలకొంది. సామూహికంగా జరిగే గొడవలు, ఉత్సవాలు, ఊరేగింపు వంటి సందర్భాలతోపాటు అక్రమ మార్గాల్లో ఇసుక, మొరం సరాఫరా చేస్తున్న వారు గంజాయి తీసుకుని గలాటాలు సృష్టించే వాళ్లు ఇలా కొంత మంది అసాంఘిక శక్తులు ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని దుర్వినియోగం చేస్తూ పోలీసు సిబ్బంది ఏం చేయరన్న ధీమాతో కొన్నిచోట్ల తమ ఇష్టం ఇచ్చినట్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. రాత్రి..పగలు తేడా లేకుండా పనుల్లో నిమగ్నం కావాల్సిన పోలీసు సిబ్బంది ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు మానసిక స్థైర్యం కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆయా పోలీసు ఉన్నతాధికారులు నిక్కచ్చిగా వ్యవహరించి పోలీసులపై తిరగబడుతున్న వారి విషయంలో కఠినంగా ఉండాల్సిన అవసరముంది.
రాజకీయ ఒత్తిళ్లు తప్పట్లేదు
కొంతమంది రాజకీయ నాయకుల అండ ఉందన్న ధీమాతో పోలీసులతో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మల్లాపూర్ మండలంలోని సరిహద్దు వివాదంతోపాటు మెట్‌పల్లి మండలం వేంపేట, నాగులపేట అక్రమ ఇసుక రవాణా సందర్భంలో దురుసుగా వ్యవహరించిన వారి తరఫున కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిళ్లు వచ్చినట్లు సమాచారం. దీంతో పోలీసు ఉన్నతాధికారులు సిబ్బందిపై తిరగబడిన వ్యక్తులపై చర్యలకు తర్జనభర్జన పడినట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పైస్థాయి అధికారుల పోస్టింగ్‌ల కోసం పైరవీలు తప్పనిసరి అన్న విషయం బహిరంగ రహస్యం. ఈ క్రమంలో పోలీసు సిబ్బందికి సమస్యలు ఎదురైనప్పుడు అధికారులు కఠినంగా వ్యవహరించలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒత్తిళ్లను పక్కనపెట్టి కింది స్థాయి సిబ్బందిలో మానసిక స్థైర్యం నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫలితంగా శాంతిభద్రతల పరిరక్షణలో క్షేత్రస్థాయి సిబ్బంది చక్కగా పనిచేయడంతో ప్రజలకు మేలు జరుగుతుందన్న వాదనలు ఉన్నాయి.