
చెరువులో మునిగి ఒకరి మృతి
● చేపలు పట్టేందుకు వెళ్లి గల్లంతు
ముస్తాబాద్(సిరిసిల్ల): చేపలు పట్టేందుకు వెళ్లి.. వ్యక్తి చెరువులో గల్లంతవగా.. మరొకరు సురక్షితంగా బయటపడ్డ సంఘటన ముస్తాబాద్ మండలం కొండాపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. కొండాపూర్‌కు చెందిన మహ్మద్ రషీద్(45), బాబా(30) గ్రామ శివారులోని పెద్ద చెరువులోకి చేపలు పట్టేందుకు ఆదివారం రాత్రి వెళ్లారు. ఇద్దరు వలతో చెరువులోకి దిగారు. రషీద్ చెరువులో మునిగిపోయాడు. రషీద్ కోసం బాబా ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో గ్రామంలోకి వెళ్లి విషయం తెలిపాడు. గ్రామస్తులు పెద్దచెరువులో రాత్రి ఎంత గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం సిరిసిల్ల నుంచి గజఈతగాళ్లను రప్పించారు. వారు రషీద్ మృతదేహాన్ని బయటకు తీసుకురావడంతో భార్య షెహనాజ్, కూతురు రేష్మ, కుమారుడు రఫీ, బంధువుల రోదనలు మిన్నంటాయి. రషీద్ ఆరు నెలల క్రితమే దుబాయ్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మూడేళ్ల క్రితం అదే చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి మహ్మద్ ఎక్రామ్ చనిపోయాడు.
విద్యుత్‌షాకుతో రైతు..
బుగ్గారం: పంటకు నీరు పెట్టడానికి వెళ్లి మోటార్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు వైరు తగిలి రైతు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బుగ్గారం మండలం గోపులాపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీధర్, బంధువుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గోవిందుల మల్లేశం(58) సోమవారం ఉదయం పెసరు, నువ్వుల పంటకు నీరు పెట్టడానికి వెళ్లాడు. స్టార్టర్ డబ్బా ఇనుపది కావడంతో సర్వీస్ వైరు మధ్యలో కొద్దిగా కట్ అయిన విషయం తెలియక మోటార్ స్టార్ట్ చేసేందుకు యత్నించాడు. డబ్బాకు అంటిన సర్వీస్ వైరుకు విద్యుత్ సరఫరా అయి రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మల్లేశం భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
సీఎంఆర్ చెల్లించాలి
జగిత్యాల: వానాకాలం సీజన్ 2024–25కు సంబంధించి సీఎంఆర్ రోజువారి లక్ష్యం ప్రకారం చెల్లించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బాయిల్డ్ రైస్‌మిల్లర్లతో సోమవారం సమీక్షించారు. మిల్లు కెపాసిటి ప్రకారం రోజువారి సీఎంఆర్ చెల్లింపులు చేయాలని ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నివేదిక సమర్పించాలన్నారు. ఎఫ్‌సీఐ అధికారులు సీఎంఆర్ గోదాముల్లో అవసరమైన స్థలం ఏర్పాటు చేయాలన్నారు. అదనపు కలెక్టర్ లత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

చెరువులో మునిగి ఒకరి మృతి

చెరువులో మునిగి ఒకరి మృతి