
కుష్ఠు రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం..
జనగామ రూరల్: కుష్ఠు వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని ధర్మకంచ జెడ్పీహెచ్‌ఎస్‌లో జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ.. జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా 30వ తేది నుంచి ఫిబ్రవరి 13 వరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పించాలన్నారు. కుష్ఠు వ్యాధి నిర్మూలన కోసం మహాత్మాగాంధీ ఎంతగానో కృషి చేశారని తెలిపారు. 1986 నుంచి కుష్ఠు నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ వ్యాధి నివారణకు ప్రభుత్వపరంగా ఆరోగ్య శాఖ ద్వారా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కుష్ఠు వ్యాధికి బహుళ ఔషధ చికిత్స ఉందని ఈ వ్యాధి ఉన్న రోగులను ముందుగానే గుర్తించి 6–12 నెలల పాటు చికిత్స అందిస్తారని అన్నారు. చర్మంపై స్పర్శ, నొప్పి, దురదలేని మచ్చలు, చెవులు, వీపుపై నొప్పిలేని బుడుపుల లక్షణాల వల్ల ఈ వ్యాధిని గుర్తించవచ్చన్నారు. అనంతరం విద్యార్థులకు అందించే భోజన వసతులను పరిశీలించారు. అంతకుముందు గాంధీజీ వర్ధంతి సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్‌బాషా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ మల్లికార్జున రావు, ప్రోగ్రామింగ్ అధికారి రవీందర్, భాస్కర్, వైద్యులు స్వర్ణ కుమారి, శ్యామ్ కుమార్, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా
Comments
Please login to add a commentAdd a comment