దేవాదుల మూడో ఫేజ్ ఆన్ చేయండి
జనగామ: నియోజకవర్గంలో దేవాదుల ఆయకట్టు పరిధిలో యాసంగి సీజన్‌లో సాగు చేసిన వరి, ఇతర పంటలను కాపాడేందుకు వెంటనే దేవాదుల మూడో ఫేజ్ బటన్ ఆన్‌చేసి సాగునీరు అందించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. చేర్యాల రెవెన్యూ డివిజన్, తపాస్‌పల్లి రిజర్వాయర్‌లో నీటిని నింపేందుకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డిని ఆదివారం కలిసి సహకారాన్ని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం ప్రాజెక్టుకు నీరు వస్తున్న క్రమంలో అత్యవసరంగా విడుదల చేసి, ఎండుతున్న వేలాది ఎకరాలను బతికించాలని విజ్ఞప్తి చేశారు. ఆలేరు ప్రాంతం ఆయకట్టు, కాల్వల పరిధిలో లేకున్నా, విప్ బీర్ల అయిలయ్య తపాస్‌పల్లి రిజర్వాయర్ వద్దకు వచ్చి నీళ్లన్నీ జులుం చేసి తీసుకుపోయారన్నారు. తపాస్‌పల్లి రిజర్వాయర్ నింపేందుకు ఎంపీ సహకారం అందించాలన్నారు.
ముందస్తు అరెస్ట్‌లు అప్రజాస్వామికం
జనగామ రూరల్: స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జనగామలో బీఆర్‌ఎస్ నేతలను ముందస్తు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్నారు. స్టేషన్ ఘన్‌ఫూర్‌లో పర్యటన ఉంటే జనగామ నేతలు ఎందుకు అరెస్ట్ చేశారో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికై నా నియోజకవర్గంలో ప్రజలు, రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. అలాగే సీపీఎం నాయకులను, ప్రజాసంఘాల నాయకులు, ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేసి సభ నిర్వహించడం సిగ్గుచేటని సీపీఎం జిల్లా కార్యదర్శి కనకారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు.
ఎంపీ సహకారం కోరిన ఎమ్మెల్యే పల్లా