జనగామ: కరువుతో పంటల దిగుబడి కోల్పోయి నష్టపోయిన రైతులు.. అకాల వర్షాలతో మరింత ఆగమై పోతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఆకస్మికంగా కురిసిన వాన మక్క రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. జిల్లాలో యాసంగి సీజన్ సాగు చేసిన మక్కజొన్న పంటను రైతులు అమ్ముకునేందుకు జనగామ వ్యవసాయ మార్కెట్‌కు వస్తున్నారు. గింజలు పచ్చిగా ఉండి తేమ శాతం ఎక్కువ చూపిస్తోంది. గిట్టుబిటు ధర పొందడానికి కాటన్ యార్డులో ఆరబోసుకుని రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వారం రోజుల నుంచి చెబుతున్నారు. అయితే శుక్రవారం అర్ధరాత్రి రైతులు గాఢనిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా కుండపోతగా వాన పడింది. రైతులు మేల్కొని చూసేసరికి గింజలు నీటిలో మునిగిపోవడమే కాకుండా వరదలో కొట్టుకుపోతుండగా కాపాడుకోవడానికి విశ్వప్రయత్నం చేశారు. మక్కల కుప్పల వద్ద పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. నీటిలో మునిగిన మక్కలను వేరు చేయగా.. కొంతమేర గింజలు నలుపురంగుకు వచ్చాయి. మరో రెండురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు.
పడిపోయిన ధర
మార్కెట్‌లో శనివారం మక్కలకు ధర పడిపోయింది. అకాల వర్షాల భయంతో రైతులు తక్కువ ధరకు అమ్ముకున్నారు. మక్కలు తడిసి పోవడంతో వ్యాపారులు తేమ సాకుతో క్వింటాకు రూ.150 నుంచి రూ.250 వరకు తగ్గించారు. ప్రైవేట్‌లో రూ.2,400 నుంచి రూ.2,500 వరకు ధర పలుకుతుండగా.. మార్కెట్‌లో రూ.1,855, రూ.1,925, రూ.2,066 ధరతో కొనుగోలు చేశారు. మక్కలకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ ధర తగ్గించడంపై రైతులు మండి పడుతున్నారు.
మార్కెట్‌లో తడిసిన మొక్కజొన్నలు
నిద్రలేచే సరికి నీళ్లలో గింజలు..
లబోదిబోమంటున్న అన్నదాతలు
అకాల వర్షం.. మక్క రైతు ఆగం
అకాల వర్షం.. మక్క రైతు ఆగం