దేవాదుల పూర్తి చేయడంలో ప్రభుత్వం విఫలం
జఫర్‌గఢ్ : దేవాదుల నిర్మాణ పనులు పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి విమర్శించారు. పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని మగ్ధుంతండా గ్రామం నుంచి చేపట్టిన రెండు రోజుల పాదయాత్రను సీహెచ్ రాజారెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో దేవాదుల ద్వారా ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలని రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టినప్పటికీ కాల్వల నిర్మాణ పనులు చేపట్టలేదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కాల్వల నిర్మాణ పనులు పూర్తి చేయడంతో పాటు సాగునీరు అందించి రైతులను ఆదుకుంటారని అనుకుంటే మెండిచేయి చూపడం తప్ప చేసిందేమి లేదన్నారు. జఫర్‌గఢ్ మండలంలో ఉప్పుగల్లు రిజర్వాయర్‌లో నీళ్లు ఉన్న కాల్వల నిర్మాణ పనులు పూర్తి చేయకపోవడంతో రైతులకు నీరందకుండాపోయిందన్నారు. ఎండిన పంటలకు ప్రభుత్వం ఎకరాకు రూ.50వేల పరిహారం చెల్లించాలన్నారు. అనంతరం పాదయాత్ర మగ్ధుంతండా నుంచి ప్రారంభమై ఓబులాపూర్, తమ్మడపల్లి (జి), జఫర్‌గఢ్, రేగడితండా మీదుగా తమ్మడపల్లి (ఐ) గ్రామం వరకు సాగింది. జిల్లా నాయకులు ఆది సాయన్న, ఆకుల శ్రీనివాస్, చొప్పరి సోమయ్య, రైతు సంఘం మండల అధ్యక్షుడు ఎండీ యాకూబ్‌పాష, పెండ్యాల సమ్మయ్య, మండల గట్టుమల్లు, కూరపాటి చంద్రమౌళి, అన్నెపు అజయ్, మంద బుచ్చయ్య, కుక్కల శోభ, జువారి భద్రమ్మ, అరుణ, కలకోట ప్రభాకర్, విష్ణు, పెద్ద రాజు, ఎర్ర సతీష్, మోడెం శంకర్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి రాజారెడ్డి