
ఆర్థిక సంక్షోభం ఉన్నా పథకాల అమలు
కాటారం: బీఆర్‌ఎస్ ప్రభుత్వం కారణంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. కాటారం మండల కేంద్రంలోని బీఎల్‌ఎం గార్డెన్స్‌లో శుక్రవారం సన్న బియ్యం ఉచిత పంపిణీ పథకాన్ని మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి నిరుపేద కడుపునింపడం కోసం ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్రంలో సన్న బియ్యం పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. గత ప్రభుత్వం ప్రాధాన్యత తక్కువ ఉన్న దొడ్డు బియ్యం పంపిణీ చేసిందని తెలిపారు. దీని ఫలితంగా రీసైక్లింగ్ జరిగి కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందన్నారు. సన్నబియ్యం వినియోగం పెంచి దొడ్డు బియ్యం రీసైక్లింగ్‌ను అరికట్టడానికి రేషన్‌దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీని ప్రభుత్వం ప్రారంభించినట్లు తెలిపారు. ప్రభుత్వంలో రేషన్ డీలర్లు భాగస్వాములని ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా సక్రమంగా పంపిణీ చేయాలని సూచించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని పేర్కొన్నారు. పైరవీలకు తావులేకుండా నిష్పక్షపాతంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్‌రెడ్డి, కలెక్టర్ రాహుల్‌శర్మ, సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఎస్‌ఓ శ్రీనాథ్, డీఎం రాములు, డీఆర్డీఓ నరేశ్, పరిశ్రమల శాఖ జీఎం సిద్ధార్థ, కాటారం సబ్ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
శ్రీధర్‌బాబు