ప్రైవేటుకే మొగ్గు..
గద్వాల: అసలే చలి తీవ్రత పెరిగింది.. వరి ధాన్యంలో తేమ శాతం ప్రభుత్వం సూచించిన 17శాతం లోపు ఉండడం కష్టమే.. ఇక ధాన్యం కొనుగోలులో కొత్త నిబంధనలతో తమ ధాన్యానికి రూ.500 బోనస్ వస్తుందా రాదా అన్న అనుమానాలు ఎన్నో. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వరకు సొంత ఖర్చులతో వాహనాల్లో తీసుకెళ్లడం మరింత భారం. ఇన్ని బాధలు పడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించే బదులు వ్యాపారులకు అమ్ముకోవడమే మేలని పలువురు రైతులు భావిస్తూ.. ప్రైవేట్ వ్యాపారుల విక్రయానికి మొగ్గుచూపుతున్నారనే విషయం లెక్కల ద్వారా తెలుస్తోంది. ఇదిలాఉండగా, వరి ధాన్యం రైతులకు గిట్టుబాటు ధర కల్పించి బోనస్ సైతం ఇచ్చి అండగా నిలబడతామని ప్రభుత్వం చెప్పిన హామీ కేవలం కాగితాలకే పరిమితం అని ధాన్యం కొనుగోలు ప్రక్రియ తీరును పరిశీలిస్తే అర్థమవుతుంది.
89వేల ఎకరాల్లో వరి సాగు..
జిల్లా వ్యాప్తంగా వరి పంట 89,605 ఎకరాల్లో సాగుచేశారు. ఇందులో 87,285ఎకరాల్లో సన్నరకం, 2320 ఎకరాల్లో లావు(దొడ్డు)రకం పంటను సాగుచేశారు. ఎకరాకు సుమారు 25క్వింటాళ్ల చొప్పున ఈసారి 2,08400 లక్షల మెట్రిక్ టన్నుల ఽవరి ధాన్యం దిగుబడి రావొచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. నెలరోజుల నుంచి పంట కోతలు మొదలై ధాన్యం చేతికొచ్చినప్పటికీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియ ద్వారా కేవలం 750 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసింది. దీంతో రైతులు చేసేది లేక ఇప్పటికే 25శాతం(50వేల మెట్రిక్ టన్నులు) ధాన్యం ప్రైవేటు వ్యాపారులకు విక్రయించారు. ఇదిలా ఉండగా మరోవైపు ప్రభుత్వం నిబంధనలతో ఇబ్బందులు పడుతున్న రైస్‌మిల్లర్లు ఇప్పటి వరకు కేవలం 12మంది రైస్ మిల్లర్లు మాత్రమే పూచికత్తు ఇచ్చారు. దీంతో ప్రభుత్వం కల్పిస్తానన్నా మద్దతు ధర, బోనస్ రైతులకు దక్కేనా అన్న మీమాంస ఏర్పడింది.
మందకొడిగా కొనుగోళ్లు
ప్రతిఏడాది మాదిరి ఈసారి రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి వారికి మద్దతు ధర కల్పించాలని నిర్ణయించింది. ఇందుకోసం పంటదిగుబడిని దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా మొత్తం 64కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇందులో 47 ఐకేపీ, 17 పీఏసీఎస్ ద్వారా ప్రారంభించారు. అయితే, ముఖ్యంగా ఏ గ్రేడ్ రకానికి రూ.2320 ఽమద్దతు ధర, సాధారణ రకానికి రూ.2300 మద్దతు ధర కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా ఇందులో సన్నరకం ధాన్యానికి అదనంగా రూ.500 బోనస్ కల్పించనున్నట్లు ప్రకటించింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 64కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా ఇప్పటి వరకు కేవలం 750 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారంటే క్షేత్రస్థాయిలో పరిస్థితికి అద్దం పడుతుంది.
25శాతం ధాన్యం ప్రైవేటు పరం
ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర, అదనపు బోనస్ వంటి హామీలు కేవలం గాలికబుర్లేనని జిల్లాలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ స్పష్టం చేస్తుంది. ఈ ఏడాది వానాకాలంలో సాగుచేసిన వరిపంట జిల్లా వ్యాప్తంగా నెలరోజుల నుంచి కోతలు మొదలై పంట కూడ చేతికొస్తుంది. అయితే ప్రభుత్వం ఇస్తామన్న మద్దతు ధరకోసం ఎదురుచూసిన రైతులు పరిస్థితి అందుకు భిన్నంగా ఉండడంతో చేసేది లేక ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ప్రధానంగా కె.టి.దొడ్డి, ధరూరు, గట్టు, మల్దకల్, అయిజ వంటి ప్రాంతాలకు చెందిన రైతులు వరిపంటను ముందుగానే సాగుచేయడంతో కోతలు కూడా నెలరోజుల నుంచే మొదలుపెట్టారు. ఇలా ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ అంచనా వేసిన 2లక్షల మెట్రిక్ టన్నుల ఽధాన్యంలో సుమారు 25శాతం పంట అంటే 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం చేతికిరాగా, వీటిని పక్క రాష్ట్రంలోని రాయచూరు జిల్లాలో విక్రయించారు. మొదట్లో సన్నరకానికి రూ.2200–2400 ధర పలికినప్పటికీ ప్రస్తుతం ధర రూ.2000కు పడిపోయింది. దీంతో ప్రభుత్వం కల్పిస్తానన్న మద్దతు ధర రైతన్నలకు ఎడారిలో ఎండమావి మాదిరి అయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మద్దతు ధర కల్పిస్తాం
వరిఽ ధాన్యం రైతులకు ప్రభుత్వ పరంగా మద్దతు ధర కల్పిస్తాం. అలాగే సన్నరకానికి అదనంగా రూ.500బోనస్ ఇస్తాం. జిల్లాలో అన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాం. ప్రభుత్వ నిబంధనల మేరకు జిల్లాలో ఇప్పటి వరకు 12 రైస్‌మిల్లర్లు పూచికత్తు ఇచ్చారు. మిగిలిన వారు ఇవ్వాల్సి ఉంది. అదేవిధంగా డిఫాల్ట్ మిల్లర్లకు ఎలాంటి ధాన్యం కేటాయించం.
– లక్ష్మీనారాయణ,
అదనపు కలెక్టర్ ( రెవెన్యూ)
ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రాలపై రైతుల అనాసక్తి
కొత్త నిబంధనలు.. మద్దతు ధరపై సందేహాలెన్నో..
62 రైస్ మిల్లులకు.. 12 మంది మిల్లర్లే బ్యాంకు పూచికత్తు
25 శాతం ధాన్యం ప్రైవేటు వ్యాపారులకు విక్రయం
Comments
Please login to add a commentAdd a comment