
ప్రతి రైతుకు యూనిక్ ఐడీ
ఐడీల ఆధారంగానే ప్రోత్సాహకాలు అందించే యోచన
●
విధివిధానాలు వస్తే చెబుతాం..
వ్యవసాయ రంగ డిజిటలైజేషన్‌లో భాగంగా రైతులకు ప్రత్యేక యూనిక్ ఐడీకి సంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేదు. కొత్త గుర్తింపు కార్డు గురించి ప్రభుత్వం నుంచి అలాంటి ఆదేశాల వస్తే వాటి విధివిధానాల గురించి రైతులకు చేరవేస్తాం. ప్రస్తుతానికి ఎలాంటి ఆదేశాలు రాలేదు.
– సక్రియానాయక్,
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
అలంపూర్: జిల్లాలోని ప్రతి రైతుకూ ఆధార్ తరహా యూనిక్ ఐడీలను ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఎన్నో ప్రోత్సాహకాలు, సబ్సిడీపై రుణాలు, వ్యవసాయ పరికరాలు, ధాన్యానికి మద్దతు ధర వంటివి ఇస్తున్నా.. అవగాహన లేని కారణంగా కొంత మంది రైతులు వీటిని పొందడంలో విఫలమవుతున్నారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి.. ప్రతి రైతుకు ప్రభుత్వ సాయం అందించడానికి త్వరలో ప్రతి రైతుకు యూనిక్ ఐడీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఆధార్ తరహా యూనిక్ ఐడీ తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
14 అంకెల గుర్తింపు కార్డు
పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న ప్రతి రైతుకు ఆధార్ తరహాలో ఒక యూనిక్ ఐడీ అందించనున్నాయి. కేంద్ర ప్రభుత్వ సూచనతో త్వరలో రాష్ట్రంలో ఫార్మర్ రిజిస్ట్రీ పేరుతో ఐడీ రాబోతుంది. వ్యవసాయ సంచాలకుల నేతృత్వంలో ఫార్మర్ రిజిస్ట్రీ జరగనున్నట్లు సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే చేయూత, ప్రోత్సాహకాలు అందించడానికి ప్రత్యేక యూనిక్ నంబర్ తప్పనిసరిగా భావిస్తున్నారు. ఈ విధానం ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించడం.. అది విజయవంతమవడంతో రాష్ట్రంలోను ప్రారంభించనున్నట్లు సమాచారం. 14 అంకెలతో కూడిన ఈ యూనిక్ ఐడీని రైతులకు గుర్తింపు కార్డు అందించడానికి సన్నహాలు చేస్తున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు వెళ్తే త్వరలోనే రైతులకు యూనిక్ ఐడీ కార్డు ప్రామాణికం కానుంది. అయితే సొంత భూమి కలిగిన పట్టాదారు రైతులకే ఈ యూనిక్ ఐడీ జారీ చేసే యోచన చేస్తున్నట్లు సమాచారం.
ఉపయోగాలెన్నో..
జిల్లాలోని 13 మండలాల్లో 46.49లక్షల ఎకరాలు సాగు భూమి ఉంది. పంట సాగు చేసే రైతులు 1.81 లక్షల మంది ఉన్నారు. ప్రభుత్వ రాయితీలు, పంటల బీమా, పీఎం కిసాన్ చెల్లింపులు, పంట రుణాలు, రాయితీపై వ్యవసాయ పరికరాలు అందించే తదితర పథకాలను యూనిక్ ఐడీతో అనుసంధానం చేయనున్నట్లు సమాచారం. వీటితోపాటు ప్రకృతి వైపరిత్యాలతో నష్టపోయే రైతులకు పరిహారం, పంట బీమా ద్వారా నష్టపరిహారం, భవిష్యత్‌లో రైతులకు అందిస్తున్న రైతు భరోసా వంటి వాటిని ఐడీ ఆధారం కానున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు నీటి పారుదల, తెగుళ్ల నియంత్రణ, వాతావరణ సూచనలు వంటి సేవలు నేరుగా రైతులకే అందేలా ఐడీని ఉపయోగించనున్నట్లు అధికారుల ద్వారా తెలుస్తుంది.
జిల్లా వివరాలిలా..
మండలం సాగు విస్తీర్ణం రైతుల సంఖ్య
(ఎకరాల్లో)
అయిజ 55,812 23,502
గద్వాల 46,242 19,252
మల్దకల్ 46,009 18,974
గట్టు 45,924 18,369
ధరూరు 36,125 14,622
కేటీదొడ్డి 35,606 12,542
మానవపాడు 31,643 11,587
ఉండవెల్లి 30,357 11,019
రాజోలి 25,369 10,865
వడ్డేపల్లి 27,177 10,884
అలంపూర్ 27,642 10,282
ఎర్రవల్లి 27,824 10,134
ఇటిక్యాల 29,178 9,887
వ్యవసాయ రంగం డిజిటలైజేషన్
వైపు అడుగులు
రైతు వివరాల నమోదుకు ప్రత్యేకంగా ఫార్మర్ రిజిస్ట్రీ ఏర్పాటు
జిల్లాలో 13 మండలాలు..
1.81 లక్షల మంది రైతులు

ప్రతి రైతుకు యూనిక్ ఐడీ
Comments
Please login to add a commentAdd a comment